ఒక రోజు ముందుగానే ఫుట్‌బాల్‌ సంబరం

ప్రతిష్ఠాత్మక ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సమరం ఒక రోజు ముందుగానే ఆరంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ అభిమానులు ఎదురు చూసే ఈ టోర్నీని ఈ ఏడాది నవంబర్‌ 21కి బదులు 20వ తేదీనే ప్రారంభించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఆదివారం సాయంత్రం ఆతిథ్య ఖతార్‌ తొలి మ్యాచ్‌ ఆడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 13 Aug 2022 03:07 IST

నవంబర్‌ 20న ప్రపంచకప్‌ ఆరంభం

జెనీవా: ప్రతిష్ఠాత్మక ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సమరం ఒక రోజు ముందుగానే ఆరంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ అభిమానులు ఎదురు చూసే ఈ టోర్నీని ఈ ఏడాది నవంబర్‌ 21కి బదులు 20వ తేదీనే ప్రారంభించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఆదివారం సాయంత్రం ఆతిథ్య ఖతార్‌ తొలి మ్యాచ్‌ ఆడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఈక్వెడార్‌తో ఆ జట్టు తలపడుతుంది. దీంతో టోర్నీ సాగే రోజుల సంఖ్య 28 నుంచి 29కి పెరిగింది. ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినోతో పాటు ఆరు ఖండాంతర సాకర్‌ సమాఖ్యల అధ్యక్షులతో కూడిన కమిటీ ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మార్పు వల్ల తలెత్తే సమస్యలను ఓ క్రమపద్ధతిలో పరిష్కరిస్తామని ఫిఫా తెలిపింది. తొలి రోజు ఆరంభ వేడుకల తర్వాత ఖతార్‌ మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ముందుగా ప్రకటించిన డ్రా ప్రకారం ఈ మ్యాచ్‌ నవంబర్‌ 21న ప్రారంభం కావాల్సింది. ఆ రోజు తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో సెనెగల్‌, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఇరాన్‌ తలపడాల్సింది. ఖతార్‌-ఈక్వెడార్‌ మధ్య మూడో మ్యాచ్‌కు ముందే ఆరంభ వేడుకలు నిర్వహించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక రోజు ముందుగానే ఖతార్‌ మ్యాచ్‌ జరుగుతుంది. సోమవారం నెదర్లాండ్స్‌-   సెనెగల్‌, ఇంగ్లాండ్‌-ఇరాన్‌  మ్యాచ్‌లు ఉంటాయి. ఈ నిర్ణయం కారణంగా అభిమానులకు, స్పాన్సర్లకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని మాజీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రికార్డో ఫోర్ట్‌ తెలిపాడు. ‘‘అతిథులను ఆహ్వానించిన స్పాన్సర్లు వాళ్ల కోసం ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు. విమాన టికెట్లను, హోటళ్లను ఇప్పటికే బుక్‌ చేశారు. మ్యాచ్‌లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడీ నిర్ణయంతో వాటన్నింటినీ మార్చాలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి’’ అని అతను తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని