ఈ పతకాలే సమాధానం

అమ్మాయికి బాక్సింగ్‌ అవసరమా? అది పురుషుల ఆట.. ఒకవేళ ముఖంపై గాయమైతే ఎలా?.. ఇవీ తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ప్రశ్నలు. వాటన్నింటినీ దాటి ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

Updated : 18 Aug 2022 08:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమ్మాయికి బాక్సింగ్‌ అవసరమా? అది పురుషుల ఆట.. ఒకవేళ ముఖంపై గాయమైతే ఎలా?.. ఇవీ తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ప్రశ్నలు. వాటన్నింటినీ దాటి ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పట్టేసింది. గతంలో తనను ప్రశ్నించిన వాళ్లకు ఇప్పుడు పతకాలతోనే సమాధానమిస్తున్నానని ఆమె బుధవారం ‘ఈనాడు’కు తెలిపింది. ‘‘నా కెరీర్‌ ఆరంభంలో నిరాశ కలిగించే మాటలు ఎన్నో విన్నా. వాళ్లకు ఇప్పుడు నేనేం చెప్పాలనుకోవడం లేదు. నా పతకాలే బదులిస్తున్నాయి. గెలవాలనే తపన, పట్టుదల ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు నాకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నేను విజయం సాధిస్తే అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. 2022కు ముందుతో పోలిస్తే ఇప్పుడు జీవితం ఎంతో మారిపోయింది. ప్రజల నుంచి నాకెంతో మద్దతు, ప్రేమ దొరుకుతోంది. వాళ్ల అంచనాలను అందుకునేందుకు కష్టపడుతూనే ఉంటా. పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. కేవలం నీతూ అనే కాదు.. మంజురాణి, అనామిక లాంటి బాక్సర్లూ ఉన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన వాళ్లకే ఒలింపిక్స్‌ అవకాశం దక్కుతుంది’’ అని 26 ఏళ్ల నిఖత్‌ చెప్పింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 52 కేజీల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. కామన్వెల్త్‌ క్రీడల కోసం 48-50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. ‘‘కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి బరిలో దిగి దేశానికి పసిడి అందించడం గొప్పగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ తర్వాత కామన్వెల్త్‌ క్రీడల కోసం బరువు తగ్గించుకోవడం పెద్ద సవాలుగా అనిపించింది. అందుకోసం నాకెంతో ఇష్టమైన ఆహారాన్ని మానేశా. ముఖ్యంగా బిర్యానీకి దూరమయ్యా. పతకం గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా అమ్మ చేతి బిర్యానీ తిన్నా. అక్టోబర్‌లో జరిగే ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ కోసం సన్నద్ధమవ్వాలి. ఈ ఏడాది ఆసియా క్రీడలు (2023కి వాయిదా పడ్డాయి) ఉంటే కచ్చితంగా హ్యాట్రిక్‌ కొట్టేదాన్ని. నా అంతిమ లక్ష్యం పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణం. ఆ దిశగా నా ప్రయాణం జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ కంటే ముందే ప్రారంభమైంది. త్వరలోనే మేరీకోమ్‌ను కలుస్తా. ఆమె నాకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ, కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్‌గా నిలుస్తానని ఊహించలేదు. రింగ్‌లో దిగి వంద శాతం ప్రదర్శన చేస్తే కచ్చితంగా విజయం దక్కుతుంది. నాపై పైచేయి సాధించడానికి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే అనుకుంటా. నిజామాబాద్‌ నుంచి వచ్చిన నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నా. కష్టపడితే ఎవరైనా విజేతలవుతారు. అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ పతకం తనకే అంకితమిస్తున్నా. మహమ్మద్‌ అలీ, మేరీకోమ్‌ లాంటి దిగ్గజాలను చూస్తూ పెరిగా. ఇప్పుడు అమ్మాయిలు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అని నిఖత్‌ పేర్కొంది. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని