కష్టమే కానీ..

కామన్వెల్త్‌ గేమ్స్‌ హాకీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనని స్టార్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. అయితే ఆ ఓటమిని మరిచి ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పాడు. ఫైనల్లో అత్యంత

Published : 11 Aug 2022 04:10 IST

దిల్లీ: కామన్వెల్త్‌ గేమ్స్‌ హాకీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనని స్టార్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. అయితే ఆ ఓటమిని మరిచి ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పాడు. ఫైనల్లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన భారత్‌ 0-7తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ‘‘అంత భారీ తేడాతో ఓడడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. మొత్తం జట్టంతా చాలా నిరాశ చెందింది. మా ప్రధాన కోచ్‌ చెప్పినట్లు ఆస్ట్రేలియాను దీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన పరాక్రమం, లయ మాలో లోపించాయి’’ అని హర్మన్‌ప్రీత్‌ అన్నాడు. ఫైనల్లో చతికిలపడ్డా.. గ్రూప్‌ దశలో భారత్‌ మెరుగైన ప్రదర్శనే చేసింది. 11-0తో ఘనాపై నెగ్గింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ను 4-4తో డ్రా చేసుకుంది. ఆపై 8-0తో కెనడాను, 4-1తో వేల్స్‌ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో 3-2తో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ‘‘ఈ టోర్నీ నుంచి మేం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. రెండు వారాల విరామం తర్వాత మేం తిరిగి శిబిరానికి వచ్చినప్పుడు కామన్వెల్త్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌నూ విశ్లేషించుకుంటాం. సున్నా నుంచి మొదలు పెడతాం’’ అని హర్మన్‌ప్రీత్‌ చెప్పాడు. కామన్వెల్త్‌లో టోర్నీ ఆసాంతం చక్కని ప్రదర్శన చేసిన 26 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌.. తొమ్మిది గోల్స్‌ కొట్టాడు. ‘‘ఫైనల్‌ ఫలితం మాకు అనుకూలంగా లేనప్పటికీ వ్యక్తిగతంగా నాకిది చిరస్మరణీయమైన టోర్నీ. కరోనా వచ్చిన తర్వాత మొదటిసారి అంత ఎక్కువ మంది ప్రేక్షకుల మధ్య ఆడాం. చాలా మంది భారత అభిమానులు కూడా స్టేడియానికి వచ్చారు’’ అని అతడు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని