Tulika Maan: చెప్పి మరీ కొట్టింది

దేశంలో కొన్నేళ్లుగా జూడో అంటే సుశీల దేవి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఆటలో గతేడాది ఒలింపిక్స్‌కు కేవలం ఆమె మాత్రమే అర్హత సాధించడం.. 2014, 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతాలు గెలవడమే అందుకు కారణం. కానీ

Updated : 04 Aug 2022 03:22 IST

ఈనాడు, క్రీడా విభాగం: దేశంలో కొన్నేళ్లుగా జూడో అంటే సుశీల దేవి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఆటలో గతేడాది ఒలింపిక్స్‌కు కేవలం ఆమె మాత్రమే అర్హత సాధించడం.. 2014, 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతాలు గెలవడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు తానున్ననంటూ దూసుకొచ్చింది తూలిక. ఈ దిల్లీ అమ్మాయి జూనియర్‌ స్థాయి నుంచే గొప్పగా రాణిస్తోంది. తన తల్లి అండతో అద్భుత ప్రదర్శనతో సాగుతోంది. ఆటలో పోటీపడడం తనకు ప్రత్యేక అనూభూతిని కలిగిస్తోందని చెబుతున్న ఆమె.. అంకిత భావం, తపనతో పతకాలు కొల్లగొడుతోంది. తాను దేశంలోనే అత్యుత్తమ జూడో క్రీడాకారిణిగా నిలవాలనే తల్లిదండ్రుల కలను నిజం చేయాలనే పట్టుదలతో ఉంది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించాలనే ధ్యేయంతో ఉన్నానని ఏడాది క్రితం చెప్పిన తను.. ఇప్పుడు దాన్ని అందుకుంది.

ఆ నిరాశను దాటి..

గతేడాది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని తూలిక ఎంతో కష్టపడింది. క్వాలిఫయర్‌ టోర్నీలో సత్తాచాటేందుకు ఆమెతో పాటు మరో నలుగురు జూడోకాలు సిద్ధమయ్యారు. కానీ కేవలం ఇద్దరిని మాత్రమే ఎంపిక చేయాలని జూడో సమాఖ్య నిర్ణయించడంతో తనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆమె నిరాశకు గురైంది. కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉంది. ఆ తర్వాత సరికొత్తగా మళ్లీ మ్యాట్‌పై అడుగుపెట్టింది. పోరాటాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్న ఆమె అంతకుముందు ఆటలో అంచెలంచెలుగా ఎదిగింది. త్వరగానే ఆటపై పట్టు సాధించిన తను 2016లో జూనియర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. ఆ తర్వాత కోచ్‌ యశ్‌పాల్‌ సోలంకి దగ్గర చేరడంతో తన కెరీర్‌ ఊపందుకుంది. 2017లో జాతీయ జూనియర్‌తో పాటు సీనియర్‌ ఛాంపియన్‌గానూ నిలిచింది. నాలుగు సార్లు జాతీయ టైటిల్‌ దక్కించుకుంది. జూనియర్‌ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 2017, 2018లో కాంస్యాలు నెగ్గింది. ఆసియా కప్‌ జూనియర్‌ ఛాంపియన్‌ అయింది. కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్స్‌, దక్షిణాసియా క్రీడల్లో 2018, 2019లో స్వర్ణాలు సొంతం చేసుకుంది. జూడోలో భారత్‌ నుంచి తొలి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్స్‌ పతకం నెగ్గడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని