రాహుల్‌మెరిసేనా?

వన్డేలు చాలా వేగంగా ప్రాభవం కోల్పోతున్న సమయం. పైగా ప్రత్యర్థి జింబాబ్వే. సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం లేకున్నా.. కెప్టెన్‌  కేఎల్‌ రాహుల్‌ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అందరూ అతడి ఫామ్, ఫిట్‌నెస్‌ను నిశితంగా పరిశీలిస్తారనడంలో

Published : 18 Aug 2022 02:49 IST

జింబాబ్వేతో తొలి వన్డే నేడు

మధ్యాహ్నం 12.45 నుంచి 

హరారె: వన్డేలు చాలా వేగంగా ప్రాభవం కోల్పోతున్న సమయం. పైగా ప్రత్యర్థి జింబాబ్వే. సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం లేకున్నా.. కెప్టెన్‌  కేఎల్‌ రాహుల్‌ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అందరూ అతడి ఫామ్, ఫిట్‌నెస్‌ను నిశితంగా పరిశీలిస్తారనడంలో సందేహం లేదు. రెండు జట్ల మధ్య గురువారమే తొలి వన్డే. ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా అలవోకగా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని అంచనా. తేడా ఏమాత్రం తగ్గినా పేలవ ప్రదర్శన చేసినట్లే.

పోటీ ఉందా..?

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక ఆటగాడైన రాహుల్‌.. ఓపెనర్‌గా ఈ సిరీస్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. హెర్నియా శస్త్రచికిత్స కారణంగా రెండు నెలలు ఆటకు దూరమైన అతడి తక్షణ లక్ష్యం టీ20ల్లో ఓపెనింగ్‌ స్థానాన్ని కాపాడుకోవడం, తొలి బంతి నుంచే విరుచుకుపడాలన్న జట్టు ప్రణాళికకు తగినట్లు ఆడడం. సిరీస్‌ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చూసేది కేవలం రాహుల్‌ చేసే పరుగులనే కాదు.. వాటిని ఎలా సాధిస్తున్నాడు, ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నాడన్నదాన్ని కూడా. ఆసియాకప్‌ ఆరంభానికి ముందు ఈ విషయంలో రాహుల్‌ కొంత మెరుగుపడాల్సివుంది. మరోవైపు..మ్యాచ్‌ వేదిక హరారె స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఇటీవల ముగిసిన సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై జింబాబ్వే వరుసగా 300, 290పై లక్ష్యాలను ఛేదించడం గమనార్హం. అయితే రాహుల్, ధావన్, గిల్, దీపక్‌ హుడా, సంజు శాంసన్‌లతో కూడిన భారత లైనప్‌ను నియంత్రించడం ఆతిథ్య జట్టుకు పెను సవాలే. బంగ్లాదేశ్‌లా కాకుండా.. ప్రసిద్ధ్‌ కృష్ణ, దీపక్‌ చాహర్, కుల్‌దీప్‌ యాదవ్‌లతో భారత బౌలింగ్‌ బలంగా ఉంది. ఆల్‌రౌండర్లు శార్దూల్‌ ఠాకూర్, అక్షర్‌ పటేల్‌ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జింబాబ్వే లైనప్‌ను దెబ్బతీయగలరు. గాయాల కారణంగా దూరమై ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్‌ చాహర్‌ తిరిగి ఫామ్‌ను అందుకోవాలనుకుంటున్నాడు. భువనేశ్వర్‌ ఇప్పటికే టీ20 జట్టులో స్థానాన్ని బలోపేతం చేసుకున్న నేపథ్యంలో.. తన స్వింగ్‌ బౌలింగ్, ఆఖరి ఓవర్లలో భారీ షాట్లు ఆడగల బ్యాటింగ్‌ సామర్థ్యంతో చాహర్‌ ఆకట్టుకోవాలనుకుంటున్నాడు. ఆసియాకప్‌ జట్టులో అతడు ఇప్పటికే స్టాండ్‌బైగా ఉన్నాడు. నెమ్మదిగా ఒకప్పటి జోరును అందుకుంటున్న కుల్‌దీప్‌ కూడా సత్తా చాటాలనుకుంటున్నాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన రాహుల్‌ త్రిపాఠి ఈ సిరీస్‌తో వన్డే అరంగేట్రం చేసే అవకాశముంది. మిడిల్‌ ఆర్డర్‌లో అతణ్ని ఆడించవచ్చు. మరోవైపు చకబ్వ నేతృత్వంలోని జింబాబ్వే. బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయమిచ్చిన ఉత్సాహంతో ఉంది. భారత్‌ను అడ్డుకోవడం కష్టమే అయినా.. కనీసం గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. బంగ్లాపై సిరీస్‌ గెలుపు గాలివాటం కాదని చాటాలనుకుంటోంది. బంగ్లాపై బ్యాటుతో రాణించిన సికందర్‌ రజా, చకబ్వ, ఇన్నోసెంట్‌ కయాలు ఆ ప్రదర్శనను పునరావృతం చేయాలని జింబాబ్వే ఆశిస్తోంది.

సిరీస్‌ ఎందుకోసమంటే..

పెద్ద జట్టు కాకపోయినా ఫ్లవర్‌ సోదరులు (ఆండీ, గ్రాంట్‌), హీత్‌ స్ట్రీక్, నీల్‌ జాన్సన్, గుడ్విన్, ఒలాంగ లాంటి ఆటగాళ్లున్న సమయంలో జింబాబ్వేతో సిరీస్‌ ఆసక్తికరంగానే ఉండేది. ఆ జట్టు తన ప్రదర్శనతో ప్రత్యర్థులకు షాకిచ్చిన సందర్భాలెన్నో. కానీ గత రెండు దశాబ్దాల్లో జింబాబ్వే క్రికెట్‌ సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో క్రికెట్‌ ప్రమాణాలు బాగా పడిపోయాయి. 36 ఏళ్ల రజా, 34 ఏళ్ల చకబ్వా లేదా 34 ఏళ్ల తిరిపానోల ఆట ఫర్వాలేదు. కానీ ప్రత్యర్థులకు తమ ఆటతో సవాలు విసరలేరు. సాధారణంగా జింబాబ్వే పర్యటన అంటే.. తమ్ముడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్న సహాయం చేయడం లాంటిదే. ఈ భారత పర్యటన కూడా అందుకు భిన్నమేమీ కాదు. జింబాబ్వే క్రికెట్‌కు ఏడాదిలో అయ్యే ఖర్చులో సగానికిపైగా ఈ సిరీస్‌ టీవీ, డిజిటల్‌ హక్కుల ద్వారా వస్తుంది. కాబట్టి బీసీసీఐ పట్ల జింబాబ్వేకు సద్భావం ఏర్పడుతుంది. ఇక క్రికెట్‌ పరంగా చూస్తే.. బెంచ్‌ బలాన్ని పరీక్షించడానికి భారత సెలక్టర్లకు ఇదో మంచి అవకాశం.


జట్టు నన్ను మరచిపోలేదు : రాహుల్‌

హరారె: గాయాలతో తాను రెండు నెలల ఆటకు దూరమైనా, రెండేళ్లలో తాను చేసిన దాన్ని జట్టు మరిచిపోలేదని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ‘‘నేను రెండు నెలలకు ఆటకు దూరమై ఉండొచ్చు. కానీ జట్టు కోసం, దేశం కోసం గత రెండు మూడేళ్లలో నేను చేసిన దాన్ని జట్టు మరిచిపోలేదు. అలాంటి వాతావారణంలో ఆటగాళ్లు బాగా ఎదుగుతారు’’ అని జింబాబ్వేతో తొలి వన్డే నేపథ్యంలో చెప్పాడు. ‘‘ఇలాంటి వాతావరణంలో ఆటగాడు.. మంచి ఆటగాడి నుంచి గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడు. తన జట్టు తరఫున మరిన్ని మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడతాడు. ఆటగాడికి సెలక్టర్లు, కోచ్, కెప్టెన్‌ మద్దతు చాలా అవసరం. అది అతడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది’’ అని రాహుల్‌ అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని