ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు సింధు దూరం

కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల సింగిల్స్‌ స్వర్ణంతో జోరు మీదున్న భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పుకుంది. తన ఎడమ పాదం ఎముకలో చీలికే అందుకు కారణం. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆమెనే వెల్లడించింది.

Published : 14 Aug 2022 04:03 IST

దిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల సింగిల్స్‌ స్వర్ణంతో జోరు మీదున్న భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పుకుంది. తన ఎడమ పాదం ఎముకలో చీలికే అందుకు కారణం. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆమెనే వెల్లడించింది. ‘‘కామన్వెల్త్‌ క్రీడల్లో దేశం కోసం పసిడి గెలిచిన నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కామన్వెల్త్‌ క్రీడల క్వార్టర్స్‌ మ్యాచ్‌లో పాదంలో నొప్పి కలిగింది. గాయం భయం ఏర్పడింది. కానీ నా కోచ్‌, ఫిజియో, శిక్షకుడి సాయంతో వీలైనంత వరకూ ముందుకు సాగా. ఫైనల్స్‌ తర్వాత ఆ నొప్పి భరించలేనంత తీవ్రంగా మారింది. హైదరాబాద్‌ రాగానే ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి వెళ్లా. నా ఎడమ పాదంలో చీలిక ఉందని వైద్యులు నిర్ధరించారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. మరికొన్ని వారాల్లో తిరిగి సాధన మొదలెడతా. మీ అందరి మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు’’ అని శనివారం ఆమె పోస్టు చేసింది. ఈ నెల 21న టోక్యోలో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ ఆరంభమవుతాయి. 2019 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధు.. అంతకుముందు రెండేసి చొప్పున రజతాలు, కాంస్యాలు గెలిచింది. 27 ఏళ్ల సింధు నొప్పితోనే కామన్వెల్త్‌ క్రీడల్లో విజేతగా నిలిచింది. మరోవైపు 2016 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఆమె.. గతేడాది కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని