క్రికెట్‌ టోర్నీలో నా ముఖంపై కొట్టారు

ఆత్మకథలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ సంచలన ఆరోపణలు చేశాడు.భారత క్రికెట్‌ టోర్నీ జట్టు యజమాని ఒకరు తన ముఖంపై మూణ్నాలుగు సార్లు కొట్టాడని ‘‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’’ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకంలో అతను వెల్లడించాడు. రాజస్థాన్‌ తరపున ఆడుతూ..

Published : 14 Aug 2022 04:01 IST

ఆత్మకథలో రాస్‌ టేలర్‌ సంచలన ఆరోపణలు

దిల్లీ: ఆత్మకథలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ సంచలన ఆరోపణలు చేశాడు.భారత క్రికెట్‌ టోర్నీ జట్టు యజమాని ఒకరు తన ముఖంపై మూణ్నాలుగు సార్లు కొట్టాడని ‘‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’’ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకంలో అతను వెల్లడించాడు. రాజస్థాన్‌ తరపున ఆడుతూ.. ఓ మ్యాచ్‌లో డకౌటైన తర్వాత ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. మరీ గట్టిగా కొట్టకపోయినప్పటికీ   సరదాగా అలా చేశాడని తాను కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నాడు. ‘‘ఓ సారి భారతక్రికెట్‌ టోర్నీ మొహాలీలో పంజాబ్‌తో రాజస్థాన్‌ ఆడింది. అప్పుడు 195 పరుగుల లక్ష్య ఛేదనలో నేను ఎల్బీగా డకౌటయ్యా. ఆ ఛేదనను పూర్తి చేయలేకపోయాం. ఆ తర్వాత జట్టు, సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్‌ ఆ హోటల్లోని పై అంతస్తు బార్‌లో ఉన్నారు. షేన్‌వార్న్‌తో లిజ్‌ హార్లీ ఉంది. అప్పుడు రాజస్థాన్‌ యజమానుల్లో ఒకరు ‘రాస్‌.. డకౌట్‌ అయ్యేందుకు నీకు మేము మిలియన్‌ డాలర్లు చెల్లించడం లేదు’ అని అన్నాడు. వెంటనే నా ముఖంపై మూణ్నాలుగు సార్లు కొట్టాడు. అప్పుడు నవ్వుతున్న అతను గట్టిగా కొట్టలేదు. కానీ సరదాగా అలా చేశాడని  నేను కచ్చితంగా చెప్పలేను. ఆ పరిస్థితుల వల్ల దాన్ని పెద్ద సమస్యగా మార్చాలనుకోలేదు. కానీ అనేక ప్రొఫెషనల్‌ క్రీడా వాతావరణాల్లో ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేకపోయా’’ అని పుస్తకంలో టేలర్‌ పేర్కొన్నాడు. 2008 నుంచి 2010 వరకు భారత క్రికెట్‌ టోర్నీలో బెంగళూరుకి ఆడిన అతను.. 2011లో రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత దిల్లీ, అప్పటి పుణె వారియర్స్‌కూ ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని