స్వర్ణ యుగం తలుపు తడుతోంది

భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం తలుపు తడుతోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా దేశ క్రీడా విధానాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కామన్వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించిన అథ్లెట్లను తన అధికారిక నివాసంలో శనివారం ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేవలం పతకాల సంఖ్య ఆధారంగా ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో అథ్లెట్ల ప్రదర్శనను అంచనా వేయలేం.

Published : 14 Aug 2022 04:05 IST

కామన్వెల్త్‌ అథ్లెట్లతో ప్రధాని మోదీ

దిల్లీ

భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం తలుపు తడుతోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా దేశ క్రీడా విధానాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కామన్వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించిన అథ్లెట్లను తన అధికారిక నివాసంలో శనివారం ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేవలం పతకాల సంఖ్య ఆధారంగా ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో అథ్లెట్ల ప్రదర్శనను అంచనా వేయలేం. మన వాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. కొన్ని క్రీడాంశాల్లో ఒక్క సెకన్‌ లేదా ఒక్క సెంటీమీటర్‌ తేడాతో వెనకబడ్డాం. భవిష్యత్‌లో దీన్ని అధిగమిస్తామనే నమ్మకంతో ఉన్నా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక మనం ఏ మాత్రం నిశ్శబ్దంగా కూర్చోలేం. భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం తలుపు తడుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, విభిన్నమైన క్రీడా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎలాంటి ప్రతిభ కూడా వృథా కాకూడదు. వీళ్లందరూ మన ఆస్తులు’’ అని తెలిపారు. ఈ క్రీడల్లో బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లో మన ఆధిపత్యం కొనసాగగా.. కొత్తగా అథ్లెటిక్స్‌, లాన్‌బౌల్స్‌లోనూ పతకాలు వచ్చాయి. ‘‘మనం బలంగా ఉన్న క్రీడాంశాల్లో మరింత పట్టు సాధించడమే కాకుండా కొత్త ఆటల్లోనూ ముద్ర వేశాం. హాకీలో మన వారసత్వాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గత క్రీడలతో పోలిస్తే ఈ సారి నాలుగు క్రీడాంశాల్లో తొలిసారి పతకాలు నెగ్గాం. లాన్‌బౌల్స్‌ నుంచి అథ్లెటిక్స్‌ వరకూ క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగింది. దీని వల్ల కొత్త క్రీడలపై యువత ఆసక్తి పెరుగుతుంది. నూతన క్రీడాంశాల్లో మన ప్రదర్శన ఇంకా మెరుగవ్వాలి’’ అని ప్రధాని వివరించారు. ఇక ఈ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన అమ్మాయిల టీ20 క్రికెట్లో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు రజతం గెలిచిన సంగతి తెలిసిందే. ‘‘హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో క్రికెట్లో భారత్‌ అమోఘమైన ప్రదర్శన చేసింది. అందరూ గొప్పగా రాణించారు. ముఖ్యంగా రేణుక స్వింగ్‌ బౌలింగ్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు సమాధానం ఇవ్వలేకపోయారు. అత్యుత్తమ క్రికెటర్లను దాటి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం చిన్న విషయం కాదు. భారత 75వ స్వాతంత్య్ర వేడుకల సమయంలో మన అథ్లెట్లు ఇలాంటి ప్రదర్శన చేయడం యాదృచ్ఛికం’’ అని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెజ్లర్లు, వెయిట్‌లిఫ్టర్లు, బాక్సర్లు, షట్లర్లు, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు తదితర అథ్లెట్లు పాల్గొన్నారు. ఇటీవల బర్మింగ్‌హామ్‌లో ముగిసిన ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు కలిపి మొత్తం 61 పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌లో ముగిసిన చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొన్న, పతకాలు సాధించిన ప్లేయర్లనూ ప్రధాని అభినందించారు.  ఈ సందర్భంగా బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ తన గ్లోవ్స్‌ను మోదీకి బహుమతిగా అందించింది. ప్రధాని మోదీ తమతో మాట్లాడినప్పుడు.. మొత్తం దేశం తమకు అండగా నిలిచినట్లు అనిపించిందని భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెప్పింది. 


రెజ్లింగ్‌ను వదిలేయాలనుకున్నా

టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవడంలో విఫలమయ్యాక రెజ్లింగ్‌ను వదిలేయాలనుకున్నానని వినేశ్‌ ఫొగాట్‌ చెప్పింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాటలు తనను ఉత్తేజపరిచాయని తెలిపింది. క్వార్టర్‌ఫైనల్లో గాయంతో 2016 రియో ఒలింపిక్స్‌లో పతకానికి దూరమైన వినేశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లోనే ఓడింది. తన బరువు విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా బరిలోకి దిగినా.. ఆమె పరాజయంపాలైంది. అయితే ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. ‘‘ఇప్పుడు నేను సరికొత్త వినేశ్‌ని. పెద్ద మానసిక అడ్డంకిని అధిగమించా. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం నెగ్గకపోవడంతో రెజ్లింగ్‌ను వదిలేద్దామనుకున్నా. కానీ నా కుటుంబం నాకు మద్దతుగా నిలిచింది. నేను నిరాశలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోదీని కలిశా. ఆయన మాటలతో ప్రేరణ పొందాను. ‘నీపై మాకు నమ్మకముంది. నువ్వు సాధించగలవు’ అని ప్రధాని అన్నారు. ఆ మాటలు నాకు ఉత్తేజాన్నిచ్చాయి’’ అని వినేశ్‌ చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని