కోహ్లి ఏంటో మాకు తెలుసు

టెస్టులు, వన్డేలు, టీ20లు అని తేడా లేదు.. అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, ఐపీఎల్‌ అయినా ఒకటే.. అన్ని చోట్లా వైఫల్యాలే వెంటాడుతున్నాయి విరాట్‌ కోహ్లిని. అతను ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేసి రెండున్నరేళ్లు దాటిపోయింది. ఒకప్పుడు మంచినీళ్ల ప్రాయంగా

Updated : 12 Jul 2022 10:28 IST

బయటి వాళ్ల మాటల్ని పట్టించుకోం

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

నాటింగ్‌హామ్‌: టెస్టులు, వన్డేలు, టీ20లు అని తేడా లేదు.. అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, ఐపీఎల్‌ అయినా ఒకటే.. అన్ని చోట్లా వైఫల్యాలే వెంటాడుతున్నాయి విరాట్‌ కోహ్లిని. అతను ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేసి రెండున్నరేళ్లు దాటిపోయింది. ఒకప్పుడు మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు కొట్టేసిన వాడు.. ఇప్పుడు 50 చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో, ఆత్మవిశ్వాస లోపంతో కనిపిస్తున్నాడు విరాట్‌. తరచుగా విశ్రాంతి తీసుకుంటూ పునరుత్తేజం పొందే ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఇంగ్లాండ్‌ పర్యటనలో అతను పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లిష్‌ జట్టుతో చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 11, 20 పరుగులే చేసిన అతను.. ఆడిన రెండు టీ29ల్లో 1, 11 పరుగులకు పరిమితం అయ్యాడు. దీంతో కోహ్లిపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం కోసం చాలామంది కుర్రాళ్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌ వరకు విరాట్‌ను తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ సైతం ఇదే మాట అన్నాడు. అయితే టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం ఈ విమర్శలను కొట్టి పడేశాడు. కోహ్లి ప్రతిభేంటో తమకు తెలుసని, దాని గురించి ఎవరూ ప్రశ్నించజాలరని అతనన్నాడు. ‘‘మేం బయట ఎవరేమనుకుంటున్నారన్నది అసలు పట్టించుకోం. కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అసలు నిపుణులుగా పేర్కొనే వాళ్లను అలా ఎలా అంటారో అర్థం కావడం లేదు. బయటి నుంచి చూసేవారికి అసలు జట్టు లోపల ఏం జరుగుతోందో తెలియదు. మాకంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది. దానికి అనుగుణంగా జట్టును తయారు చేసుకుంటాం. మేం అన్నీ చర్చించుకుంటాం. చాలా ఆలోచిస్తాం. మేం ఎంచుకునే ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాం. అవకాశాలు ఇస్తాం. బయటి వాళ్లకు ఇవన్నీ తెలియవు. కాబట్టి జట్టు లోపల ఏం జరుగుతోందన్నది నాకు ముఖ్యం. ఫామ్‌ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరి కెరీర్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. అంతే తప్ప ఒక ఆటగాడి నాణ్యత అన్నది దెబ్బ తినదు. మేం మద్దతుగా నిలిచేది దానికే. విమర్శలు వచ్చినపుడు మేం ఆ విషయమే దృష్టిలో పెట్టుకుంటాం. ఇలా నాకూ జరిగింది. ఇంకొకరికి కూడా జరుగుతుంది. ఇది కొత్త కాదు. ఒక ఆటగాడు ఎంతో కాలం నిలకడగా ఆడాక, ఒకట్రెండు సిరీస్‌లతో తన సేవల్ని మరిచిపోకూడదు. ఆ ఆటగాడి ప్రాధాన్యం ఏంటో మాకు తెలుసు. బయటి వాళ్లకు విమర్శించే హక్కుంటుంది. కానీ మాకు దాంతో సంబంధం లేదు’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని