అమ్మాయి ఆట ప్రగతికి బాట

దేశ భవిష్యత్‌ బాగుండాలంటే ఆటల ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలని అంటున్నాడు సచిన్‌ తెందుల్కర్‌. ఎన్నో ప్రతిబంధకాలను దాటుకుంటూ అమ్మాయిలు విజేతలుగా నిలుస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని ఈనాడు పాఠకుల కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో సచిన్‌ పేర్కొన్నాడు.

Updated : 15 Aug 2022 08:20 IST

దేశ భవిష్యత్‌ బాగుండాలంటే ఆటల ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలని అంటున్నాడు సచిన్‌ తెందుల్కర్‌. ఎన్నో ప్రతిబంధకాలను దాటుకుంటూ అమ్మాయిలు విజేతలుగా నిలుస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని ఈనాడు పాఠకుల కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో సచిన్‌ పేర్కొన్నాడు.

మీరాబాయి చాను 109 కిలోల బరువు విజయవంతంగా ఎత్తినప్పుడు హాల్‌ చప్పట్లతో మార్మోగింది. చాను కాస్త వెనక్కి జరిగి ఎప్పటిలాగే నవ్వుతూ ‘నమస్తే’ చెప్పింది. ఆపై ఆమె కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించడమే కాకుండా.. కొత్త రికార్డు నెలకొల్పినప్పుడు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అంతకుముందే సంకేత్‌ సాగర్‌ రజతం, గురురాజ కాంస్యాలు గెలిచి భారత్‌ ఖాతా తెరిచారు. పదకొండు రోజుల పాటు మొత్తం దేశమంతా ఊపిరిబిగబట్టి క్రీడలను అనుసరించింది. భారత్‌ 22 స్వర్ణాలు, 16 రజతాలు సహా మొత్తం 61 పతకాలతో కామన్వెల్త్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి అనదగ్గ ప్రదర్శనతో క్రీడలను ముగించింది. అది కూడా క్రీడల్లో తనకు బాగా కలిసొచ్చే షూటింగ్‌ లేకుండానే. గెలుపు సంబరాలు చేసుకోవడానికి.. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భారత్‌ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నెల కంటే మంచి సమయమేముంటుంది.

విజేతలైన అథ్లెట్లంతా పట్టుదలతో తీవ్ర ప్రతికూలతలను అధిగమించినవారే. మహిళా బృందానికి ఎదురైన సవాళ్లు మరింత కఠినమై ఉండొచ్చు. వాళ్లు పోటీదారులు నెలకొల్పిన ప్రమాణాలనే కాదు... సమాజం, కుటుంబం, ఇతర బాహ్య అధికార వ్యవస్థల ప్రమాణాలనూ జయించారు. జూడోలో సుశీలా దేవి, తూలిక మాన్‌ రజతాల నుంచి రెజ్లింగ్‌లో సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌ల స్వర్ణాల వరకు.. బాక్సింగ్‌లో నీతూ, నిఖత్‌ జరీన్‌ల స్వర్ణాల నుంచి బ్యాడ్మింటన్‌లో సింధు పసిడి వరకు ఈ ఏడాది మనం ఎన్నో అద్భుత ప్రదర్శనలను చూశాం. ఉత్కంఠ పోరులో గెలిచి మన మహిళల హాకీ జట్టు కూడా కాంస్యం సాధించింది. బాగా తెలిసిన ఆటల్లోనే కాకుండా.. కొత్త ఆట లాన్‌ బాల్స్‌లోనూ భారత్‌ మెరిసింది. అందులో మహిళల ఫోర్స్‌ జట్టు పసిడి పట్టేసింది. దేశానికి దాదాపుగా తెలియని ఆటలో పతకం, అదీ స్వర్ణం నెగ్గడం చాలా గొప్ప విషయం. ఆసక్తికర విషయమేంటంటే జట్టు సభ్యులైన రూప రాణి టిర్కీ, లవ్లీ చౌబే, పింకీ సింగ్‌, నయన్మొని సైకియాలవి చాలా భిన్న నేపథ్యాలు. రూప ఒకప్పుడు కబడ్డీ క్రీడాకారిణి, నయన్మొని వెయిట్‌లిఫ్టర్‌, పింకీ క్రికెటర్‌ కాగా.. లవ్లీ మొదట్లో స్ప్రింటర్‌. వాళ్లంతా చాలా తక్కువ మంది నడిచిన దారిని ఎంచుకుని గొప్ప కీర్తిని సంపాదించారు. అయితే క్రీడల్లో అమ్మాయిల కీర్తిలో గతంలో ఎదుర్కొన్న కష్టాలు మిళితమై ఉన్నాయి. ఈ కీర్తి వారికి సాధికారతను కల్పిస్తుంది. దీనికి మూలం ఆటలే. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా అత్యుత్తమ స్థాయిని అందుకోవడంలో జాతి, లింగ భేదాలు లేకుండా క్రీడలు అందరినీ ఏకంగా చేస్తాయి. అయితే కొన్ని క్రీడల్లో కొన్ని ప్రపంచ ఈవెంట్లలో చాలా ఆలస్యంగా మహిళలకు పోటీపడే అవకాశాన్ని ఇచ్చారని మనం గుర్తించాలి. ఉదాహరణకు బాక్సింగ్‌నే తీసుకోండి. మేరీకోమ్‌, నిఖత్‌ జరీన్‌ లాంటి ఛాంపియన్లు మనకు ఆ క్రీడలో ఉన్నారు. కానీ మహిళల బాక్సింగ్‌ను తొలిసారి ఒలింపిక్స్‌లో 2012 (లండన్‌)లో చేర్చారు. ఈ సంవత్సరమే మహిళల క్రికెట్‌ కామన్వెల్త్‌ అరంగేట్రం చేసింది. అందులో మన జట్టు రజతం నెగ్గి మనం గర్వపడేలా చేసింది.

ఏదేమైనా ఆట..  ఎదిగేందుకు అందరికీ, ముఖ్యంగా మహిళలకు ఏళ్లుగా ఒక వాహకంగా ఉంటోంది. అది వారికి ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని.. పితృస్వామ్యం సృష్టించే అడ్డంకులను, సామాజిక ప్రతిబంధకాలను ఛేదించే బలాన్నిచ్చింది. ఆధునికత, సమాజ ప్రగతి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పైకొస్తున్నారు. చాలా మంది విజేతలు పుట్టారు.  వాళ్లు పతక విజేతలే కాదు.. తమ క్రీడలకు నాయకులు కూడా. వర్ధమాన క్రీడాకారులకు ప్రేరణగా కూడా నిలుస్తున్నారు. నాయకత్వ ధర్మాన్ని ఆట మన అందరికీ నేర్పిస్తుంది.
మన మహిళా క్రీడాకారుల్లో చాలా మంది గ్రామీణ, పేద నేపథ్యం నుంచి వచ్చిన వారే అన్న విషయాన్ని మనం మరువొద్దు. వాళ్లు ఎంతో కష్టపడడం ద్వారా జీవనోపాధితో పాటు గౌరవాన్ని పొందుతున్నారు. అమ్మాయిలు ఎంచుకున్న ఆటలో విజయవంతమయ్యేందుకు.. వారికి  చిన్నప్పటి నుంచే అవసరమైన మద్దతు, సహాయం దక్కడం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. సరైన గుర్తింపు, సమాన అవకాశాలు ఇస్తే మహిళలు దేశ ప్రగతికి గొప్పగా దోహదపడతారు. చాలా వేగంగా సాగుతోన్న ఈ ప్రపంచంలో మన క్రీడాకారిణులు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నంగా ఉండొచ్చు. కొందరు పేదిరికంలో మగ్గుతుంటే, కొందరు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. కొందరికి సరైన మౌళిక సదుపాయాలు అందుబాటులో లేవు. కొందరేమో పితృస్వామ్యం వ్యవస్థ బాధితులు. అలాంటి లక్షలాది మందికి చాను, నిఖత్‌ లేదా సింధు తమ విజయాలతో ప్రేరణగా నిలుస్తున్నారు. భవిష్యత్తుపై వారిలో ఆశలు రేకెత్తిస్తున్నారు. కాబట్టి మంచి భవిష్యత్తు కోసం ఒక సమాజంగా, దేశంగా ఎదగాలంటే మన మహిళలకు క్రీడల ద్వారా సాధికారత కల్పించాలి. ఎందుకంటే వాళ్లు బంతిని తన్నిన ప్రతిసారీ.. బంతినే కాదు తమ బంధనాలనూ తన్నేస్తున్నారు. బరువులెత్తిన ప్రతిసారీ.. బరువులనే కాదు తాము ఎదుర్కొంటున్న అడ్డంకులను ఎత్తిపడేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని