CWG 2022:శరత్‌ 16 ఏళ్ల తర్వాత

వయసు 40.. సింగిల్స్‌లో స్వర్ణం గెలిచి 16 ఏళ్లు అయింది! కానీ శరత్‌కమల్‌ ఆత్మవిశ్వాసం చెదరలేదు. మరో పసిడి కోసం అతడి సుదీర్ఘ నిరీక్షణ బర్మింగ్‌హామ్‌లో ఫలించింది. 2006 తర్వాత మళ్లీ ఇప్పుడు సింగిల్స్‌లో స్వర్ణం శరత్‌ సొంతమైంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఈ భారత స్టార్‌..

Updated : 15 Aug 2022 12:12 IST

టీటీలో సింగిల్స్‌ పసిడి కైవసం

బర్మింగ్‌హామ్‌: వయసు 40.. సింగిల్స్‌లో స్వర్ణం గెలిచి 16 ఏళ్లు అయింది! కానీ శరత్‌కమల్‌ ఆత్మవిశ్వాసం చెదరలేదు. మరో పసిడి కోసం అతడి సుదీర్ఘ నిరీక్షణ బర్మింగ్‌హామ్‌లో ఫలించింది. 2006 తర్వాత మళ్లీ ఇప్పుడు సింగిల్స్‌లో స్వర్ణం శరత్‌ సొంతమైంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఈ భారత స్టార్‌.. 4-1తో లిమ్‌ పిచ్‌ఫోర్డ్‌ (ఇంగ్లాండ్‌)పై విజయం సాధించాడు. 2006లో చివరిగా శరత్‌ సింగిల్స్‌ స్వర్ణం గెలిచాడు. ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో అతడికి ఇది నాలుగో పతకం. ఇందులో మూడు స్వర్ణాలు ఉండడం విశేషం. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీజతో కలిసి పసిడి గెలిచిన శరత్‌.. టీమ్‌ విభాగంలో పసిడి సాధించాడు. సత్యన్‌తో కలిసి డబుల్స్‌లో రజతం సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద శరత్‌ కెరీర్‌లో ఇది 13వ కామన్వెల్త్‌ పతకం.

సత్యన్‌కు కాంస్యం: టీటీలో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్‌ కాంస్యం గెలిచాడు. నువ్వానేనా అన్నట్లు సాగిన కంచు పోరులో అతడు 4-3తో స్థానిక ఫేవరెట్‌ పాల్‌ డ్రింక్‌హాల్‌ను ఓడించాడు. ఈ పోరులో తొలి మూడు గేమ్‌లు చేజిక్కించుకుని సులభంగా మ్యాచ్‌ గెలిచేలా కనిపించిన సత్యన్‌.. ఆ తర్వాత మూడు గేమ్‌లు కోల్పోయాడు. కానీ మళ్లీ పుంజుకున్న సత్యన్‌ ఏడో గేమ్‌లో గెలిచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.


అటు దిగ్గజం.. ఇటు యువ కెరటం

ఓ పక్క పొడగరి  శరత్‌కమల్‌.. జోడీగా అతడి కన్నా చాలా తక్కువ ఎత్తున్న శ్రీజ. అపార అనుభవం శరత్‌  సొంతమైతే.. కామన్వెల్త్‌ క్రీడల్లో బరిలో దిగడం తెలంగాణ అమ్మాయి శ్రీజకు ఇదే తొలిసారి. వీళ్లిద్దరూ పతకం తేగలరా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏకంగా పసిడినే పట్టేశారు. 40 ఏళ్ల శరత్‌.. 24 ఏళ్ల శ్రీజకు అనుభవంలోనూ, ఆటలోనూ ఎంతో అంతరముంది. 2003లో శరత్‌కమల్‌ జాతీయ ఛాంపియన్‌ అయ్యే సమయానికి శ్రీజ వయసు ఆరేళ్లే! ఇప్పుడు అదే అమ్మాయి.. శరత్‌తో కలిసి కామన్వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలవడం ఊహించని విషయం! ఈ క్రీడల కోసం టీమ్‌గా మారిన శరత్‌-శ్రీజలో ఎంతో సమన్వయం. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రిక్వార్టర్స్‌ నుంచి ఫైనల్‌ చేరే క్రమం వరకు శరత్‌-శ్రీజ పోరాటం అసమానం. వెనుకబడినా పుంజుకుని.. గెలవలేని స్థితిలోనూ తేరుకుని అద్భుత విజయాలు సాధించారు. ఇక సింగిల్స్‌లో అసాధారణంగా ఆడిన శ్రీజ.. తనకన్నా మెరుగైన ర్యాంకర్లను ఓడించింది. ప్రిక్వార్టర్స్‌, క్వార్టర్స్‌లో ఆమె పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. శరత్‌ సర్వీసుల్లో అదరగొడితే.. శ్రీజ మెరుపు రిటర్న్‌లతో ఆకట్టుకుంది. కెరీర్‌ చరమాంకంలో ఉన్న శరత్‌ ఇంకా ఎంత కాలం ఆడతాడో లేదో తెలియదు కానీ.. తనకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని తాజా ప్రదర్శనతో శ్రీజ నిరూపించుకుంది. ప్రస్తుతం సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జాతీయ ఛాంపియన్‌గా ఉన్న శ్రీజ.. కామన్వెల్త్‌ క్రీడలు ఇచ్చిన స్ఫూర్తితో మున్ముందు అంతర్జాతీయ పోటీల్లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరం.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని