Updated : 08 Aug 2022 04:25 IST

CWG 2022: నన్నెవరూ ఆపలేరు

కష్టపడటమే నా మంత్రం
దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా
‘ఈనాడు’తో నిఖత్‌ జరీన్‌

బర్మింగ్‌హామ్‌ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి

కష్టపడి సాధన చేస్తున్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని భారత బాక్సింగ్‌ స్టార్‌, తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ స్పష్టంచేసింది. దేశానికి పతకాలు అందిస్తుండటమే తన లక్ష్యమని తెలిపింది. ఆదివారం కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకంతో సత్తాచాటిన నిఖత్‌.. ‘ఈనాడు’తో తన ఆనందాన్ని పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..

అప్పుడు కల: మూడు నెలల వ్యవధిలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఆకాశంలో తేలుతున్నట్లు అనిపిస్తోంది. ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది నా కల. అలాంటిది అత్యున్నత వేదికల్లో పతకాలు గెలుస్తుండటం చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. కష్టపడుతున్నందుకు ఫలితాలు వస్తున్నాయి. కష్టపడి సాధన చేస్తున్నంత కాలం నన్నెవరూ ఆపలేరు. భవిష్యత్తులోనూ దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా. మరింత బరువు తగ్గించుకుని విభాగాన్ని మార్చుకుంటా.

ఇక్కడ పోటీ తక్కువే కానీ..:  కామన్వెల్త్‌ క్రీడల్లో నేను ఆడిన మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా ముగియడం ఆనందంగా ఉంది. బాక్సింగ్‌ బౌట్‌లో ఎప్పుడైనా పాయింట్ల అంతరం ఎక్కువగా ఉండదు. కాస్త తేడా వచ్చినా ఫలితం తారుమారుకావొచ్చు. అందుకే రింగ్‌లో అడుగుపెట్టినప్పుడు నూటికి నూరు శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఏకగ్రీవంగా గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పోల్చుకుంటే ఇక్కడ పోటీ తక్కువగా ఉంది. అయితే ప్రత్యర్థులెవరినీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి బౌట్‌ను ఫైనల్‌ మాదిరే ఆడా. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను.

అంచనాలు.. ఒత్తిడి: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత నాపై అంచనాలు.. ఒత్తిడి పెరిగాయి. ఒత్తిడి ఉండాలనే కోరుకుంటా. ప్రపంచ ఛాంపియన్‌గా మంచి ప్రదర్శన ఇవ్వాలని మొదట నాకు నేనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటా. అంచనాలకు తక్కువగా రాణిస్తే ముందు నిరాశ ఎదురయ్యేది నాకే. సులువైన ప్రత్యర్థి ఉన్నా కూడా తేలిగ్గా తీసుకోను.

గర్వపడేలా చేస్తా: నిజామాబాద్‌ నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. తెలంగాణ, హైదరాబాద్‌ నుంచి చాలామంది అత్యుత్తమ క్రీడాకారులు వచ్చారు. సైనా, సింధు, నారంగ్‌, సానియా, మిథాలీ సహా ఎంతోమంది హైదరాబాద్‌ పేరు నిలబెడుతున్నారు. ఆ జాబితాలో నా పేరు కూడా చేరడం గర్వంగా ఉంది. సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో నన్ను అభినందించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడలు వెంటవెంటనే జరిగాయి. విజయాన్ని ఆస్వాదించడానికి.. విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు కొంచెం విరామం తీసుకుంటా.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని