Published : 06 Jul 2022 02:57 IST

చెమటోడ్చిన జకోవిచ్‌

కష్టంగా సెమీస్‌లో ప్రవేశం

లండన్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ (సెర్బియా) వింబుల్డన్‌లో పెద్ద ముప్పును తప్పించుకున్నాడు. అద్భుతంగా పోరాడి... కష్టంగా సెమీఫైనల్‌ చేరుకున్నాడు. మంగళవారం అయిదు సెట్ల పాటు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్‌ 5-7, 2-6, 6-3, 6-2, 6-2తో ఇటలీ యువ ఆటగాడు సిన్నర్‌పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఓడిన తర్వాత జకోవిచ్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. తొలి సెట్‌ జకోవిచ్‌కు పెద్ద షాకే. మొదట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అతడు.. 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు. తొలి గేమ్‌లో అలవోకగా సర్వీసును నిలబెట్టుకున్న జకోవిచ్‌.. రెండో గేమ్‌లో బ్రేక్‌ సాధించాడు. వెంటనే సర్వీసును నిలబెట్టుకున్నాడు. క్రమంగా 4-1తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ సిన్నర్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. 7వ, 11వ గేముల్లో బ్రేక్‌లతో 6-5తో నిలిచిన అతడు.. 12వ గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకున్నాడు. సిన్నర్‌ రెట్టించిన విశ్వాసంతో రెండో సెట్లో మరింత చెలరేగాడు. కోర్టు అన్ని వైపులా చక్కని షాట్లు ఆడిన అతడు.. మూడు, ఏడో గేముల్లో బ్రేక్‌లతో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. బలమైన ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో దూసుకుపోతున్న సిన్నర్‌ను చూస్తే సంచలనం సృష్టిస్తాడేమో అనిపించింది. కానీ అనుభవాన్నంతా ఉపయోగించిన జకోవిచ్‌ పుంజుకున్నాడు. మూడో సెట్‌ నాలుగో గేమ్‌లో ట్రిపుల్‌ బ్రేక్‌ పాయింట్‌పై నిలిచిన అతడు.. అలవోకగా బ్రేక్‌ సాధించాడు. తర్వాత సర్వీసు నిలబెట్టుకుని 4-1తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది లేకుండానే సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అక్కడి నుంచి జకోవిచ్‌కు తిరుగులేకుండా పోయింది. మరింత ఉత్సాహంతో ఆడిన అతడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. జకోవిచ్‌ జోరు ముందు సిన్నర్‌ నిలవలేకపోయాడు. తొలి, మూడో గేముల్లో బ్రేక్‌ సాధించి 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జకోవిచ్‌.. జోరు కొనసాగిస్తూ అలవోకగా నాలుగో సెట్‌ను చేజిక్కించుకుని స్కోరును 2-2తో సమం చేశాడు. నిర్ణయాత్మక అయిదో సెట్లోనూ జకోవిచ్‌ది అదే దూకుడు. మూడు, ఏడో గేముల్లో బ్రేక్‌లతో 5-2తో ఆధిక్యం సంపాదించిన అతడు.. ఎనిమిదో గేమ్‌లో అలవోకగా సర్వీసు నిలబెట్టుకుని విజేతగా నిలిచాడు. మరోవైపు రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో అతడు 6-4, 6-2, 7-6 (8/6)తో వాండె జాండ్‌షుల్స్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు.

మరియా 34 ఏళ్ల వయసులో..: జర్మనీకి చెందిన తజానా మరియా 34 వయసులో మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరడం ఆమెకిదే తొలిసారి. క్వార్టర్‌ఫైనల్లో మరియా 4-6, 6-2, 7-5తో జర్మనీకే చెందిన 22 ఏళ్ల నైమియర్‌ను ఓడించింది. మరియా ఇద్దరు బిడ్డల తల్లి. గత ఏడాదే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. జాబర్‌ (టునీసియా) 3-6, 6-1, 6-1తో బజ్‌కోవా (చెక్‌)ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

సెమీఫైనల్లో సానియా: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా దూసుకెళ్తోంది. పవిచ్‌ (క్రొయేషియా)తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గంట 41 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఈ జంట 6-4, 3-6, 7-5తో నాలుగో సీడ్‌ గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా), జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా) ద్వయంపై విజయం సాధించింది. మ్యాచ్‌లో సానియా, పవిచ్‌ ఎనిమిది ఏస్‌లు కొట్టారు. సానియా జంట సెమీస్‌లో ఒస్తాపెంకో (లాత్వియా), రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జోడీతో తలపడుతుంది. వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2011, 2013. 2015లో ఆమె ఇక్కడ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. సానియా ఖాతాలో లేని మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ వింబుల్డన్‌ ఒక్కటే. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ అయిన సానియా.. ఈ సీజన్‌ ఆఖర్లో రిటైర్‌కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని