క్వార్టర్స్‌లో హలెప్‌

గాయం కారణంగా గతేడాది వింబుల్డన్‌కు దూరమైన హలెప్‌.. ఈ సారి జోరుమీదుంది. ఈ మాజీ నంబర్‌వన్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ చేరింది. నాలుగో సీడ్‌ బడోసాను ఓడించి ఆమె ముందంజ వేయడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ జకోవిచ్‌కు ఎదురే లేకుండా పోయింది.

Updated : 05 Jul 2022 04:51 IST

బడోసాపై విజయం

జకోవిచ్‌, గారిన్‌ ముందంజ

లండన్‌

గాయం కారణంగా గతేడాది వింబుల్డన్‌కు దూరమైన హలెప్‌.. ఈ సారి జోరుమీదుంది. ఈ మాజీ నంబర్‌వన్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ చేరింది. నాలుగో సీడ్‌ బడోసాను ఓడించి ఆమె ముందంజ వేయడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ జకోవిచ్‌కు ఎదురే లేకుండా పోయింది. దూకుడు కొనసాగిస్తున్న అతను 13వ సారి ఈ టోర్నీలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. గారిన్‌ గొప్ప పోరాటంతో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ హలెప్‌ (రొమేనియా) దూసుకెళ్తోంది. తిరిగి ఫామ్‌ అందుకున్న ఈ మాజీ ఛాంపియన్‌ క్వార్టర్స్‌ గడప తొక్కింది. సోమవారం నాలుగో రౌండ్లో ఈ 16వ సీడ్‌ క్రీడాకారిణి 6-1, 6-2తో నాలుగో సీడ్‌ బడోసా (స్పెయిన్‌)పై విజయం సాధించింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం హలెప్‌దే. తొలి సెట్‌లో మొదటి గేమ్‌ మాత్రమే బడోసా ఖాతాలో చేరింది. ఆ తర్వాత ఆట మొత్తం హలెప్‌ నియంత్రణలోనే సాగింది. రెండో సెట్‌లోనూ ఆమె దూకుడు కొనసాగింది. మ్యాచ్‌లో 3 ఏస్‌లు కొట్టిన ఆమె.. 17 విన్నర్లు రాబట్టింది. మరోవైపు రిబాకినా (కజకిస్థాన్‌) 7-5, 6-3తో మార్టిచ్‌ (క్రొయేషియా)పై విజయంతో తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బరిలో మిగిలిన ఉత్తమ సీడ్‌ క్రీడాకారిణి జాబెర్‌ (ట్యునీషియా) ముందంజ వేసింది. ఈ మూడో సీడ్‌ అమ్మాయి 7-6 (11-9), 6-4తో మర్టెన్స్‌ (బెల్జియం)పై గెలిచి వరుసగా రెండో ఏడాది వింబుల్డన్‌ క్వార్టర్స్‌ చేరింది. మూడో రౌండ్లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌పై గెలిచి సంచలనం నమోదు చేసిన కార్నెట్‌ (ఫ్రాన్స్‌) పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. ఆమె 6-4, 4-6, 3-6తో ఐలా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.

అద్భుత పోరాటం..: పురుషుల సింగిల్స్‌లో గారిన్‌ సంచలన ప్రదర్శనతో క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. నాలుగో రౌండ్లో అతను 2-6, 5-7, 7-6 (7-3), 6-4, 7-6 (10-6)తో డిమినార్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. 2009 (గొంజాలెజ్‌) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి చిలీ ఆటగాడిగా అతను నిలిచాడు. 4 గంటల 34 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో అతని అద్భుత పోరాటం ఆకట్టుకుంది. తొలి రెండు సెట్లలో గెలిచి దూకుడు మీదున్న డిమినార్‌ మ్యాచ్‌ గెలిచేటట్లే కనిపించాడు. కానీ మూడో సెట్లో గొప్పగా పుంజుకుని దాన్ని టైబ్రేకర్‌కు మళ్లించి పైచేయి సాధించిన గారిన్‌.. ఆ తర్వాత ఇక పట్టు వదల్లేదు. నాలుగో సెట్‌ గెలిచి ఆశలు సజీవంగా ఉంచుకున్న అతను.. చివరి సెట్లో రెండు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకున్నాడు. చివరకు టైబ్రేకర్‌లో విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 5 ఏస్‌లు, 56 విన్నర్లు కొట్టాడు. ఇతర ప్రి క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) 4-6, 6-4, 7-6 (7-2), 3-6, 6-2తో నకషిమా (అమెరికా)ను, 11వ సీడ్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6-3, 6-1, 6-4తో జేసన్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ 6-2, 4-6, 6-1, 6-2తో టిమ్‌ వాన్‌ (నెదర్లాండ్స్‌)పై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. తొలి సెట్‌లో కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయిన జకోకు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ఓటమి ఎదురైంది. కానీ తిరిగి గొప్పగా పుంజుకున్న అతను తర్వాతి రెండు సెట్లలో చెలరేగి వింబుల్డన్‌లో వరుసగా 25వ విజయాన్ని అందుకున్నాడు. పదో సీడ్‌ సిన్నర్‌ (ఇటలీ) 6-1, 6-4, 6-7 (8-10), 6-3తో అయిదో సీడ్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌)కు షాకిచ్చి వింబుల్డన్‌లో తొలిసారి క్వార్టర్స్‌ చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని