Published : 08 Aug 2022 03:10 IST

హాకీలో కంచు

16 ఏళ్ల తర్వాత అమ్మాయిల జట్టుకు పతకం

బర్మింగ్‌హామ్‌: భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. 16 ఏళ్ల విరామం తర్వాత కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించింది. కెప్టెన్‌ సవిత పునియా అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను షూటౌట్లో 2-1తో ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. భారత్‌ నిర్ణీత సమయంలోనే గెలవాల్సింది. కానీ మ్యాచ్‌ మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా ప్రత్యర్థికి గోల్‌ కొట్టే అవకాశమిచ్చింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్‌ ఈ మ్యాచ్‌తో ఎంతో పట్టుదలను ప్రదర్శించింది. 29వ నిమిషంలో సలీమా టెటె కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నవ్‌నీత్‌ కౌర్‌ షాట్‌ను న్యూజిలాండ్‌ గోల్‌కీపర్‌ అడ్డుకోగా.. వెనక్కి వచ్చిన బంతిని రివర్స్‌ హిట్‌తో ప్రత్యర్థి గోల్‌లోకి పంపింది సలీమా. ఆ తర్వాత కూడా ప్రత్యర్థిపై భారత్‌ ఒత్తిడిని కొనసాగించింది. 52వ నిమిషంలో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లు సాధించింది. కానీ కివీస్‌ గోల్‌కీపర్‌ ఓహాన్లోన్‌ను గుర్జీత్‌ బోల్తా కొట్టించలేకపోయింది. మ్యాచ్‌ రెండున్నర నిమిషాల్లో ముగుస్తుందనగా లాల్రెమ్సియామి అనవసరంగా పసుపు కార్డు పొందడంతో భారత్‌ పదిమందికే పరిమితమైంది. అవకాశాన్ని సొమ్ము చేసుకున్న న్యూజిలాండ్‌.. కొన్ని సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్‌ సాధించింది. దాని నుంచి పెనాల్టీ స్ట్రోక్‌ను సంపాదించింది. గోల్‌లోకి వెళ్తున్న బంతిని నవ్‌నీత్‌ కావాలని తన్నడంతో ఆ జట్టుకు పెనాల్టీ వచ్చింది. సవితను మెర్రీ బోల్తా కొట్టించడంతో కివీస్‌ 1-1తో స్కోరు సమం చేసింది. షూటౌట్లో అద్భుత ప్రదర్శన చేసిన గోల్‌కీపర్‌ సవిత.. మూడు సేవ్‌లతో భారత్‌ను పైచేయిలో నిలిపింది. సోనిక, నవ్‌నీత్‌ షూటౌట్లో భారత్‌ తరఫున స్కోర్‌ చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని