ప్రపంచకప్‌ను దాటిపోనివ్వద్దు

ఫిఫాతో చర్చలు జరిపి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. బయట వర్గం ప్రభావం కారణంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై ఫిఫా నిషేధం

Updated : 18 Aug 2022 08:57 IST

కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఫిఫాతో చర్చలు జరిపి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. బయట వర్గం ప్రభావం కారణంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై ఫిఫా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి భారత్‌లో నిర్వహించాలనుకోవడం లేదని కూడా ఫిఫా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏఐఎఫ్‌ఎఫ్‌కు సంబంధించిన కేసులను వెంటనే విచారించాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ జేబీ పరిద్వాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ మొదలెట్టింది. ప్రపంచకప్‌ను స్వదేశంలోనే నిర్వహించేలా ఫిఫాతో ప్రభుత్వం, కోర్టు నియమించిన పాలకుల కమిటీ (సీఓఏ) చర్చలు జరుపుతుందని, ఈ విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కేంద్రం కోరింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఈ రెండు వర్గాల మధ్య ఇప్పటికే రెండు సమావేశాలు జరిగాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. దీంతో అండర్‌-17 యువతకు ఈ ప్రపంచకప్‌ గొప్ప అంతర్జాతీయ టోర్నీగా మిగిలిపోనుందని పేర్కొన్న ధర్మాసనం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. స్వదేశంలో ఈ టోర్నీ నిర్వహణతో పాటు ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం తొలగించేలా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. సమాఖ్యలో బయట వర్గం జోక్యాన్ని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామాలన్నింటికీ ఏఐఎఫ్‌ఎఫ్‌ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ కారణమని సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా కోర్టుకు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని