Updated : 03 Aug 2022 08:32 IST

IND Vs WI: సూర్య మెరుపులు

భారత్‌ ఘనవిజయం
విండీస్‌తో మూడో టీ20

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్‌ అవతారమెత్తి తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌ (76; 44 బంతుల్లో 8×4, 4×6) మూడో టీ20లో చెలరేగాడు. అతను విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడడంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్‌.. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంగళవారం 165 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (11) నడుం కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగ్గా.. శ్రేయస్‌ అయ్యర్‌ (24), రిషబ్‌ పంత్‌ (33 నాటౌట్‌; 26 బంతుల్లో 3×4, 1×6)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సూర్య జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన అతడిని విండీస్‌ బౌలర్లెవరూ కట్టడి చేయలేకపోయారు. 135 పరుగుల వద్ద అతను రెండో వికెట్‌ రూపంలో ఔటయ్యేసరికే భారత్‌ విజయం ఖరారైపోయింది. తర్వాత హార్దిక్‌ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా.. దీపక్‌ హుడా (10 నాటౌట్‌)తో కలిసి పంత్‌ మిగతా పని పూర్తి చేశాడు. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ (73; 50 బంతుల్లో 8×4, 4×6) సత్తా చాటాడు. పూరన్‌ (22), రోమన్‌ పావెల్‌ (23), హెట్‌మయర్‌ (20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ (2/35), హార్దిక్‌ పాండ్య (1/19) రాణించారు.

సిరీస్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన రోహిత్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చెలరేగి ఆడిన మేయర్స్‌.. అందరి బౌలింగ్‌లోనూ షాట్లు ఆడాడు. హార్దిక్‌ ఒక్కడే కట్టుదిట్టంగా బంతులేశాడు. క్రీజులో కుదురుకున్న కింగ్‌ (20)ను ఔట్‌ చేసిన అతను భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. అయితే తర్వాత వికెట్‌ కోసం భారత్‌ చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. పూరన్‌ అండతో మేయర్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బౌలర్లు ఎక్కువ పరుగులు ఇవ్వకున్నా వికెట్‌ మాత్రం పడగొట్టలేకపోయారు. 15వ ఓవర్లో భువి తిరిగి బౌలింగ్‌కు వచ్చాక పూరన్‌ను ఔట్‌ చేశాడు. సెంచరీ దిశగా అడుగులేస్తున్న మేయర్స్‌ను కూడా అతను పెవిలియన్‌ చేర్చాడు. అయితే చివరి ఓవర్లలో పావెల్‌, హెట్‌మయర్‌ కొన్ని భారీ షాట్లు ఆడి స్కోరును 160 దాటించారు. తొలి టీ20లో భారత్‌ ఘనవిజయం సాధించగా.. సోమవారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో విండీస్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రెండన్‌ కింగ్‌ (బి) హార్దిక్‌ 20; మేయర్స్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 73; పూరన్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 22; పావెల్‌ (సి) హుడా (బి) అర్ష్‌దీప్‌ 23; హెట్‌మయర్‌ రనౌట్‌ 20; థామస్‌ నాటౌట్‌ 0; హోల్డర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-57, 2-107, 3-128, 4-162, 5-163; బౌలింగ్‌: దీపక్‌ హుడా 1-0-1-0; భువనేశ్వర్‌ 4-0-35-2; అవేష్‌ ఖాన్‌ 3-0-47-0; హార్దిక్‌ పాండ్య 4-0-19-1; అర్ష్‌దీప్‌ 4-0-33-1; అశ్విన్‌ 4-0-26-0;

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 11; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) జోసెఫ్‌ (బి) డ్రేక్స్‌ 76; శ్రేయస్‌ (స్టంప్డ్‌) థామస్‌ (బి) హొసీన్‌ 24; పంత్‌ నాటౌట్‌ 33; హార్దిక్‌ (సి) థామస్‌ (బి) హోల్డర్‌ 4; దీపక్‌ హుడా నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-105, 2-135, 3-149; బౌలింగ్‌: మెక్‌కే 4-0-34-0; జోసెఫ్‌ 4-0-39-0; డ్రేక్స్‌ 4-0-33-1; హోల్డర్‌ 3-0-30-1; హొసీన్‌ 4-0-28-1


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని