ఈ శతకం.. ఆత్మవిశ్వాస ప్రేరకం

ఇంగ్లాండ్‌లోని కఠిన పరిస్థితుల్లో చేసిన సెంచరీ.. బ్యాటర్‌గా తన హోదాను పెంచడమే కాకుండా ఆత్మవిశ్వాస ప్రేరకంగా పనిచేస్తుందని జడేజా అన్నాడు. అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ కీలక శతకం సాధించిన సంగతి తెలిసిందే.

Published : 04 Jul 2022 03:53 IST

రవీంద్ర జడేజా

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌లోని కఠిన పరిస్థితుల్లో చేసిన సెంచరీ.. బ్యాటర్‌గా తన హోదాను పెంచడమే కాకుండా ఆత్మవిశ్వాస ప్రేరకంగా పనిచేస్తుందని జడేజా అన్నాడు. అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ కీలక శతకం సాధించిన సంగతి తెలిసిందే. ‘‘భారత్‌ వెలుపల అది కూడా ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ ఆటగాడిగా ఇదెంతో గొప్ప విషయం. స్వింగ్‌కు అనుకూలించే ప్రత్యర్థి గడ్డపై చేసిన ఈ శతకాన్ని ఆత్మవిశ్వాస ప్రేరకంగా భావిస్తా. ఇంగ్లాండ్‌లో శరీరానికి దగ్గరగా బంతిని ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ కవర్‌డ్రైవ్‌, స్క్వేర్‌ డ్రైవ్‌లు ఆడాలని ప్రయత్నిస్తే బంతి బ్యాట్‌ అంచును తాకి వికెట్‌ కీపర్‌ లేదా స్లిప్‌ ఫీల్డర్ల చేతుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులను వదిలేయడంపై దృష్టి పెట్టా. నాకు దగ్గరగా వచ్చిన బంతులనే ఆడా. నాకు అనుకూల ప్రాంతంలో పడ్డ బంతులను షాట్లుగా మలిచా. ఇలాంటి పిచ్‌పై బంతి స్వింగ్‌ అవుతుంది. అందుకే క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేయాలి. మంచి బంతికి పేలవ షాట్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నా. పంత్‌తో బ్యాటింగ్‌ చేస్తుంటే మన మీద ఒత్తిడి ఉండదు. బౌలర్లు అతని వికెట్‌ కోసం ప్రయత్నించారు కాబట్టి నాపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేయడం ముఖ్యం. వికెట్‌ కోల్పోయే బంతి ఎప్పుడైనా రావొచ్చు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని పంత్‌, నేను అనుకున్నాం. నాకంటూ ప్రత్యేకంగా ఓ పేరు పెట్టుకోను. జట్టుకు ఏది అవసరమైతే అది చేస్తా’’ అని విదేశాల్లో తొలి సెంచరీ అందుకున్న జడ్డూ తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో వైఫల్యం గురించి ఆలోచించట్లేదని, భారత్‌ తరపున రాణించడం కంటే సంతృప్తి ఇంకేముంటుందని అతనన్నాడు. 2014 తర్వాత అండర్సన్‌ నా సామర్థ్యాన్ని గుర్తించినందుకు సంతోషంగా ఉందని జడ్డూ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని