అక్కడ సహనం కావాలి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు ముందు తాను సహనంపై దృష్టి సారించానని భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అన్నాడు. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం రెండు వారాలు తీవ్రంగా శ్రమించా. జపాన్‌లో కోర్టులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే సహనంగా ఆడడంపైనే దృష్టి సారించా.

Published : 16 Aug 2022 02:49 IST

దిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు ముందు తాను సహనంపై దృష్టి సారించానని భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అన్నాడు. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం రెండు వారాలు తీవ్రంగా శ్రమించా. జపాన్‌లో కోర్టులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే సహనంగా ఆడడంపైనే దృష్టి సారించా. టోక్యో ఒలింపిక్స్‌ సమయంలో అక్కడ కోర్టులు వేగంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇలాంటి స్థితిలో సహనం ముఖ్యం’’ అని ప్రణయ్‌ పేర్కొన్నాడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరాడు. ఇటీవల స్థిరంగా రాణిస్తున్న ప్రణయ్‌.. ర్యాంకుల్లో టాప్‌-20లోకి వచ్చాడు. ‘‘ఒక్క ర్యాంకింగ్‌ పాయింట్‌ను మెరుగుపరుచుకోవడం కూడా చాలా కష్టం. అందుకు ప్రతి సూపర్‌ సిరీస్‌లో కనీసం సెమీస్‌ లేదా క్వార్టర్స్‌ చేరాలి. ఈ ఏడాది ఆరంభంలో 30వ ర్యాంకులో ఉన్నా.. ఇప్పుడు స్థిరంగా రాణించి టాప్‌-20లోకి వచ్చా. ఫిట్‌నెస్‌ మాత్రమే కాకుండా శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడంపై కూడా దృష్టి సారించా. ఇందుకోసం మెటబాలిక్‌ హెల్త్‌ ట్రాకర్‌ను వాడుతున్నా. దీని వల్ల మనం తినే ఆహారం,  ఒత్తిడి, పని తీరుకు శరీరం ఎలా స్పందిస్తుందో తెలుస్తుంది’’ అని ప్రణయ్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లో సెమీస్‌ చేరిన ప్రణయ్‌.. స్విస్‌ ఓపెన్లో ఫైనల్లో అడుగుపెట్టాడు. భారత్‌ చరిత్రాత్మక థామస్‌కప్‌ను  అందుకోవడంలో ఈ స్టార్‌ కీలకపాత్ర పోషించాడు. ప్రణయ్‌  చివరగా.. 2017 యుఎస్‌ ఓఎన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టోర్నీలో వ్యక్తిగత టైటిల్‌ గెలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని