IND vs ENG : క్లైమాక్స్‌ కేక

అవతలున్నది ప్రపంచ ఛాంపియన్‌. ఆడుతోంది వాళ్ల గడ్డపై. లక్ష్యం 260 పరుగులు కాగా.. 72 పరుగులకే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌  చేరిపోయారు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది.. ప్రత్యర్థి బౌలర్లు జోరుమీదున్నారు.

Updated : 18 Jul 2022 08:26 IST

పంత్‌ మెరుపు సెంచరీ
హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
మూడో వన్డేలో భారత్‌ విజయం
ఇంగ్లాండ్‌పై సిరీస్‌ 2-1తో కైవసం

అవతలున్నది ప్రపంచ ఛాంపియన్‌. ఆడుతోంది వాళ్ల గడ్డపై. లక్ష్యం 260 పరుగులు కాగా.. 72 పరుగులకే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌  చేరిపోయారు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది.. ప్రత్యర్థి బౌలర్లు జోరుమీదున్నారు. అభిమానులేమో ఓటమికి మానసికంగా సిద్ధమైపోయారు!

మరో ఆటగాడైతే ఈ స్థితిలో ఒత్తిడికి చిత్తయిపోయేవాడే! కానీ అక్కడున్నది రిషబ్‌ పంత్‌. ఒత్తిడిని చిత్తు చేస్తూ.. అతను మొత్తం కథ మార్చేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నా చెలరేగిపోయే రిషబ్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం కాసేపు ఆచితూచే ఆడాడు. కుదురుకున్నాక తనదైన శైలిలో చెలరేగిపోయాడు. బంతితో ప్రత్యర్థిని దెబ్బ కొట్టిన హార్దిక్‌ పాండ్య.. బ్యాటుతోనూ సత్తా చాటుతూ పంత్‌కు సహకరించడంతో భారత్‌ అద్భుత విజయాన్నందుకుంది. చివరి టెస్టులో బాగా ఆడినప్పటికీ అనూహ్య ఓటమి చవిచూసిన టీమ్‌ఇండియా.. టీ20లతో పాటు వన్డేల్లోనూ సిరీస్‌ నెగ్గి ఇంగ్లాండ్‌ పర్యటనకు ఘనమైన ముగింపునిచ్చింది.

మాంచెస్టర్‌

టీమ్‌ఇండియా ఛేదన అదరహో. పంత్‌ (125 నాటౌట్‌; 113 బంతుల్లో 16×4, 2×6) అద్భుత శతకానికి, హార్దిక్‌ పాండ్య (71; 55 బంతుల్లో 10×4) పోరాటం తోడైన వేళ ఆదివారం చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా.. 42.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట ఇంగ్లాండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (60; 80 బంతుల్లో 3×4, 2×6), జేసన్‌ రాయ్‌ (41; 31 బంతుల్లో 7×4) రాణించారు. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ పాండ్య (4/24) తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. చాహల్‌ (3/60), సిరాజ్‌ (2/66) రాణించారు. పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కగా.. హార్దిక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. గత ఏడాది అయిదు టెస్టుల సిరీస్‌లో వాయిదా పడ్డ చివరి మ్యాచ్‌ను ఈ పర్యటనలో ఆడి, ఓటమి పాలవడంతో సిరీస్‌ను 2-2తో ముగించిన భారత్‌.. టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో తేడాతో నెగ్గి ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించింది.

వారెవ్వా పంత్‌..: బాధ్యతగా ఆడడు, నిర్లక్ష్యం ఎక్కువ, పరిపక్వత లేదు, వికెట్‌ పారేసుకుంటాడు అన్నవి పంత్‌పై తరచూ వచ్చే విమర్శలు. అయితే అద్వితీయ పోరాటం చేసిన ఈ ఎడమచేతి వాటం కుర్రాడు.. సంచలన బ్యాటింగ్‌తో ఇటీవల కాలంలో వన్డే క్రికెట్లో గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటి అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. అసాధారణ పట్టుదలను ప్రదర్శిస్తూ, అత్యంత బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆ విమర్శలకు బదులిచ్చాడు. హార్దిక్‌ పాండ్యదీ గొప్ప ఇన్నింగ్సే! విపత్కర పరిస్థితుల్లో, ఆశలు సన్నగిల్లుతున్న దశలో ఈ జంట జట్టును ఓటమి అంచుల్లో నుంచి విజయం వైపు నడిపించిన తీరు అద్భుతం. ఎందుకంటే అంత పెద్దదేమీ కాని లక్ష్య ఛేదనలో టాప్లీ (3/35) ధాటికి టాప్‌ లేచిన వేళ.. 72కే ధావన్‌, రోహిత్‌, కోహ్లి, సూర్యకుమార్‌ వికెట్లు కోల్పోయిన సమయాన రెండో వన్డే కథే పునరావృతం అవుతుందేమోనన్న ఆందోళన కలిగింది. కానీ పంత్‌, హార్దిక్‌ జోడీ పట్టుదల ఆ పరిస్థితి రానివ్వలేదు.సూర్యకుమార్‌ను వెనక్కి పంపి భారత్‌ను చుట్టేయడానికి ఇంగ్లాండ్‌ సిద్ధమైన దశలో పంత్‌కు జోడయ్యాడు హార్దిక్‌. జట్టు ఒత్తిడిలో ఉన్నా.. ఇద్దరూ స్వేచ్ఛగానే బ్యాటింగ్‌ చేశారు. అప్పటికి క్రీజులో నిలదొక్కుకున్న పంత్‌ కాస్త జాగ్రత్తగా ఆడుతున్నా.. హార్దిక్‌ మాత్రం వస్తూనే దూకుడును ప్రదర్శించాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. క్రమంగా పంత్‌ కూడా జోరు పెంచి... తరచుగా బంతిని బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అయితే భారత్‌పై రన్‌రేట్‌ ఒత్తిడేమీ లేదు. ఇంగ్లిష్‌ బౌలర్ల షార్ట్‌ బంతులు పంత్‌, హార్దిక్‌పై ఏమాత్రం పనిచేయలేదు. హార్దిక్‌ 43 బంతుల్లో, పంత్‌ 71 బంతుల్లో అర్దశతకం పూర్తి చేశారు. అక్కడి నుంచి పంత్‌ దూకుడు మరింత పెరిగింది. ఒవర్టన్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. అతడి తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 దంచాడు. హార్దిక్‌ కూడా అంతే. కార్స్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించాడు. స్కోరు 200 దాటింది. కానీ జట్టు సాఫీగా గెలుపు దిశగా సాగుతున్న ఆ దశలో హార్దిక్‌ (36వ ఓవర్లో) ఔట్‌ కావడంతో భారత్‌లో కాస్త కలవరం. ఇంగ్లాండ్‌లో ఉత్సాహం వచ్చింది. కానీ మరింత రెచ్చిపోయి ఆడిన పంత్‌ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. తమ శ్రమను వృథా కానివ్వలేదు. మరోవైపు జడేజా అండగా నిలవగా.. ఊహించిన దాని కంటే త్వరగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి దూకుడుతో ఇంగ్లాండ్‌కు షాక్‌ తప్పలేదు. విల్లీ బౌలింగ్‌లో సిక్స్‌తో 95కు చేరుకున్నాడు. 106 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అతడు విల్లీ బౌలింగ్‌లో వరుసగా అయిదు బౌండరీలు బాదడంతో భారత్‌ విజయం ఖాయమైపోయంది. రూట్‌ వేసిన 43వ ఓవర్‌ తొలి బంతిని బౌండరీ దాటించి పని పూర్తి చేశాడు పంత్‌. అతడు అర్ధశతకం నుంచి శతకానికి 35 బంతుల్లోనే చేరుకున్నాడు.

ఇంగ్లాండ్‌ కట్టడి: బుమ్రా లేకున్నా క్రమశిక్షణతో బౌలింగ్‌ చేసిన భారత్‌ అంతకుముందు బ్యాటింగ్‌కు అంత కష్టంగా లేని పిచ్‌పై ఇంగ్లాండ్‌ను కట్టడి చేసింది.. టాస్‌ గెలిచిన రోహిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. బౌలర్లు చాలా వరకు బ్యాట్స్‌మెన్‌ను నియంత్రణలోనే ఉంచారు. అయితే వికెట్లు పోతున్నా.. ఇంగ్లాండ్‌ కూడా మరీ వెనుకబడి పోకుండా పరుగులు చేస్తూ పోయింది. భారత్‌కు లభించిన ఆరంభం ప్రకారం చూస్తే ఆతిథ్య జట్టు మంచి స్కోరు చేసినట్లే. ఆరంభంలో సిరాజ్‌, హార్దిక్‌ విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 14 ఓవర్లలో 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సిరాజ్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే బెయిర్‌స్టో (0), రూట్‌ (0)లను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌కు షాకిచ్చాడు. అయితే ఎదురుదాడికి దిగిన రాయ్‌, స్టోక్స్‌ (27; 29 బంతుల్లో 4×4) చకచకా బౌండరీలు బాదడంతో ఇంగ్లాండ్‌ 9 ఓవర్లలో 66/2తో నిలిచింది. కానీ ఈసారి ఇంగ్లాండ్‌ను బంతితో సూపర్‌ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ దెబ్బతీశాడు. పదో ఓవర్లో ప్రమాదకర రాయ్‌ను వెనక్కి పంపిన అతడు.. 14వ ఓవర్లో రిటర్న్‌ క్యాచ్‌తో స్టోక్స్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.. ఆ దశలో బట్లర్‌ చక్కని ఇన్నింగ్స్‌తో ఆ జట్టును ఆదుకున్నాడు. మొయిన్‌ అలీ (34)తో అయిదో వికెట్‌కు 75 పరుగులు జోడించాడు. లివింగ్‌స్టోన్‌ (27) ఆరో వికెట్‌కు  49 పరుగులు జోడించాడు. అయితే భారత్‌ 61 పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసింది.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 41; బెయిర్‌స్టో (సి) శ్రేయస్‌ (బి) సిరాజ్‌ 0; రూట్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 0; స్టోక్స్‌ (సి) అండ్‌ (బి) హార్దిక్‌ 27; బట్లర్‌ (సి) జడేజా (బి) హార్దిక్‌ 60; మొయిన్‌ (సి) పంత్‌ (బి) జడేజా 34; లివింగ్‌స్టోన్‌ (సి) జడేజా (బి) హార్దిక్‌ 27; విల్లీ (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 18; ఒవర్టన్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 32; కార్స్‌ నాటౌట్‌ 3; టాప్లీ (బి) చాహల్‌ 0; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (45.5 ఓవర్లలో ఆలౌట్‌) 259; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-66, 4-74, 5-149, 6-198, 7-199, 8-247, 9-257; బౌలింగ్‌: షమి 7-0-38-0; సిరాజ్‌ 9-1-66-2; ప్రసిద్ధ్‌ 9-0-48-0; హార్దిక్‌ 7-3-24-4; చాహల్‌ 9.5-0-60-3; జడేజా 4-0-21-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రూట్‌ (బి) టాప్లీ 17; ధావన్‌ (సి) రాయ్‌ (బి) టాప్లీ 1; కోహ్లి (సి) బట్లర్‌ (బి) టాప్లీ 17; పంత్‌ నాటౌట్‌ 125; సూర్యకుమార్‌ (సి) బట్లర్‌ (బి) ఒవర్టన్‌ 16; హార్దిక్‌ పాండ్య (సి) స్టోక్స్‌ (బి) కార్స్‌ 71; జడేజా నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (42.1 ఓవర్లలో 5 వికెట్లకు) 261; వికెట్ల పతనం: 1-13, 2-21, 3-38, 4-72, 5-205; బౌలింగ్‌: టాప్లీ 7-1-35-3; విల్లీ 7-0-58-0; కార్స్‌ 8-0-45-1; మొయిన్‌ అలీ 8-0-33-0; ఒవర్టన్‌ 8-0-54-1; స్టోక్స్‌ 2-0-14-0; లివింగ్‌స్టోన్‌ 2-0-14-0; రూట్‌ 0.1-0-4-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని