Updated : 16 Aug 2022 08:32 IST

Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్‌ ముగిసినట్లే!

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బంధానికి తెరపడినట్లే కనిపిస్తోంది. చాలా రోజులుగా చెన్నై యాజమాన్యంతో అతడు ఎలాంటి సంబంధాలు కొనసాగించకపోవడమే ఇందుకు కారణం. గత ఐపీఎల్‌ సీజన్లో చెన్నై కెప్టెన్‌గా ఎంపికైన జడ్డూ కొన్ని మ్యాచ్‌ల తర్వాత సారథ్యాన్ని కోల్పోయాడు. అతడి ఆటపై ప్రభావం పడుతుందనే కారణంతో చెన్నై యాజమాన్యం జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించి మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి పగ్గాలు అందించింది. ఈ పరిణామమే జడ్డూలో ఫ్రాంఛైజీ పట్ల విముఖతను పెంచిందని సమాచారం. పక్కటెముకల గాయం కారణంగా గత ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండాపోయిన జడేజా.. సామాజిక మాధ్యమాల్లో గతంలో చెన్నై జట్టు గురించి చేసిన పోస్టులను తొలగించాడు. దీంతో సీఎస్కేకు అతడు దూరం అవుతున్నాడన్న వార్తలు వెలువడ్డాయి. దీనికి తోడు మేలో ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యంతో జడేజా దూరంగా ఉన్నాడు. కెప్టెన్‌ ధోని పుట్టినరోజు నాడు అభినందనలు తెలియజేస్తూ చెన్నై ఆటగాళ్లందరూ కలిసి చేసిన వీడియోలో జడ్డూ మాత్రమే లేడు. అంతేకాక ఆటగాళ్ల మధ్య బంధాన్ని దృఢపరచడానికి సీఎస్కే నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం జడేజా జట్టును వీడనున్నాడన్న వార్తలకు బలాన్ని అందిస్తోంది.

గత ఐపీఎల్‌ సీజన్లో జడేజా సారథ్యం వహించిన తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో చెన్నై ఓడిపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన సీఎస్కే ఆరంభంలో ఎదురైన ఓటముల వల్లే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలను కోల్పోయింది. వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడతానని ధోని గత సీజన్లోనే స్పష్టం చేశాడు. అతడు కెప్టెన్‌గానే జట్టును నడిపించనున్న నేపథ్యంలో జడేజా మళ్లీ జట్టులో చేరతాడా అనేది అనుమానంగా మారింది. ఐపీఎల్‌లో చెన్నై బలమైన శక్తిగా ఎదగడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్‌ను సీఎస్కే గత సీజన్లో రూ.16 కోట్లు పెట్టి తిరిగి దక్కించుకుంది. అంతేకాక ధోని వారసుడిగా పరిగణిస్తూ అతడికి కెప్టెన్సీని కూడా అందించింది. కానీ ఆరంభ మ్యాచ్‌ల్లో జడేజా జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. పైగా వ్యక్తిగతంగానూ విఫలమయ్యాడు. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 116 పరుగులే చేసిన జడ్డూ.. 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 2012 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లలో 156 మ్యాచ్‌లు ఆడాడు. ధోని (225), రైనా (200) తర్వాత ఈ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడింది జడేజానే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని