Commonwealth Games: పట్టు పట్టాలి.. ఎత్తి పడెయ్యాలి!

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు అత్యధిక పతకాలు తెచ్చి పెట్టిన క్రీడల్లో షూటింగ్‌ తర్వాతి స్థానం రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లదే. గత పర్యాయం ఈ రెండు క్రీడల్లో భారత్‌ అయిదు చొప్పున స్వర్ణాలు దక్కించుకుంది. రెజ్లర్లు మొత్తంగా 12 పతకాలు కొల్లగొడితే..

Updated : 27 Jul 2022 04:10 IST

కామన్వెల్త్‌ క్రీడలు రేపటి నుంచే

ఈనాడు క్రీడావిభాగం: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు అత్యధిక పతకాలు తెచ్చి పెట్టిన క్రీడల్లో షూటింగ్‌ తర్వాతి స్థానం రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లదే. గత పర్యాయం ఈ రెండు క్రీడల్లో భారత్‌ అయిదు చొప్పున స్వర్ణాలు దక్కించుకుంది. రెజ్లర్లు మొత్తంగా 12 పతకాలు కొల్లగొడితే.. వెయిట్‌లిఫ్టర్లు 9 పతకాలు పట్టుకొచ్చారు. ఈసారి కూడా ఈ రెండు క్రీడల్లో భారత్‌కు పతకావకాశాలు మెండుగానే ఉన్నాయి.
మీరాపై భారీ అంచనాలు: గత కామన్వెల్త్‌ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు అంచనాల్ని మించి రాణించారు. 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించారు. అప్పుడు 48 కేజీల్లో స్వర్ణం సాధించిన మీరాబాయి చాను.. ఈసారి 55 కేజీల్లో పోటీ పడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న మీరా.. కామన్వెల్త్‌లో పసిడి కాకుండా ఏ పతకం సాధించినా తన స్థాయికి తక్కువే అవుతుంది. 96 కేజీల విభాగంలో బరిలో ఉన్న వికాస్‌ ఠాకూర్‌పైనా మంచి అంచనాలున్నాయి. 2018 క్రీడల్లో కాంస్యం సాధించిన వికాస్‌.. తర్వాత అనేక అంతర్జాతీయ టోర్నీల్లో అదరగొట్టాడు. ఇప్పుడు అతనున్న జోరులో బర్మింగ్‌హాంలో స్వర్ణం గెలుస్తాడని భారత జట్టు ఆశిస్తోంది. ఇంకా వివిధ విభాగాల్లో పదిమంది లిఫ్టర్లు పోటీ పడుతున్నారు. వారిలో లాల్‌రినుంగా (67 కేజీలు) లాంటి స్టార్‌ లిఫ్టర్‌ కూడా ఉన్నాడు. బింద్యారాణి (59 కేజీలు), పాపీ హజారిక (64 కేజీలు), ఉష కుమార (87 కేజీలు), పూర్ణిమ పాండే (87+ కేజీలు), సాకేత్‌ మహదేవ్‌ 55 కేజీలు, చనంబం రిషికాంత సింగ్‌ (55 కేజీలు), అచింత సింగ్‌ (73 కేజీలు), అజయ్‌ సింగ్‌ (81 కేజీలు), వికాస్‌ ఠాకూర్‌ (96 కేజీలు) పోటీలో ఉన్న మిగతా లిఫ్టర్లు. వీరిలో సగం మందికి పైగానే పతకాలు సాధించే అవకాశాలున్నాయి.

పన్నెండు మందీ పతక రేసులో..: చాలా ఏళ్ల నుంచి ప్రపంచ స్థాయి క్రీడల్లో భారత రెజ్లర్లు నిలకడగా రాణిస్తున్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో మన కుస్తీ యోధులకు ఎదురుండదనే అంచనా వేస్తున్నారు.  గత పర్యాయం ఈ క్రీడల్లో రెజ్లర్లు అదరగొట్టారు.  12 మంది బరిలోకి దిగితే 12 పతకాలు వచ్చాయి. అందులో 5 స్వర్ణాలున్నాయి. ఈసారి పోటీ పడుతున్న 12 మందీ పతకాలు సాధిస్తారని భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాటల్లో అతిశయోక్తి లేదు. బరిలో ఉన్న రెజ్లర్లందరూ మంచి ఊపుమీదే ఉన్నారు. తొలిసారి కామన్వెల్త్‌ బరిలో దిగుతున్న రవి దహియా (57 కేజీలు)పై భారీ అంచనాలే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన అతను.. బర్మింగ్‌హామ్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. టోక్యోలో కాంస్యంతో సరిపెట్టుకున్న బజ్‌రంగ్‌.. వరుసగా కామన్వెల్త్‌లో రెండో పసిడి గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. అమ్మాయిల్లో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు)పై మంచి అంచనాలున్నాయి. ఆమె గత క్రీడల్లో 50 కేజీల విభాగంలో పోటీ పడి స్వర్ణం సాధించింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మరో స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌ (62 కేజీలు) కూడా కచ్చితంగా పతకం గెలిచే అవకాశముంది. ఆమె కామన్వెల్త్‌ క్రీడల్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించింది. ఇంకా పురుషుల్లో నవీన్‌ (74 కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు), దీపక్‌ (97 కేజీలు), మోహిత్‌ గ్రెవాల్‌ (125 కేజీలు).. మహిళల్లో పూజా గెహ్లోత్‌ (50 కేజీలు), అన్షు (57 కేజీలు) దివ్య (68 కేజీలు), పూజా సింగ్‌ (76 కేజీలు) కూడా పతకాలు గెలవడానికి మంచి ఛాన్సున్న రెజ్లర్లే.
పోరాటానికి సై
బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు భారత మహిళల బాక్సింగ్‌ జట్టు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టోర్నీ మస్కట్‌ ‘పెర్రీ ద బుల్‌’తో లవ్లీనా, నిఖత్‌జరీన్‌, జాస్మిన్‌, నీతు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని