టెస్టు క్రికెట్‌ ఆడేవాళ్లు ఎవరు?

నాణ్యమైన క్రికెటర్లు ఆడుతున్నంతసేపు టెస్టు క్రికెట్‌ భవిష్యత్‌కు ఢోకా ఉండదని, భవిష్యత్‌లో ఆ పరిస్థితి ఉంటుందా అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ ఛాపెల్‌ ప్రశ్నించాడు. ‘‘నా జీవిత కాలంలో టెస్టు క్రికెట్‌ కనుమరుగు కాదు.

Updated : 14 Aug 2022 09:43 IST

దిల్లీ: నాణ్యమైన క్రికెటర్లు ఆడుతున్నంతసేపు టెస్టు క్రికెట్‌ భవిష్యత్‌కు ఢోకా ఉండదని, భవిష్యత్‌లో ఆ పరిస్థితి ఉంటుందా అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ ఛాపెల్‌ ప్రశ్నించాడు. ‘‘నా జీవిత కాలంలో టెస్టు క్రికెట్‌ కనుమరుగు కాదు. కానీ ఈ ఫార్మాట్‌ను ఆడేది ఎవరు? అన్నదే అతిపెద్ద ప్రశ్న. నాణ్యమైన ఆటగాళ్లు లేనప్పుడు.. టెస్టు క్రికెట్‌లో ఆసక్తి ఉంటుందా? అంటే అసలు ఉండదు. అయిదు రోజుల క్రికెట్‌ ఎంతో మంచిది. ఈ ఫార్మాట్‌ జనరంజకంగా ఉండాలంటే బాగా ఆడేవాళ్లు కావాలి’’ అని ఇయాన్‌ అన్నాడు. ప్రస్తుతం టాప్‌ క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగుల్లో ఆడేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. యూఏఈలో జరిగే టీ20 లీగ్‌లో ఆడేందుకు తనకు నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాల్సిందిగా తాజాగా ఆసీస్‌ స్టార్‌ క్రిస్‌ లిన్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లు వేగంగా విస్తరించడం వల్ల టెస్టు క్రికెట్‌కు నష్టమేనని ఇయాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘టీ20 క్రికెట్‌ విపరీతంగా పెరగడం వల్ల టెస్టు క్రికెట్‌కు నష్టం వాటిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌ బోర్డులు సంక్షోభంలో ఉండడం వల్ల కూడా ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20లు ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు. విండీస్‌ తమ ఆటగాళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. శ్రీలంకకు సౌకర్యాలు ఉన్నా రాజకీయ సంక్షోభంలో ఉంది. దక్షిణాఫ్రికాదీ ఇదే పరిస్థితి. నాణ్యమైన ఆటగాళ్లు ఉండే ఆస్ట్రేలియా లాంటి జట్లే ఇరకాటంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్స్‌లో జట్లను కలిగి ఉన్న ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు కూడా ఆటగాళ్లకు సమస్యగానే మారాయి. ఎందుకంటే ఐపీఎల్‌లో బాగా డబ్బులు సంపాదించే క్రికెటర్లు.. వేరే దేశాల లీగ్‌లలో ఉన్న తమ ఫ్రాంఛైజీలకు సంబంధించిన జట్లకు ఆడాల్సి వస్తోంది. అదే సమయంలో దేశానికి ఆడాల్సిన పరిస్థితి తలెత్తితే.. ఐపీఎల్‌ ఒప్పందాన్ని ప్రమాదంలో పడేయడానికి ఆటగాడు సిద్ధపడతాడా’’ అని ఇయాన్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts