CWG: నలుగురు యోధులు

తమ మీద పెట్టుకున్న నమ్మకాలను నిజం చేయాలనే పట్టుదలతో ఇద్దరు అగ్రశ్రేణి రెజ్లర్లు.. పతకాల వేట కొనసాగించాలనే దూకుడుతో ఉన్న మరో ఇద్దరు యువ రెజ్లర్లు.. కామన్వెల్త్‌ క్రీడల్లో అడుగుపెట్టి సత్తాచాటారు.

Updated : 06 Aug 2022 05:34 IST

తమ మీద పెట్టుకున్న నమ్మకాలను నిజం చేయాలనే పట్టుదలతో ఇద్దరు అగ్రశ్రేణి రెజ్లర్లు.. పతకాల వేట కొనసాగించాలనే దూకుడుతో ఉన్న మరో ఇద్దరు యువ రెజ్లర్లు.. కామన్వెల్త్‌ క్రీడల్లో అడుగుపెట్టి సత్తాచాటారు.

ఈనాడు క్రీడా విభాగం: దేశంలో అగ్రశ్రేణి రెజ్లర్లుగా ఎదిగిన సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా ప్రదర్శన తగ్గిందనే వ్యాఖ్యలు ఇటీవల వినిపించాయి. టోక్యో ఒలింపిక్స్‌కు సాక్షి అర్హత సాధించలేకపోవడం, ఆ క్రీడల్లో పసిడి గెలుస్తాడనుకున్న బజ్‌రంగ్‌ కాంస్యం గెలవడమే అందుకు కారణం. కానీ తమ సత్తా తగ్గలేదని ఇప్పుడీ ఇద్దరు కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణాలతో చాటిచెప్పారు. మహిళల 62 కేజీల విభాగంలో చాలా కాలం పాటు దేశంలో నంబర్‌వన్‌గా కొనసాగిన రెజ్లర్‌ సాక్షి. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి.. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన తర్వాత ఆమె ప్రదర్శన పడిపోతూ వచ్చింది. ట్రయల్స్‌లో ప్రతిసారి సోనమ్‌ చేతిలో సాక్షి ఓడిపోతుండడంతో తన పని అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపించాయి. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లోనూ సోనమ్‌ చేతిలో సాక్షి పరాజయం పాలైంది. కానీ విమర్శలకు తగిన రీతిలో ఆమె సమాధానమిచ్చింది. కామన్వెల్త్‌ క్రీడల ట్రయల్స్‌లో సోనమ్‌పై నెగ్గిన ఆమె..  బర్మింగ్‌హామ్‌లో  స్వర్ణంతో ఒకప్పటి సాక్షిని గుర్తు చేసింది. ఇక ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు పతకాలు (రెండు కాంస్యాలు, ఓ రజతం) సాధించిన ఏకైక భారత రెజ్లర్‌.. బజ్‌రంగ్‌ పునియా. ఇది చాలు అతడి సామర్థ్యం గురించి చెప్పడానికి. 28 ఏళ్ల ఈ రెజ్లర్‌ ఆటలో మేటిగా ఎదిగాడు. గతేడాది టోక్యోలో పసిడి గెలుస్తాడని బజ్‌రంగ్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ అతను స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఒకప్పటి రెజ్లరైన తండ్రి ప్రోత్సాహంతో బజ్‌రంగ్‌ ఈ ఆటలోకి వచ్చాడు. కామన్వెల్త్‌ స్వర్ణంతో తిరిగి తన సత్తాచాటిన అతను 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో ఉన్నాడు.

యువ జోరు..: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి బరిలో దిగిన యువ రెజ్లర్లు అన్షు మలిక్‌, దీపక్‌ పునియా తీవ్ర ఒత్తిడిని దాటి పతకాలు సొంతం చేసుకున్నారు. 21 ఏళ్ల అన్షు రెజ్లింగ్‌ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ధరమ్‌వీర్‌ ఒకప్పటి అంతర్జాతీయ రెజ్లర్‌. తండ్రి ప్రోత్సాహంతోనే ఆమె రెజ్లింగ్‌లో అడుగుపెట్టింది. కుస్తీలో పట్టు సాధించింది. క్రమంగా మెరుగైంది. 2017లో ప్రపంచ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గింది. 2018లో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించింది. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ఆమె.. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో వెండి పతకం పట్టేసింది. మరో యువ రెజ్లర్‌ దీపక్‌ పునియా ప్రపంచ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఆర్మీలో పని చేస్తున్న అతను బాల్యంలోనే కుస్తీ వైపు ఆకర్షితుడయ్యాడు. అయిదేళ్ల వయసులోనే మట్టిలో అడుగుపెట్టాడు. 2016లో ప్రపంచ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతను.. 2018 జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం పట్టేశాడు. 2019లో జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో గొప్పగా పోరాడి త్రుటిలో పతకం కోల్పోయాడు. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడితో బోణీ కొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని