Updated : 05 Jul 2022 04:37 IST

సంక్షిప్త వార్తలు

ఆ మైదానాల నుంచే స్టార్లు వస్తారేమో

మైదానాల్లో కనీస వసతులు కల్పించాలన్న బాంబే హైకోర్టు

ముంబయి: ప్రజా మైదానాల్లో మూత్రశాలలు, తాగునీటి వసతి, వైద్య సాయం లాంటి కనీస సదుపాయాలు కల్పించాలని బీసీసీఐ, మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ), మహారాష్ట్ర అధికారులను బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలోని చాలా మైదానాల్లో కనీస వసతులు లేవనే విషయంపై హైకోర్టు న్యాయవాది రాహుల్‌ తివారి దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌ అనిల్‌, జస్టిస్‌ కర్ణిక్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు, శిబిరాల కోసం అద్దె చెల్లిస్తున్నప్పటికీ చాలా మైదానాల్లో తాగడానికి మంచి నీరు, మూత్రశాలలు లేవని రాహుల్‌ కోర్టుకు తెలిపారు. ఈ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ‘‘మీరెప్పుడైనా కనీస వసతులు కల్పించాలని కోరితే బీఎంసీ అధికారులు నిరాకరించారా? అయితే అఫిడవిట్‌ దాఖలు చేయండి. ఇదేమీ వ్యతిరేక వ్యాజ్యం కాదు. ఈ ప్రజా మైదానాల నుంచి మీ తర్వాతి స్టార్‌ ఆటగాడు వస్తాడేమో. ఈ మైదానాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన చిన్నారులు ఆడుతున్నారు. నిధులు లేవనే సాకుతో తప్పించుకోవాలని చూడొద్దు. కేవలం చిన్నారులనే అని కాదు పెద్దలనూ ఆటల్లో ప్రోత్సహించాలి’’ అని పేర్కొంది.


శ్రీలంక స్ప్రింటర్‌ 10 సెకన్లలోపు

బాసెల్‌: శ్రీలంక స్ప్రింటర్‌ యుపున్‌ అబెకూన్‌ చరిత్ర సృష్టించాడు. 100 మీటర్ల పరుగును 10 సెకన్ల లోపు పూర్తి చేసిన మొదటి దక్షిణాసియా స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం రెసిస్ప్రింట్‌ అంతర్జాతీయ టోర్నీలో 100 మీ పరుగును అబెకూన్‌ 9.96 సెకన్లలో పూర్తిచేశాడు. జర్మనీలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తను నమోదు చేసిన రికార్డు (10.06 సె)ను అబెకూన్‌ తిరగరాశాడు. అబెకూన్‌ రికార్డుతో 10 సెకన్ల లోపు స్ప్రింటర్‌ను కలిగిన 32వ దేశంగా శ్రీలంక ఘనత సాధించింది.


వెస్టిండీస్‌దే రెండో టీ20

రొసౌ: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో వెస్టిండీస్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోమన్‌ పావెల్‌ (61 నాటౌట్‌) చెలరేగడంతో మొదట వెస్టిండీస్‌  5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కింగ్‌ (57), పూరన్‌ (34) రాణించారు. ఛేదనలో తడబడ్డ బంగ్లా.. 6 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. షకిబ్‌ (68 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. షెపర్డ్‌ (2/28), మెకాయ్‌ (2/37), అకీల్‌ (1/27) బంగ్లాను దెబ్బతీశారు.  ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దయింది.


బౌలర్లకు సహనం అవసరం: సిరాజ్‌

బర్మింగ్‌హామ్‌: మూడో రోజు ఆట సందర్భంగా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో చెలరేగినా తాము ఆందోళన చెందలేదని టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ సిరాజ్‌ అన్నాడు. పరిస్థితులకు సానుకూలంగా లేనప్పుడు బౌలర్లు సహనంగా ఉండడం అవసరమని చెప్పాడు. ‘‘బౌలర్లుగా మేం సహనం వహించాలి. బెయిర్‌స్టో ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ నుంచి నిరంతరాయంగా ఎటాకింగ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. అతడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని మాకు తెలుసు. ప్రాథమికాంశాలకు కట్టుబడి ఉండాలన్నది మా ప్రణాళిక. మా సామర్థ్యాన్ని మేం నమ్మాం. అతడెంత బాగా ఆడినా ఒక్క మంచి బంతితో అతడి ఇన్నింగ్స్‌ ముగిసిపోతుందని మాకు తెలుసు’’ అని సిరాజ్‌ అన్నాడు.


ఆ జరిమానా కట్టలేం
ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌

లండన్‌: వింబుల్డన్‌లో ఆడకుండా రష్యా, బెలారస్‌ ఆటగాళ్లపై నిషేధం విధించినందుకు గాను డబ్ల్యూటీఏ మహిళల ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ టూర్‌ విధించిన జరిమానాను ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ సవాల్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల ప్లేయర్లు ఈ ఏడాది వింబుల్డన్‌లో ఆడకుండా ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ నిషేధం విధించింది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేసిన డబ్ల్యూటీఏ, ఏటీపీ.. ఈ టోర్నీలో పోటీపడే ప్లేయర్లకు ర్యాంకింగ్‌ పాయింట్లు ఇవ్వబోమని స్పష్టం చేశాయి. ఇక డబ్ల్యూటీఏ విధించిన జరిమానాను ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ సవాల్‌ చేస్తోంది. మరోవైపు వింబుల్డన్‌కు ముందు సన్నాహక టోర్నీల్లోనూ ఆ రెండు దేశాల ప్లేయర్లను అనుమతించనందుకు తమపై డబ్ల్యూటీఏ విధించిన జరిమానాను బ్రిటీష్‌ లాన్‌ టెన్నిస్‌ సంఘం (ఎల్‌టీఏ) కూడా సవాలు చేయాలనుకుంటోంది. ఎల్‌టీఏకు దాదాపు రూ.5.91 కోట్లు (7,50,000 అమెరికా డాలర్లు), ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌కు సుమారు రూ.1.97 కోట్లు (2,50,00 అమెరికా డాలర్లు) కలిపి మొత్తం రూ.7.89 కోట్లు (1 మిలియన్‌ అమెరికా డాలర్లు) జరిమానాగా విధించినట్లు సమాచారం.


మెల్‌బోర్న్‌ జట్టులో హర్మన్‌

మెల్‌బోర్న్‌: భారత స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌కు వరుసగా రెండో ఏడాది ప్రాతినిధ్యం వహించనుంది. గత సీజన్లో 406 పరుగులతో మెల్‌బోర్న్‌ జట్టు తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన ఈ ఆల్‌రౌండర్‌.. 15 వికెట్లు కూడా పడగొట్టింది. ‘‘మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌కు వరుసగా రెండో సీజన్లో ఆడడం ఆసక్తిని రేపుతోంది. గతేడాది జట్టులో భాగం కావడాన్ని ఆస్వాదించా. పూర్తి స్థాయిలో రాణించా. ఈసారీ సత్తా చాటాలని భావిస్తున్నా’’ అని హర్మన్‌ చెప్పింది. గత సీజన్లో నాలుగో స్థానంలో వచ్చిన ఈ భారత స్టార్‌... పలు మ్యాచ్‌ల్లో రెనిగేడ్స్‌ను గెలిపించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని