CWG 2022: పట్టులో పతకాభిషేకం

రెజ్లర్లు అదరహో.. 12కు 12 పతకాలు. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత కుస్తీ యోధులు అదరగొట్టారు. పట్టులో పతక మోత మోగించారు. ముగింపు దిశగా సాగుతున్న ఈ క్రీడల్లో దేశానికి పతకాభిషేకం చేశారు. వరుసగా రెండో రోజూ దూకుడు ప్రదర్శించి పతకాల సంఖ్యను రెండంకెలకు చేర్చారు. బరిలో దిగిన ప్రతి

Updated : 07 Aug 2022 06:49 IST

జోరు కొనసాగించిన రెజ్లర్లు

వినేశ్‌, రవి, నవీన్‌లకు స్వర్ణాలు

బర్మింగ్‌హామ్‌

రెజ్లర్లు అదరహో.. 12కు 12 పతకాలు. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత కుస్తీ యోధులు అదరగొట్టారు. పట్టులో పతక మోత మోగించారు. ముగింపు దిశగా సాగుతున్న ఈ క్రీడల్లో దేశానికి పతకాభిషేకం చేశారు. వరుసగా రెండో రోజూ దూకుడు ప్రదర్శించి పతకాల సంఖ్యను రెండంకెలకు చేర్చారు. బరిలో దిగిన ప్రతి రెజ్లర్‌ పతకం సాధించారు. శనివారం రెజ్లింగ్‌లో మరో 6 పతకాలు ఖాతాలో చేరాయి. వినేశ్‌ ఫొగాట్‌, రవి కుమార్‌, నవీన్‌ స్వర్ణాలు నెగ్గారు. అథ్లెటిక్స్‌లో ప్రియాంక, అవినాష్‌ అద్భుత ప్రదర్శనతో చెరో రజతం సొంతం చేసుకున్నారు.  

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత రెజ్లర్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. శుక్రవారం మూడు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు ఖాతాలో వేసుకున్న రెజ్లర్లు.. పోటీల తొమ్మిదో రోజైన శనివారం మరో 3 స్వర్ణాలు, 3 కాంస్యాలు దేశానికి అందించారు. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో 12 (5 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలు సాధించిన రెజ్లర్లు.. ఈ సారి (6 స్వర్ణాలు, ఓ రజతం, 5 కాంస్యాలు) కూడా అదే ప్రదర్శన చేశారు. కానీ ఈ సారి ఓ స్వర్ణం ఎక్కువగా గెలవడం విశేషం. వినేశ్‌ ఫొగాట్‌ వరుసగా మూడు కామన్వెల్త్‌ క్రీడల్లోనూ స్వర్ణాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్రలోకెక్కింది. మహిళల 53 కేజీల నోర్డిక్‌ విధానం విభాగంలో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విధానం ప్రకారం ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినవాళ్లే విజేత. మెర్సీ (నైజీరియా), సమంత (కెనడా)ను మొదట చిత్తు చేసిన వినేశ్‌.. చివరి మ్యాచ్‌లో కేశాని (శ్రీలంక)పై నెగ్గింది. ఆరంభం నుంచి జోరు ప్రదర్శించిన ఆమె 4-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థిని కిందపడేసి, పైకి లేవకుండా అదిమి పట్టి విజయాన్ని అందుకుంది. మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 2014, 2018 క్రీడల్లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌ రజత విజేత రవి దహియా సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. పురుషుల 57 కేజీల ఫైనల్లో 10-0తో వెల్సన్‌ (నైజీరియా)ను చిత్తుచేసి కామన్వెల్త్‌ క్రీడల అరంగేట్రంలో స్వర్ణం సాధించాడు. ప్రత్యర్థి కాళ్లను గట్టిగా పట్టుకుని మ్యాట్‌పై దొర్లించి వరుసగా పాయింట్లు గెలిచాడు. ఇక పురుషుల 74 కేజీల ఫైనల్లో నవీన్‌ 9-0తో మహమ్మద్‌ షరీఫ్‌ (పాకిస్థాన్‌)ను ఓడించాడు. ఆరంభంలో 2-0తో నిలిచిన నవీన్‌.. ఆ తర్వాత ప్రత్యర్థిని మ్యాట్‌కు అదిమి పట్టి, గింగిరాలు తిప్పి పాయింట్లు సాధించాడు. పూజ గెహ్లోత్‌ (50 కేజీలు), పూజ సిహాగ్‌ (76), దీపక్‌ నెహ్రా (97) కాంస్యాలు దక్కించుకున్నారు. కంచు పతక పోరులో పూజ గెహ్లోత్‌ 12-2తో లెచిజియో (స్కాట్లాండ్‌)పై, పూజ సిహాగ్‌ 11-1తో డిబ్రూయిన్‌ (ఆస్ట్రేలియా)పై, దీపక్‌ నెహ్రా 10-2తో తయాబ్‌ రజా (పాకిస్థాన్‌)పై నెగ్గారు.

 


హుసాముద్దీన్‌కు కాంస్యమే

గత కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన తెలంగాణ బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ మరోసారి కంచుతోనే సంతృప్తి పడ్డాడు. పురుషుల 54-57 కేజీల సెమీఫైనల్లో హుసాముద్దీన్‌ 1-4తో జోసెఫ్‌ కామె (ఘనా) చేతిలో ఓడిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని