చిత్తుగా కొట్టేశారు..

ఆశ్చర్యమేమీ లేదు. జింబాబ్వే నుంచి కనీస ప్రతిఘటన కరవు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘనంగా బోణీ కొట్టింది. అత్యంత ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో

Updated : 19 Aug 2022 07:04 IST

జింబాబ్వేపై భారత్‌ ఘనవిజయం

విజృంభించిన చాహర్‌, అక్షర్‌, ప్రసిద్ధ్‌

ఆశ్చర్యమేమీ లేదు. జింబాబ్వే నుంచి కనీస ప్రతిఘటన కరవు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘనంగా బోణీ కొట్టింది. అత్యంత ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. చాహర్‌, ప్రసిద్ధ్‌, అక్షర్‌ బంతితో ప్రత్యర్థిని చుట్టేస్తే.. ధావన్‌, గిల్‌ బ్యాటుతో దంచేశారు.

హరారె: టీమ్‌ ఇండియా చెలరేగిపోయింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ (3/27), అక్షర్‌ పటేల్‌ (3/24), ప్రసిద్ధ్‌ కృష్ణ (3/50) విజృంభించడంతో మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ చకబ్వ (35; 51 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. ఎంగరవ (34; 42 బంతుల్లో 3×4, 1×6), ఎవాన్స్‌ (33 నాటౌట్‌; 29 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ఛేదన టీమ్‌ఇండియాకు నల్లేరుపై నడకే అయింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (82 నాటౌట్‌; 72 బంతుల్లో 10×4, 1×6), ధావన్‌ (81 నాటౌట్‌; 113 బంతుల్లో 9×4) చెలరేగడంతో 30.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా భారత్‌ లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే శనివారం జరుగుతుంది.
ఆడుతూ పాడుతూ..
ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఫామ్‌లో ఉండడంతో భారత కెప్టెన్‌ రాహుల్‌ తాను ఓపెనింగ్‌కు రాకుండా.. ఆ జంటనే కొనసాగనిచ్చాడు. ఛేదనలో జింబాబ్వే బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ధావన్‌, గిల్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని పూర్తి చేశారు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడోసారి అర్ధశతకాలు సాధించారు. వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆరంభం నుంచి ఈ జంటకు ఇది మూడో శతక భాగస్వామ్యం కావడం గమనార్హం. లక్ష్యం చిన్నదే కావడంతో ధావన్‌, గిల్‌ ఆరంభంలో తొందరపడలేదు. ఎక్కువగా సింగిల్స్‌ తీస్తూ సాగారు. 10 ఓవర్లకు స్కోరు 43/0. కానీ క్రమంగా దూకుడు పెంచిన భారత జోడీ ఎడా పెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. చక్కని స్క్వేర్‌ కట్స్‌, లాఫ్టెడ్‌ షాట్లు ఆడిన ధావన్‌ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. తొలి 30 బంతుల్లో నియంత్రణ పాటించిన గిల్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. ముచ్చటైన షాట్లతో అలరించిన అతడు.. ఓ కళ్లు చెదిరే సిక్స్‌ కూడా కొట్టాడు. ఇద్దరూ చెమట పట్టకుండా భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.
కూన కుదేల్‌..
ఊహించినట్లే.. పదునైన భారత్‌ బౌలింగ్‌ ఆతిథ్య జింబాబ్వేకు చాలా ఎక్కువే అయింది. పేసర్లు దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఆ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. జింబాబ్వే అతి కష్టంగా 189 పరుగులు చేసింది. లోయర్‌ ఆర్డర్‌ పోరాడకపోతే జింబాబ్వే కుప్పకూలేదే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఆరంభం పేలవం. దీపక్‌ చాహర్‌ పదునైన  స్పెల్‌ (7-0-27-3)కు ఆ జట్టు విలవిల్లాడింది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు.. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి టాప్‌ లేపాడు. జట్టు బౌలింగ్‌ దాడిని ఆరంభించిన చాహర్‌.. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. తొలి మూడు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చాడు. సిరాజ్‌ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో జింబాబ్వే ఆరు ఓవర్లకు 25/0తో నిలిచింది. కానీ తన నాలుగో ఓవర్‌ నుంచి వికెట్ల వేట మొదలెట్టాడు చాహర్‌. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో ఓ షార్ట్‌ బంతితో ఇన్నోసెంట్‌ కయా (4)ను ఔట్‌ చేయడం ద్వారా ప్రత్యర్థి పతనాన్ని ఆరంభించాడు. 9వ ఓవర్లో ఓ ఔట్‌స్వింగర్‌తో మరుమని (8)ని బోల్తా

కొట్టించిన చాహర్‌.. తన తర్వాతి ఓవర్లో ఓ స్ట్రెయిట్‌ డెలివరీతో మదెవెరె (5)ను వికెట్ల ముందు అడ్డంగా దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు ఓవర్లోనే సీన్‌ విలియమ్స్‌ (1) ఇన్నింగ్స్‌కు సిరాజ్‌ తెరదించాడు. జింబాబ్వే 11 ఓవర్లలో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కెప్టెన్‌ చకబ్వ, సికందర్‌ రజా (12) ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాసేపే. ఈసారి ప్రసిద్ధ్‌, అక్షర్‌ పటేల్‌ విజృంభించారు .అయిదో వికెట్‌కు 35 పరుగులు జోడించిన చకబ్వ, రజా జంటను ప్రసిద్ధ్‌ విడదీశాడు. 17వ ఓవర్లో రజాను ఔట్‌ చేసిన అతడు.. కాసేపటికే ర్యాన్‌ బర్ల్‌ (11) ఇన్నింగ్స్‌కు తెరదించాడు. క్రీజులో నిలదొక్కుకున్న చకబ్వతో పాటు జాంగ్వె (13)ను అక్షర్‌ తన వరుస ఓవర్లలో ఔట్‌చేయడంతో జింబాబ్వే 29వ ఓవర్లో 110/8తో కష్టాల్లో చిక్కుకుంది. కానీ లోయర్‌ ఆర్డర్‌ పోరాడింది. ఎవాన్స్‌, రిచర్డ్‌ ఎంగరవ 9వ వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో జింబాబ్వే కాస్త పరువు దక్కించుకోగలిగింది. చివరికి ఎంగరవను ప్రసిద్ధ్‌, న్యాచి (8)ని అక్షర్‌ ఔట్‌ చేయడంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌కు తెరపడింది.


ఎక్కడ వదిలిపెట్టానో అక్కడ నుంచే..

హరారె: భారత జట్టులో స్థానం సుస్థిరం అయ్యే సమయంలో గాయం కారణంగా దాదాపుగా ఆరు నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు ఫామ్‌పై ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ఆరు నెలల క్రితం నేను ఎక్కడ ఆపేశానో ఈరోజు మళ్లీ అక్కడ నుంచే మొదలుపెట్టా. తొలి రెండు ఓవర్లు మెరుగ్గా బంతులు వేశా. అక్కడ నుంచి వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేశాను. నా ఫిట్‌నెస్‌ స్థాయి బాగుందనడానికి ఇదే నిదర్శనం. పిచ్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉంది. అందుకే వీలైనంతగా ఫుల్‌ లెంగ్త్‌లో బంతులు వేశాను. మధ్యలో స్వింగ్‌ చేస్తూ బ్యాటర్లను గందరగోళానికి గురి చేశా. ఒకవేళ బంతి స్వింగ్‌ కాకపోతే వేరే ప్రణాళికలు కూడా ఉన్నాయి. కానీ ఏడో ఓవర్‌ వరకు స్వింగ్‌ లభించింది. ఇలాంటి పిచ్‌పై ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే. జింబాబ్వే వందలోపే అయిదు వికెట్లు చేజార్చుకున్నా మెరుగైన స్కోరు సాధించగలిగింది’’ అని దీపక్‌ అన్నాడు. తాను టీ20 స్పెషలిస్టు అయినా వన్డేలకు తగ్గ భారాన్ని మోసేలా సిద్ధమయ్యానని చాహర్‌ అన్నాడు. ‘‘పునరాగమనంలో వన్డేలు ఆడాలని తెలుసు. అందుకే దానికి తగ్గట్టుగా సిద్ధమయ్యా. ఎక్కువ ఓవర్లు వేయడాన్ని సాధన చేశా. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడా. టీ20 ప్రపంచకప్‌లో ఎంపిక అవుతానా లేదా అన్నది ఆలోచించట్లేదు. నైపుణ్యం పరంగా మరింత మెరుగవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని దీపక్‌ పేర్కొన్నాడు.


స్కోరు వివరాలు
జింబాబ్వే ఇన్నింగ్స్‌: ఇన్నోసెంట్‌ కయా (సి) శాంసన్‌ (బి) చాహర్‌ 4; తదివానషె మరుమని (సి) శాంసన్‌ (బి) చాహర్‌ 8; వెస్లీ మదెవెరె ఎల్బీ (బి) చాహర్‌ 5; సీన్‌ విలియమ్స్‌ (సి)ధావన్‌ (బి) సిరాజ్‌ 1; సికందర్‌ రజా (సి) ధావన్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 12; చకబ్వ (బి) అక్షర్‌ 35; ర్యాన్‌ బర్ల్‌ (సి) శుభ్‌మన్‌ (బి) ప్రసిద్ధ్‌ 11; జాంగ్వె ఎల్బీ (బి) అక్షర్‌ 13; ఎవాన్స్‌ నాటౌట్‌ 33; ఎంగరవ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 34; న్యాచి (సి) శుభ్‌మన్‌ (బి) అక్షర్‌ 8; ఎక్స్‌ట్రాలు 25 మొత్తం: (40.3 ఓవర్లలో ఆలౌట్‌) 189; వికెట్ల పతనం: 1-25, 2-26, 3-31, 4-31, 5-66, 6-83, 7-107, 8-110, 9-180; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 7-0-27-3; సిరాజ్‌ 8-2-36-1; కుల్‌దీప్‌ 10-1-36-0; ప్రసిద్ధ్‌ 8-0-50-3; అక్షర్‌ 7.3-2-24-3
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ నాటౌట్‌ 81; శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 82; ఎక్స్‌ట్రాలు 29 మొత్తం: (30.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 192;
బౌలింగ్‌: రిచర్డ్‌ ఎంగరవ 7-0-40-0; న్యాచి 4-0-17-0; ఎవాన్స్‌ 3.5-0-28-0; సీన్‌ విలియమ్స్‌ 5-0-28-0; సికందర్‌ రజా 6-0-32-0; జాంగ్వె 2-0-11-0; మదెవెరె 2-0-16-0; ర్యాన్‌ బర్ల్‌ 1-0-12-0


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts