CWG 2022: భలే.. భలే బర్మింగ్‌హామ్‌

ఒలింపిక్స్‌లో త్రుటిలో స్వర్ణం చేజారినా.. రజతం గెలిచి ఔరా అనిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు సాధించింది. ఎన్నో సూపర్‌సిరీస్‌ టైటిళ్లు సొంతమయ్యాయి. ఇన్ని సాధించినా తన స్థాయికి అంత కష్టమేమీ కాని కామన్వెల్త్‌ క్రీడల వ్యక్తిగత స్వర్ణం కోసం మాత్రం నిరీక్షణ తప్పలేదు. తొలి పర్యాయం కాంస్యం.. రెండోసారి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మూడో ప్రయత్నంలో

Updated : 15 Aug 2022 14:23 IST

కామన్వెల్త్‌ క్రీడలకు తెర

22 స్వర్ణాలతో భారత్‌ జిగేల్‌

61 పతకాలతో నాలుగో స్థానం

సింధుకు తొలి వ్యక్తిగత బంగారు పతకం

లక్ష్యసేన్‌, సాత్విక్‌-చిరాగ్‌, శరత్‌లకూ పసిడి

బర్మింగ్‌హామ్‌

ఒలింపిక్స్‌లో త్రుటిలో స్వర్ణం చేజారినా.. రజతం గెలిచి ఔరా అనిపించింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు సాధించింది. ఎన్నో సూపర్‌సిరీస్‌ టైటిళ్లు సొంతమయ్యాయి. ఇన్ని సాధించినా తన స్థాయికి అంత కష్టమేమీ కాని కామన్వెల్త్‌ క్రీడల వ్యక్తిగత స్వర్ణం కోసం మాత్రం నిరీక్షణ తప్పలేదు. తొలి పర్యాయం కాంస్యం.. రెండోసారి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మూడో ప్రయత్నంలో మాత్రం సింధు అంచనాలను అందుకుంటూ బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం సాధించిందామె. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి.. టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ సైతం పసిడి పతకాలు అందుకోవడంతో కామన్వెల్త్‌ క్రీడలను మొత్తం 22 స్వర్ణాలతో ఘనంగా ముగించింది భారత్‌. మొత్తంగా దేశానికి 61 పతకాలు రావడం గొప్ప ప్రదర్శనే.

కామన్వెల్త్‌ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్‌ క్రీడలను భారత్‌ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్‌ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే. టీమ్‌ విభాగంలో రజతంతో సరిపెట్టుకున్నపుడు, సింగిల్స్‌లో స్వర్ణం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి.సింధు.. ఆ మాటను నిలబెట్టుకుంది. సోమవారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21-15, 21-13తో 13వ ర్యాంకు క్రీడాకారిణి మిచెలీ లి (కెనడా)ను అలవోకగా ఓడించింది. ఇప్పటికే రెండుసార్లు తన చేతిలో ఓటమి పాలైన మిచెలీకి ఈ మ్యాచ్‌లోనూ సింధు అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌ నుంచే భారత స్టార్‌ దూకుడుగా ఆడగా.. మిచెలీ నెట్‌ దగ్గర పాయింట్లు సాధించేందుకు ప్రయత్నించింది. 7-6తో ఆధిక్యంలో ఉన్న దశలో జోరు పెంచిన సింధు 14-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో మిచెలీ కొంచెం పుంజుకున్నా సింధు పట్టు వదల్లేదు. రెండో గేమ్‌లో విరామ సమయానికి 11-6తో ఆధిక్యంలోకి వెళ్లిన తెలుగమ్మాయి.. అదే ఊపులో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీ పడ్డ తొలిసారే లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. ప్రపంచ పదో రాం్యకర్‌ లక్ష్య ఫైనల్లో 19-21, 21-9, 21-16తో 42వ ర్యాంకు క్రీడాకారుడు జి యాంగ్‌ (మలేసియా)పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను త్రుటిలో కోల్పోయిన భారత షట్లర్‌.. రెండో గేమ్‌లో 11-9తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా 12 పాయింట్లు కొల్లగొట్టి స్కోరు సమం  చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా లక్ష్య పట్టు వదల్లేదు. పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజు.. చిరాగ్‌ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్‌ స్వర్ణం సాధించాడు. ఈ జోడీ 21-15, 21-13తో బెన్‌ లేన్‌-సీన్‌ మెండీ (ఇంగ్లాండ్‌) జంటను సునాయాసంగా ఓడించింది. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మొత్తంగా ఆరు పతకాలు దక్కాయి. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత బృందం రజతం గెలవగా.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీకి కాంస్యాలు దక్కాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక మ్యాచ్‌ల్లో శ్రీకాంత్‌ 21-15, 21-18తో జియా హెంగ్‌ (సింగపూర్‌)పై, గాయత్రి-ట్రీసా 21-15, 21-18తో సుయాన్‌-గ్రోన్యా (ఆస్ట్రేలియా)లపై నెగ్గారు. అదే సమయంలో జరిగిన బాక్సింగ్‌ పురుషుల 92+ విభాగం ఫైనల్లో సాగర్‌ అహ్లావత్‌ 0-5తో డెలీషియస్‌ ఓరీ చేతిలో ఓడి రజతం అందుకున్నాడు.


రాకెట్‌ రాజసం

3 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు.. ఈ కామన్వెల్త్‌ క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన ఇది. క్రీడల చరిత్రలో మన షట్లర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2018లో ఆరు పతకాలు సాధించినప్పటికీ.. అప్పుడు దక్కిన స్వర్ణాలు రెండే. కానీ ఈసారి మూడు స్వర్ణాలు లభించాయి. గత పర్యాయం టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన భారత్‌.. ఈసారి రజతంతో సరిపెట్టుకునేసరికి బ్యాడ్మింటన్‌ అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది. కానీ క్రీడల చివరి రోజు బరిలో ఉన్న మూడు విభాగాల్లోనూ పసిడి పతకాలు నెగ్గి అభిమానులను సంతోషంలో ముంచెత్తారు మన షట్లర్లు. స్వదేశంలో జరిగిన 2010 క్రీడలకు ముందు.. కామన్వెల్త్‌ క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌ ప్రదర్శన అంతంతమాత్రమే. ఒకటో రెండో పతకాలు సాధిస్తే పొంగిపోయే వాళ్లం. అయితే అప్పటికే స్టార్‌ క్రీడాకారిణిగా ఎదిగిన సైనా నెహ్వాల్‌ బాటలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ సహా పలువురు షట్లర్లు ప్రపంచ స్థాయికి చేరడం, దేశంలో బ్యాడ్మింటన్‌ విప్లవం ఊపందుకోవడంతో క్రమంగా క్రీడల్లో భారత్‌ ఆధిపత్యం మొదలైంది. 2010లో 2 స్వర్ణాలు సహా నాలుగు పతకాలు దక్కాయి భారత్‌కు. 2014లో నాలుగు పతకాలు వచ్చినా స్వర్ణం ఒకటి తగ్గింది. ఇప్పుడు మూడు స్వర్ణాలతో ఉత్తమ ప్రదర్శన చేశారు.


గొప్ప ప్రదర్శనే..

22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు.. మొత్తంగా ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది భారత్‌. 2010లో సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణాలు సహా 101 పతకాలతో పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. 2002లో 30 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించడం తర్వాతి ఉత్తమ ప్రదర్శన. 2018 నాటి ప్రదర్శన (26 స్వర్ణాలు సహా 66 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఉత్తమ ప్రదర్శన అంటే ప్రస్తుత క్రీడల్లోనే. అయితే కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు ఎప్పుడూ పతకాల పంట పండించే షూటింగ్‌ను ఈసారి పక్కన పెట్టారు. ప్రస్తుత ఈవెంట్‌ను పక్కన పెట్టి, 2018 వరకు భారత్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 203 స్వర్ణాలు సాధిస్తే.. అందులో షూటింగ్‌ వాటా 63. దీన్ని బట్టే మన షూటర్ల ఆధిపత్యాన్ని అంచనా వేయొచ్చు. ఈసారి వాళ్లు బరిలో లేకుండానే భారత్‌ 22 స్వర్ణాలు సాధించడమంటే గొప్ప ప్రదర్శన చేసినట్లే. షూటింగ్‌ కూడా ఉండుంటే 2010 క్రీడల తర్వాత ఉత్తమ ప్రదర్శన ఇప్పటిదే అయ్యేది. ఇక ఎప్పట్లాగే ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత క్రీడల్లో 67 స్వర్ణాలు సహా 178 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్‌ (57 స్వర్ణాలు సహా 176 పతకాలు), కెనడా (26 స్వర్ణాలు సహా 92 పతకాలు) తర్వాతి రెండు స్థానాలు సాధించాయి. ముగింపు వేడుకల్లో శరత్‌ కమల్‌, నిఖత్‌ జరీన్‌ పతాకధారులుగా వ్యవహరించారు.


పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందన

దిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత క్రీడాకారులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘సింధు మేటి క్రీడాకారిణి. విజేతలకు విజేత. ఆమె అంకితభావం స్ఫూర్తిదాయకం. సీడబ్ల్యూజీలో స్వర్ణం గెలిచిన ఆమెకు అభినందనలు’’ అని ప్రధాని అన్నారు. శరత్‌ కమల్‌ ఎంతో సహనాన్ని, పట్టుదలను ప్రదర్శించాడని.. అతడి విజయం భారత టీటీకి ఊతమిస్తుందని మోదీ చెప్పారు. లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ తదితర పతక విజేతలను మోదీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని