Updated : 06 Jul 2022 09:52 IST

IND vs ENG : పడగొట్టలేక పంచుకున్నారు

ఇంగ్లాండ్‌ రికార్డు ఛేదన

7 వికెట్ల తేడాతో ఘనవిజయం

రెచ్చిపోయిన రూట్‌, బెయిర్‌స్టో 

సిరీస్‌ 2-2తో సమం

బర్మింగ్‌హామ్‌

‘‘అప్పుడైతే గెలిచేవాళ్లు కానీ.. ఇప్పుడు మాత్రం కష్టమే’’

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడబోతుండగా.. టీమ్‌ఇండియా విజయావకాశాలపై ఎక్కువమంది అంచనా ఇది! ఆ అంచనాకు తగ్గట్లే మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించినా.. అద్భుతంగా పుంజుకుని మూడు రోజుల పాటు ఆటలో ఆధిపత్యం చలాయించిన భారత్‌.. ప్రత్యర్థికి ఆఖరి పంచ్‌ ఇవ్వడంలో మాత్రం విఫలమైంది.

పెద్ద లక్ష్యాల్ని ఛేదించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఇంగ్లిష్‌ జట్టు ముందు 378 పరుగుల లక్ష్యం కూడా నిలవలేదు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ జో రూట్‌, బెయిర్‌స్టో భారత బౌలింగ్‌ను ఉతికారేయడంతో ఇంగ్లిష్‌ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్‌ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యాయి. తొమ్మిది నెలల పాటు 2-1 ఆధిక్యంతో సంబరపడ్డ టీమ్‌ఇండియా.. చివరికిప్పుడు ఆఖరి టెస్టు పూర్తయ్యేసరికి 2-2తో సంతృప్తిపడక తప్పలేదు.

ఇంగ్లిష్‌ గడ్డపై పరాజయాల పరంపరకు తెరదించి, టెస్టు సిరీస్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని భారత్‌ ఉపయోగించుకోలేకపోయింది. నిరుడు సిరీస్‌ ఆగిపోయినప్పటికి.. ఇప్పుటికి చాలా మారిన ఇంగ్లిష్‌ జట్టు.. ఏకంగా 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 259/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఇంకో వికెట్‌ కోల్పోకుండానే ఛేదన పూర్తి చేసింది. రూట్‌ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 19X4, 1X6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (114 నాటౌట్‌; 145 బంతుల్లో 15X4, 1X6) చివరి రోజు మరింత ధాటిగా ఆడి మిగతా పని పూర్తి చేశారు. వీళ్లిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 269 పరుగులు జోడించారు. భారత్‌ తరఫున బుమ్రా, ఇంగ్లాండ్‌ తరఫున రూట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యారు.

ఆ సిక్స్‌.. వారి ధాటికి సంకేతం: రూట్‌ ఓవర్‌నైట్‌ స్కోరు 76 కాగా.. బెయిర్‌స్టోది 72. అప్పటికే వారి భాగస్వామ్యం 150 పరుగులకు చేరుకుంది. 7 వికెట్లు చేతిలో ఉండగా చేయాల్సిన పరుగులు 119 మాత్రమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే ఇంగ్లాండ్‌ విజయం దాదాపు ఖరారైపోయింది! కానీ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో.. ఆరంభంలోనే ఒకట్రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెడుతారేమో.. వరుణుడేమైనా ఆదుకుంటాడేమో.. ఆట గమనం మారుతుందేమో అని ఏ మూలో చిన్న ఆశ! కానీ అలాంటివేమీ జరగలేదు. రూట్‌, బెయిర్‌స్టో నాలుగో రోజును మించి దూకుడుగా ఆడారు. మామూలుగా ఆచితూచి ఆడే రూట్‌.. మంగళవారం చెలరేగిన తీరు ఆశ్చర్యం కలిగించేదే. స్టోక్స్‌కు సారథ్యం అప్పగించాక స్వేచ్ఛగా ఆడుతూ పరుగుల వరద పారిస్తున్న అతను.. కొత్త కెప్టెన్‌ శైలిని అందిపుచ్చుకుంటూ చాలా దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. పేసర్‌ అయిన శార్దూల్‌ బౌలింగ్‌లో రివర్స్‌ షాట్‌తో రూట్‌ సిక్సర్‌ కొట్టిన వైనం చివరి రోజు ఆటకే హైలైట్‌. సంప్రదాయ టెస్టు బ్యాట్స్‌మన్‌లా కనిపించే రూట్‌.. టీ20లను తలపిస్తూ ఇలాంటి షాట్‌ ఆడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఇంగ్లాండ్‌ దృక్పథానికి ఈ షాట్‌ అద్దం పట్టింది. మిగిలిన 119 పరుగులు రాబట్టడానికి ఇంగ్లాండ్‌కు కేవలం 20 ఓవర్లే అవసరం అయ్యాయి. రూట్‌ 61 బంతుల్లోనే 66 పరుగులు చేయడం విశేషం. రూట్‌ తనలా ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగిస్తుంటే.. తన సహచరుడి శైలిలో ఆచితూచి ఆడాడు బెయిర్‌స్టో. ముందు రూట్‌ శతకం పూర్తి చేసుకోగా.. బెయిర్‌స్టో ఆట ఆఖర్లో మూడంకెల స్కోరునందుకున్నాడు. పిచ్‌, పరిస్థితులు బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉండడంతో బుమ్రా సహా భారత బౌలర్లంతా సాధారణంగా మారిపోయారు. వికెట్‌ తీసేందుకు అవకాశాలే సృష్టించుకోలేకపోయారు. మొత్తం 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 4.93 రన్‌రేట్‌తో 76.4 ఓవర్లలోనే ఛేదించేయడం విశేషం.


0

ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఒక్క విజయమూ సాధించలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఓడి, ఒకటి డ్రాగా ముగించింది.


378

టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గత రికార్డు (ఆసీస్‌పై 359)ను ఆ జట్టు మెరుగుపర్చుకుంది.


ఇంగ్లాండ్‌లో భారత్‌కిది 19వ టెస్టు సిరీస్‌. సిరీస్‌ కోల్పోకుండా పర్యటనను ముగించడమిది అయిదోసారి. 1971లో 1-0తో, 1986లో 2-0తో, 2007లో 1-0తో సిరీస్‌లు సాధించిన భారత్‌.. 2002లో 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సిరీస్‌ను డ్రాగా ముగించింది. మిగతా 14 సందర్భాల్లో సిరీస్‌ చేజారింది.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416; ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 245

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లీస్‌ రనౌట్‌ 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; రూట్‌ నాటౌట్‌ 142; బెయిర్‌స్టో నాటౌట్‌ 114; ఎక్స్‌ట్రాలు 20 మొత్తం: (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378; వికెట్ల పతనం: 1-107, 2-107, 3-109; బౌలింగ్‌: బుమ్రా 17-1-74-2; షమి 15-2-64-0; జడేజా 18.4-3-62-0; సిరాజ్‌ 15-0-98-0; శార్దూల్‌ 11-0-65-0


 

‘‘తీరికలేని క్రికెట్‌ ఆడుతున్నాం. అవలోకనం చేసుకోవడానికి సమయమే లేదు. మరో రెండు రోజుల్లో మనం పూర్తిగా భిన్నమైన దాని గురించి (టీ20 క్రికెట్‌) మట్లాడబోతున్నాం. కానీ మేం కచ్చితంగా మా ఆట తీరును విశ్లేషించుకుంటాం. ప్రతి మ్యాచూ మాకో పాఠమే. టెస్టు మ్యాచ్‌ మూడో ఇన్నింగ్స్‌లో మేం ఎందుకు సరిగా బ్యాటింగ్‌ చేయాలేకపోయామో, నాలుగో ఇన్నింగ్స్‌లో ఎందుకు పది వికెట్లు పడగొట్టలేకపోయామో సమీక్షిస్తాం. మేము ఆ అంశం (ఇటీవల కాలంలో మూడు, నాలుగో ఇన్నింగ్స్‌ల్లో ప్రదర్శన తగ్గుతుండడంపై) దృష్టిసారించాల్సివుంది. గత కొన్నేళ్లలో మేం గొప్పగా రాణించాం. అవసరమైన వికెట్లు తీయగలిగాం. కానీ గత కొన్ని నెలలుగా అలా చేయలేకపోతున్నాం’’

- రాహుల్‌ ద్రవిడ్‌


భారత అభిమానులపై జాతి వివక్ష!

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా అయిదో టెస్టు సందర్భంగా ఆతిథ్య జట్టు మద్దతుదారులు తమ పట్ల జాతివివక్ష చూపించారని భారత అభిమానులు ఆరోపించారు. నాలుగో రోజు ఆట సందర్భంగా స్టేడియంలో ఇంగ్లాండ్‌ అభిమానులు తమను దూషించారంటూ పలువురు భారతీయులు ట్విటర్లో పోస్టులు పెట్టగా.. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు, వార్విక్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ స్పందించాయి. దీనిపై విచారణ జరుపుతామని పేర్కొన్నాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని