ఎంపికలో పారదర్శకత వల్లే ఈ విజయాలు

క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ లాంటి క్రీడల్లో భారత విజయాలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పునస్కరించుకుని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 16 Aug 2022 09:04 IST

దిల్లీ: క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ లాంటి క్రీడల్లో భారత విజయాలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పునస్కరించుకుని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘రాజకీయాల్లో వారసత్వం మాదిరే క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత లోపించడం వల్ల చాలాకాలంగా మన దేశంలో క్రీడాకారుల నైపుణ్యం వృథా అయింది. తమ కెరీర్‌ అంతా ఇలాంటి బాధలు అనుభవించడానికే వాళ్లు అలవాటుపడ్డారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు క్రీడాకారులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. పతకాలను కొల్లగొడుతున్నారు. ఒలింపిక్స్‌ లాంటి ఈవెంట్లలో ఒకటికి మించిన స్వర్ణాలు సాధించే రోజు ఎంతో దూరంలో లేదు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పతకాల వల్ల యువ క్రీడాకారుల ఆత్మవిశ్వాసం ఎంతో పెరుగుతోంది’’ అని చెప్పారు. క్రీడా సంఘాల్లో కుటుంబ పాలన పోవాలని అవినీతి రహితంగా ఉండాలని మోదీ అన్నారు. ‘‘మన దేశంలో చాలా క్రీడా సంఘాలు కుటుంబ పాలన నీడలో ఉన్నాయి. ఇది ప్రతిభకు హాని చేస్తుంది. క్రీడల్లో ఇలాంటి పరిస్థితిని ఏమాత్రం ఉపేక్షించం. కుటుంబ పాలనలో ఉండే క్రీడా సంఘాలను ప్రోత్సహించకూడదు. వీటిపై జనాల్లో వ్యతిరేకత రావాలి. ఇది సమాజం బాధ్యత. ప్రతి క్రీడా సంఘంలో పారదర్శకత కావాలి’’ అని మోదీ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ లాంటి మెగా ఈవెంట్లకు ముందు, తర్వాత క్రీడాకారులతో ప్రధాని సమావేశం అవుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో ఏడు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలు) సాధించిన భారత్‌.. తాజాగా బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 61 పతకాలు (22 స్వర్ణాలు, 16 రజత, 23 కాంస్యాలు) గెలుచుకున్న సంగతి తెలిసిందే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని