ఇది చిన్నప్పటి కల

ప్రపంచ వేదికల్లో దేశానికి పతకం అందించాలన్నది తన చిన్నప్పటి కల అని, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆ కలను నిజం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ తెలిపింది. శరత్‌ కమల్‌తో కలిసి స్వర్ణం నెగ్గిన ఆమె..

Published : 11 Aug 2022 04:10 IST

‘ఈనాడు’తో శ్రీజ

ప్రపంచ వేదికల్లో దేశానికి పతకం అందించాలన్నది తన చిన్నప్పటి కల అని, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆ కలను నిజం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ తెలిపింది. శరత్‌ కమల్‌తో కలిసి స్వర్ణం నెగ్గిన ఆమె.. తన క్రీడల అనుభవాలు, భవిష్యత్‌ లక్ష్యాలను ‘ఈనాడు’తో పంచుకుంది. ‘‘ఈ రోజు కోసం ఎంతో కాలం వేచి చూశా. అంతర్జాతీయ పోటీల్లో.. విభిన్న దేశాల ప్రత్యర్థులతో తలపడి దేశానికి పతకం అందించాలని చిన్నప్పుడు కల కన్నా. అది ఇప్పుడిలా కామన్వెల్త్‌ పతకంతో నిజమైంది. ఈ క్రీడలకు ఎంపికవగానే దృష్టి మొత్తం పతకం సాధించడంపైనే పెట్టా. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో టీం విభాగంలో స్వర్ణం గెలవడంతో మన జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన మేము కచ్చితంగా గెలుస్తామనే అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదు. క్వార్టర్స్‌లో మంచి ప్రదర్శనే చేసినా మలేసియా చేతిలో పోరాడి ఓడాం. నేను సింగిల్స్‌లో గెలవడంతో మాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. కానీ ఆ తర్వాత లయ తప్పాం. ఆ రోజు ఆ టేబుల్‌ మీద ఎవరు ఉత్తమంగా ఆడతారో వాళ్లదే విజయం.  సింగిల్స్‌ సెమీస్‌లో ఓటమితో గదిలో బాధపడుతూ కూర్చున్నపుడు శరత్‌ అన్న వచ్చాడు. ‘ఇప్పుడే ఏం అయిపోలేదు. మనం స్వర్ణం సాధించాలి’ అని నన్ను ప్రోత్సహించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో కచ్చితంగా విజేతగా నిలుస్తామని ధైర్యం చెప్పాడు. ఆ తుదిపోరులో విజయం తర్వాత అన్న వచ్చి ఎత్తుకోగానే ఆకాశంలో తేలినట్లు అనిపించింది. నేను ఆరాధించిన ఆటగాడితో కలిసి ఛాంపియన్‌గా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేమిద్దరం 2019లో ఓ టోర్నీలో కలిసి ఆడాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌ వల్ల నాతో కలిసి ఆడేందుకు అతను ఒప్పుకున్నాడు. మా మధ్య మంచి సమన్వయం కుదిరింది. నాకు ఇప్పుడు సంబరాలకు సమయం లేదు. మళ్లీ ప్రాక్టీస్‌ మొదలెట్టాల్సిందే. శనివారం దిల్లీలో ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్తున్నాం. ఆ తర్వాత గుజరాత్‌ లీగ్స్‌ కోసం వెళ్లాలి. ఆ తర్వాత బల్గేరియాతో పాటు విదేశాల్లో కొన్ని టోర్నీల కోసం సాధన మళ్లీ ప్రారంభించాలి. చివరగా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలి. అదే నా లక్ష్యం’’ అని శ్రీజ పేర్కొంది.

శ్రీజకు ఘన స్వాగతం: శ్రీజకు బుధవారం రాత్రి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీపుపై ఆమెను ఊరేగించారు. ఆమె తల్లిదండ్రులు, కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌, టీటీ సంఘం ప్రతినిధులతో పాటు క్రీడాభిమానులు హాజరయ్యారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని