కోహ్లి X బెయిర్‌స్టో

మబ్బులు కమ్మిన చల్లటి వాతావరణంలో జరుగుతున్న అయిదో టెస్టులో విరాట్‌ కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం వేడి రాజేసింది. మూడో రోజు ఆట ఆరంభమైన కొద్దిసేపటికే వీళ్లిద్దరూ గొడవ పడ్డారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 32వ ఓవర్లో తొలి బంతి ఆడిన తర్వాత కోహ్లి, బెయిర్‌స్టో మాటలు అనుకుంటూ..

Updated : 04 Jul 2022 07:03 IST

బ్బులు కమ్మిన చల్లటి వాతావరణంలో జరుగుతున్న అయిదో టెస్టులో విరాట్‌ కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం వేడి రాజేసింది. మూడో రోజు ఆట ఆరంభమైన కొద్దిసేపటికే వీళ్లిద్దరూ గొడవ పడ్డారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 32వ ఓవర్లో తొలి బంతి ఆడిన తర్వాత కోహ్లి, బెయిర్‌స్టో మాటలు అనుకుంటూ.. ఒకరిపైకి మరొకరు వచ్చారు. క్రీజులో నిలబడమంటూ బెయిర్‌స్టోకు కోహ్లి చెప్పడం కనిపించింది. బెయిర్‌స్టో కూడా దీటుగా స్పందించడంతో అంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ‘‘నోర్మూసుకుని.. నీ పని చూసుకో’’ అనే అర్థం వచ్చేలా కోహ్లి తన వేలిని నోటిపై పెట్టుకుని బెయిర్‌స్టోకు సూచించాడు. కోహ్లి మాట్లాడడం ఆపేయాలని బెయిర్‌స్టో చేతితో సైగ చేశాడు. అయితే కోహ్లి అనవసరంగా బెయిర్‌స్టోను రెచ్చగొట్టాడని మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘కోహ్లి మాటలకు ముందు బెయిర్‌స్టో స్ట్రైక్‌రేట్‌ 21. ఆ తర్వాత అది 150. పుజారా లాగా ఆడుతున్న అతణ్ని అనవసరంగా రెచ్చగొట్టిన కోహ్లి.. పంత్‌ లాగా ఆడేలా చేశాడు’’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. కోహ్లితో మాటల యుద్ధానికి ముందు 61 బంతుల్లో 13 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ఆ తర్వాత 79 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. రెండో రోజు ఆటలోనూ షమి బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇబ్బంది పడడాన్ని చూసి.. ‘‘సౌథీ కంటే కొంచెం వేగంగా బౌలింగ్‌ చేస్తున్నాడా.. హా?’’ అని కోహ్లి అనడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో చెలరేగిన బెయిర్‌స్టో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 377 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు