బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్‌ హఠాన్మరణం

బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఝార్ఖండ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘం (జేఎస్‌సీఏ) మాజీ అధ్యక్షుడు అమితాబ్‌ చౌదరి (62) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో అమితాబ్‌ మృతిచెందారు.

Published : 17 Aug 2022 03:13 IST

రాంచి: బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఝార్ఖండ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘం (జేఎస్‌సీఏ) మాజీ అధ్యక్షుడు అమితాబ్‌ చౌదరి (62) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో అమితాబ్‌ మృతిచెందారు. ఝార్ఖండ్‌ పోలీసు శాఖలో ఐజీపీగా బాధ్యతలు నిర్వహించి రిటైరైన ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్‌సీ)కు ఛైర్మన్‌గానూ పనిచేశారు. ‘‘జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌ అమితాబ్‌ చౌదరి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధిలో అమితాబ్‌ కీలకపాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా’’ అని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ట్విటర్‌లో నివాళులు అర్పించారు. రాంచీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంలో అమితాబ్‌ ముఖ్య భూమిక పోషించారు. ఝార్ఖండ్‌కు అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచ్‌లు తీసుకురావడంలో ఆయనదే కీలకపాత్ర. ‘‘అమితాబ్‌ హఠాన్మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయనతో నాది సుదీర్ఘ అనుబంధం. జింబాబ్వే పర్యటనలో టీమ్‌ఇండియాకు మేనేజర్‌గా వ్యవహరించిన అమితాబ్‌ను తొలిసారిగా అప్పుడే కలిశా. రాంచీలో ప్రపంచ స్థాయి స్టేడియం ఆయన దూరదృష్టి ఫలితమే’’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని