Updated : 12 Aug 2022 07:21 IST

Arjun Erigaisi: ఈ అనుభవం.. అమూల్యం

‘ఈనాడు’తో అర్జున్‌ ఇరిగేశి

ఈనాడు - హైదరాబాద్‌

ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి పాల్గొనడంతో పాటు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి. ఒలింపియాడ్‌లో పోటీపడడం జీవిత కాల అనుభవం అని.. 2700 ఎలో రేటింగ్‌ను అందుకుని సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన ఈ 18 ఏళ్ల కుర్రాడు అంటున్నాడు. తమ జట్టుకు పతకం దక్కితే బాగుండేదని.. అయినప్పటికీ ఈ టోర్నీ అనుభవం ఎంతో అమూల్యమైందని ఈ వరంగల్‌ ఆటగాడు తెలిపాడు. వ్యక్తిగత రజతం నెగ్గిన అతను.. ఈ పోటీల అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!

మొట్టమొదటి సారి చెస్‌ ఒలింపియాడ్‌కు భారత్‌ గొప్పగా ఆతిథ్యమిచ్చింది. సొంతగడ్డపై ఈ ప్రతిష్ఠాత్మక చెస్‌ సమరంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని తెలిసినప్పుడు సంతోషపడ్డా. పోటీల కోసం ఆత్రుతగా ఎదురు చూశా. టోర్నీ ఓపెన్‌ విభాగంలో అగ్రశ్రేణి జట్టుతో కలిసి ఆడడం మంచి అనుభవం. హరికృష్ణ, విదిత్‌ సంతోష్‌, ఎస్‌ఎల్‌ నారాయణన్‌, శశికిరణ్‌ లాంటి ఉత్తమ ఆటగాళ్లతో దేశం తరపున పోటీపడడం గొప్పగా అనిపించింది. రెండో సీడ్‌గా బరిలో దిగడంతో మా జట్టుపై పతక అంచనాలు ఏర్పడ్డాయి. అందరూ 2600 ఎలో రేటింగ్‌ దాటిన ఆటగాళ్లే కావడంతో కాగితం మీద జట్టు బలంగా కనిపించింది. ఊహించినట్లుగానే మాకు మంచి ఆరంభం దక్కింది. ఏడో రౌండ్‌ వరకూ అజేయంగా సాగాం. అయిదు రౌండ్లలో నెగ్గిన మేము.. మరో రెండు డ్రా చేసుకున్నాం. ఎనిమిదో రౌండ్లో అర్మేనియా చేతిలో ఓటమి దెబ్బతీసింది. అంతకుముందు ఆరో రౌండ్లోనూ ఉజ్బెకిస్థాన్‌తో డ్రాకు బదులు విజయం వరించి ఉంటే పతకం దక్కేందుకు మెరుగైన అవకాశాలు ఉండేవి. అర్మేని యాపై గెలిచినా.. ఫలితం మరోలా ఉండేది. ఏ ప్రత్యర్థితో ఎవరు తలపడాలనేది కొంచెం భిన్నంగా ఉంటే పరిస్థితులు మాకు కలిసి వచ్చేవేమో అనుకుంటున్నా. జట్టు పరంగా చూసుకుంటే అర్మేనియాతో పోరు కఠినంగా సాగింది. వ్యక్తిగతంగా అయితే ఉజ్బెకిస్థాన్‌ ఆటగాడు సిందరోవ్‌తో గేమ్‌ సవాలుగా అనిపించింది. ఓ దశలో ఓడిపోతానేమోనని అనుకున్నా. కానీ పట్టు వదలకుండా డ్రా చేసుకోగలిగా.

అలా రజతం..

అసలే చెస్‌ ఒలింపియాడ్‌.. పైగా స్వదేశంలో జరుగుతుంది కాబట్టి భారత ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉండడం సహజం. దాన్ని దూరం చేసుకునేందుకు మేం సరదాగా టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ లాంటి క్రీడలు ఆడేవాళ్లం. జట్టు మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరం స్నేహితులుగా కలిసిపోయాం. హరికృష్ణ నాకు సూచనలు ఇచ్చాడు. ఈ టోర్నీలో టీమ్‌ పరంగా చూసుకుంటే నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాం. పతకం దక్కితే ఇంకా బాగుండేది. కానీ వ్యక్తిగతంగా నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. 11 రౌండ్లు ముగిసే సరికి అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆరు గేమ్‌లు గెలిచిన నేను.. మరో అయిదు డ్రా చేసుకున్నా. దీంతో వ్యక్తిగత రజతం దక్కింది. ఒక్కో రౌండ్లో 1 నుంచి 5 బోర్డులపై ఆటగాళ్లు తలపడతారు. నేను టోర్నీ సాంతం మూడో బోర్డు మీద ఆడా. ఇలా ఒక్కో బోర్డు పరంగా అత్యధిక పాయింట్లు గెలుచుకున్న వాళ్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇచ్చారు. మూడో బోర్డులో ఇంగ్లాండ్‌ ఆటగాడు హావెల్‌ డేవిడ్‌కు పసిడి, మన ప్రజ్ఞానందకు కాంస్యం వచ్చింది. ఇలాగే తొలి బోర్డులో గుకేశ్‌, రెండో బోర్డులో నిహాల్‌ మొదటి స్థానాల్లో నిలిచారు.

ఆశ్చర్యమేమీ కాదు..

ఈ చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్‌ విభాగంలో భారత పురుషుల రెండో జట్టు కాంస్యం గెలవడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ప్రజ్ఞానంద, గుకేశ్‌, నిహాల్‌ సరీన్‌, రౌనక్‌ సధ్వాని.. ఇలా నాణ్యమైన యువ ఆటగాళ్లతో నిండిన ఆ జట్టు ఎంతో బలంగా ఉంది. వాళ్లందరి రేటింగ్‌ 2600 పైనే ఉంది. ఓ దశలో భారత్‌-2 ఛాంపియన్‌గా నిలుస్తుందని భావించా. కానీ పదో రౌండ్లో ఉజ్బెకిస్థాన్‌తో డ్రా చేసుకోవడం జట్టు అవకాశాలపై ప్రభావం చూపింది. ఆ రౌండ్‌ గెలిచి ఉంటే ఈ జట్టుకు ఇంకా మెరుగైన ఫలితం వచ్చేది. నిహాల్‌, గుకేశ్‌, రౌనక్‌తో నాకు మంచి స్నేహం ఉంది. మేమందరం కలిసి పోటీల సమయంలో సరదాగా ఉంటాం. మరోవైపు మహిళల విభాగంలో టాప్‌సీడ్‌గా అడుగుపెట్టిన భారత్‌-1 జట్టు చివరి రౌండ్లో ఓడిపోవడం నిరాశ కలిగించింది. పదో రౌండో వరకూ స్వర్ణం గెలిచేలా కనిపించిన ఆ జట్టు.. ఆఖరి రౌండ్లో అమెరికా చేతిలో ఓటమితో కాంస్యానికే పరిమితం కావాల్సి వచ్చింది.

అదే లక్ష్యం..

కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నానంటే ఆటపై ప్రేమే అందుకు కారణం. ఓ క్రీడాకారుడిగా కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి విజయాలు సాధించడంపైనే దృష్టి సారించాలి. గెలవాలనే తపనే నాకు స్ఫూర్తినిస్తోంది. ప్రతి గేమ్‌లోనూ పైచేయి సాధించాలనే పట్టుదల ప్రదర్శిస్తా. ఇప్పుడిక కొన్ని రోజులు ఇంట్లో గడిపి మళ్లీ టోర్నీల కోసం సిద్ధమవ్వాల్సి ఉంది. టోర్నీల వల్ల చదువుకు విరామమిచ్చా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతా. సినిమాలూ చూస్తా. తెలుగులో ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం కళాశాలలో ఉన్న మా అక్క రెండ్రోజుల్లో ఇంటికి వస్తుంది. అప్పుడు ఆమెతో కలిసి రాఖీ పండగ చేసుకుంటాం. ఈ నెల 16న అబుదాబి వెళ్లాలి. విదేశాల్లో రెండు ప్రధాన టోర్నీల్లో పాల్గొని సెప్టెంబర్‌లో తిరిగొస్తా. ప్రస్తుతం నా ఎలో రేటింగ్‌ 2700 దాటింది. దాన్ని ఇంకా పెంచుకోవడంపైనే ధ్యాస పెట్టా. ఎప్పటికైనా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్నదే నా లక్ష్యం.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts