Cricket news: పాత ఫార్మాట్లోకి దులీప్‌ ట్రోఫీ

దులీప్‌ ట్రోఫీ మూడేళ్ల తర్వాత తిరిగి పాత జోనల్‌ ఫార్మాట్లోకి వెళ్లింది. సెప్టెంబరు 8న ఆరంభమయ్యే సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. వివిధ వయో విభాగాల్లో మొత్తం 1500 మ్యాచ్‌లు ఉంటాయి. ఆరు నెలలకు పైగా నడిచే

Updated : 09 Aug 2022 04:26 IST

దిల్లీ: దులీప్‌ ట్రోఫీ మూడేళ్ల తర్వాత తిరిగి పాత జోనల్‌ ఫార్మాట్లోకి వెళ్లింది. సెప్టెంబరు 8న ఆరంభమయ్యే సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. వివిధ వయో విభాగాల్లో మొత్తం 1500 మ్యాచ్‌లు ఉంటాయి. ఆరు నెలలకు పైగా నడిచే ఈ సీజన్‌ దులీప్‌ ట్రోఫీతో మొదలవుతుంది. ‘‘ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీతో సీజన్‌ ఆరంభమవుతుంది. ఈ సీజన్‌తో ఇరానీ కప్‌ కూడా తిరిగొస్తుంది. నాకౌట్‌ పద్ధతిలో ఆరు జోన్ల మధ్య దులీప్‌ ట్రోఫీ (సెప్టెంబరు 8-25) జరుగుతుంది’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. గత కొన్ని సీజన్లలో బీసీసీఐ.. జోనల్‌ ఫార్మాట్లో దులీప్‌ ట్రోఫీని నిర్వహించలేదు. బదులుగా ఇండియా రెడ్‌, బ్లూ, గ్రీన్‌ జట్లను బరిలోకి దించింది. జోనల్‌ ఫార్మాట్లో ఇప్పుడు కొత్తగా నార్త్‌ఈస్ట్‌ జోన్‌ను చేర్చారు. ముస్తాక్‌ అలీ ట్రోఫీ అక్టోబరు 11 నుంచి నవంబరు 5 వరకు, విజయ్‌ హజారే ట్రోఫీ నవంబరు 12 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతాయి. మరోవైపు రంజీ ట్రోఫీని కూడా పాత ఫార్మాట్లోకి మార్చారు. డిసెంబరు 13 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరిగే రంజీ ట్రోఫీలో గతంలోలా ఎలైట్‌, ప్లేట్‌ గ్రూపులు ఉంటాయి. ఎలైట్‌లో 32 (నాలుగు గ్రూపులు) జట్లు పోటీపడతాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్లేట్‌ గ్రూపులో ఆరు జట్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడతాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో   ప్రవేశిస్తాయి. బీసీసీఐ మొదటిసారి బాలికల అండర్‌-16 వన్డే టోర్నమెంట్‌ను నిర్వహించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని