వార్నర్‌తో స్నేహం అలా..

న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ తన ఆత్మకథలో వెల్లడించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ యజమానుల్లో ఒకరు తనను ముఖంపై కొట్టాడని ఆ పుస్తకంలో సంచలన ఆరోపణలు చేసిన అతను..

Published : 16 Aug 2022 02:49 IST

దిల్లీ: న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ తన ఆత్మకథలో వెల్లడించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ యజమానుల్లో ఒకరు తనను ముఖంపై కొట్టాడని ఆ పుస్తకంలో సంచలన ఆరోపణలు చేసిన అతను.. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ద్రవిడ్‌కు ఉన్న ఆదరణ గురించి పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సందర్భంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నోరు మూసిన విషయాన్ని ‘‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’’ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో దిల్లీకి ఆడిన సమయంలో ఇది జరిగింది. ఓ సారి మద్యం తాగిన తర్వాత వార్నర్‌ ఎక్కువగా మాట్లాడుతుంటే.. టేలర్‌ అతని మెడ మీద నుంచి చేతి వేసి అదిమి పట్టి (హెడ్‌లాక్‌) అరవొద్దని చెప్పాడు. ‘‘ఓ రాత్రి వార్నర్‌, నేను కలిసి మద్యం తాగాం. అప్పుడు వార్నర్‌ గట్టిగట్టిగా అరుస్తున్నాడు. మా గదుల్లోకి వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి చేరుకున్నాక అతను మరింతగా ఇబ్బంది పెట్టాడు. వెంటనే అతని మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి అరవొద్దని చెప్పా. అప్పుడతను ‘మీ ద్వీపవాసులు బలంగా ఉంటారని మర్చిపోయా. హెడ్‌లాక్‌తో నువ్వు అద్భుతమైంది సాధించావు’ అని అన్నాడు. అప్పటి నుంచి మేం మంచి స్నేహితులుగా ఉన్నాం’’ అని ఆ పుస్తకంలో టేలర్‌ తెలిపాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను.. కివీస్‌ తరపున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని