Jonty Rhodes: ఇది టీమ్‌ఇండియా - 3... కోహ్లీకి సలహాలివ్వలేను

ఐపీఎల్‌ రాకతో ఫీల్డింగ్‌ ప్రమాణాలు మరో స్థాయికి చేరుకున్నాయని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా జట్టు జయాపజయాల్లో కీలకంగా మారిందని చెప్పాడు. వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నాగోల్‌లోని వి-స్పోర్ట్స్‌ మైదానంలో రోడ్స్‌ బృందం చిన్నారులకు అయిదు రోజుల పాటు శిక్షణ

Updated : 20 Aug 2022 10:30 IST

‘ఈనాడు’తో దిగ్గజ ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌

ఈనాడు - హైదరాబాద్‌

భారత టీ20 లీగ్‌ రాకతో ఫీల్డింగ్‌ ప్రమాణాలు మరో స్థాయికి చేరుకున్నాయని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా జట్టు జయాపజయాల్లో కీలకంగా మారిందని చెప్పాడు. వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నాగోల్‌లోని వి-స్పోర్ట్స్‌ మైదానంలో రోడ్స్‌ బృందం చిన్నారులకు అయిదు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించనుంది. శనివారం నుంచి ఈనెల 25 వరకు జరిగే శిబిరంలో చిన్నారులకు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మెళకువలు నేర్పేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రోడ్స్‌తో ముఖాముఖి ‘ఈనాడు’కు ప్రత్యేకం. వివరాలు అతని మాటల్లోనే..

పూరన్‌.. పొలార్డ్‌

నాకంటే ముందు, నా తర్వాత ఎంతోమంది మంచి ఫీల్డర్లు ఉన్నారు. ఏక్‌నాథ్‌ సోల్కర్‌, టైగర్‌ పటౌడీ వాళ్ల స్థానాల్లో అత్యుత్తమ ఫీల్డర్లు. మా తరంలో నాకు ఫీల్డింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది. అప్పట్లో టీ20లు, వన్డేల్లో పవర్‌ ప్లే లేవు. తొలి 15 ఓవర్లలో ఫీల్డింగ్‌ ఆంక్షలు ఉండేవి. ఆ సమయంలో బ్యాక్ వర్డ్ పాయింట్‌, స్వ్కేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేసేవాడిని. అప్పట్లో జట్టులో ముగ్గురు, నలుగురు ఉత్తమ ఫీల్డర్లు ఉండేవారు. భారత టీ20 లీగ్‌ రాకతో మొత్తం మారిపోయింది. ఫీల్డింగ్‌ ప్రమాణాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ప్రతి స్థానానికి ప్రత్యేకమైన ఫీల్డర్‌ ఉంటున్నారు. ఇప్పుడు జట్టులో ఒకరిద్దరు తప్పితే అందరూ అత్యుత్తమ ఫీల్డర్లే. సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా మంచి పేరు తెచ్చుకున్నారు. ఫీల్డింగ్‌ ప్రాధమ్యాలు కూడా మారాయి. బౌండరీ దగ్గర క్యాచ్‌లు అందుకోవడం.. సిక్సర్లను అడ్డుకోవడం సర్వసాధారణమైంది. టీ20ల్లో చివరి బంతికి తేలే ఫలితాల్ని ఫీల్డింగ్‌ విన్యాసాలు తారుమారు చేస్తున్నాయి. సిక్సర్‌ వెళ్లే బంతిని బౌండరీ ఆవల అడ్డుకుని లోపలికి వేస్తే 5 పరుగులు కాపాడినట్లే. పొట్టి క్రికెట్లో ఒక్క పరుగు తేడాతో మారుతున్న ఫలితాలెన్నో. యూఏఈలో పంజాబ్‌ తరఫున నికోలస్‌ పూరన్‌ సిక్సర్‌ అడ్డుకున్న విధానం అద్భుతం. బంతిని అలా కూడా ఆపొచ్చా అని ఆశ్చర్యపోయా. అప్పటి వరకు అలాంటి వాటిని ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. ఇక పొలార్డ్‌ ఫీల్డింగ్‌కు కొత్త నిర్వచనం చెప్పాడు. బౌండరీ దగ్గర అసాధారణ క్యాచ్‌లు అందుకోవడం.. బంతిని నేరుగా వికెట్లకు త్రో విసరడంలో పొలార్డ్‌ తర్వాతే ఎవరైనా. అక్కడ నేనున్నా పొలార్డ్‌లా ఫీల్డింగ్‌ చేయలేను.

క్రికెట్‌.. వ్యాపారం

పటిష్టమైన దేశవాళీ వ్యవస్థ ఉండటం భారత్‌ ప్రధాన బలం. భారత టీ20 లీగ్‌తో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఫలితంగా బలమైన రిజర్వ్‌ బెంచ్‌ తయారైంది. శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌లను తక్కువ చేయను గాని ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న జట్టు టీమ్‌ఇండియా-3 అని చెప్పొచ్చు. విశ్రాంతి, గాయాలతో జట్టుకు దూరమైన స్టార్‌ ఆటగాళ్లతో కలిపి టీమ్‌ఇండియా-1, టీమ్‌ఇండియా-2 జట్లను తయారు చేయొచ్చు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఎంతో లోతు ఉంది. దీంతో భారత టీ20 లీగ్‌ మాదిరే మిగతా అన్ని దేశాలు లీగ్‌లపై దృష్టిసారించాయి. కొత్తగా దక్షిణాఫ్రికా, యూఏఈలో లీగ్‌లు రాబోతున్నాయి. ఏడాది అంతటా ఎక్కడో ఓ చోట లీగ్‌లు జరిగే అవకాశముంది. అయితే తీరిక లేని షెడ్యూల్‌ ఆటగాళ్లను పెద్ద సమస్యగా మారనుంది. దేశానికి ఆడాలో.. క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాలో తేల్చుకునే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌లో దేశం కంటే క్లబ్‌ మిన్న. ప్రస్తుతానికి క్రికెట్లో క్లబ్‌ కంటే దేశం మిన్నగా ఉంది. అయితే క్రికెట్‌ కూడా వ్యాపారమే. అందులో తప్పేమీ లేదు. లెక్కలేనంత డబ్బు వస్తుంది. ఫలితంగా మౌలిక వసతులు పెరిగి.. ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.యువ ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఆట మరింత అభివృద్ధి చెందుతుంది.

కోహ్లీకే ఎక్కువ తెలుసు

ఈ ఏడాది భారత టీ20 లీగ్‌తో పాటు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చూశా. మంచి టచ్‌లోనే ఉన్నాడు. భారీ షాట్లు ఆడుతున్నాడు. ఇన్నింగ్స్‌ను నిర్మించే క్రమంలో ఔటవుతున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లందరికీ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కెరీర్‌ చివర్లో సచిన్‌, ధోనీలకు ఇది తప్పలేదు. అయితే కోహ్లి కెరీర్‌ చరమాంకంలో ఉన్నాడని.. అతని పనైపోయిందని చెప్పట్లేదు. కోహ్లి ఫిట్‌నెస్‌, కష్టపడేతత్వం చూస్తే అతను చాలా ఏళ్లు ఆడగలడు. ఒకప్పుడు కోహ్లి పొరపాట్లు చేసినా కలిసొచ్చాయి. అప్పట్లో భారత్‌ లక్ష్యాన్ని ఛేదిస్తుంటే ప్రత్యర్థి జట్లు ఆశలు వదులుకోవాల్సిందే. వన్డేలు, టీ20ల్లో కోహ్లి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించేవాడు. సెంచరీలు, అర్ధ సెంచరీలతో చాలాసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతనికి ఒక్క జీవనదానం ఇచ్చినా మ్యాచ్‌ పోయినట్లేనని ప్రత్యర్థి జట్లు భయపడేవి. ఇప్పుడు చిన్న తప్పు కూడా ప్రతికూలంగా మారుతోంది. కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడినా ఏం ఫర్వాలేదులే అన్న భావన వచ్చేసింది. మళ్లీ ఔట్‌ చేయొచ్చని అనుకుంటున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీకి నేను సలహాలివ్వలేను. బ్యాటింగ్‌ గురించి నాకంటే అతనికే ఎక్కువ తెలుసు. కావాలంటే టెస్టుల్లో మా ఇద్దరి రికార్డులు చూడొచ్చు.

వన్డేలకే ప్రమాదం

టీ20 క్రికెట్‌ మొదలైనప్పుడు టెస్టులు చచ్చిపోతాయని అన్నారు. కాని ఎన్నో గొప్ప సిరీస్‌లు జరిగాయి. యాషెస్‌ సిరీస్‌ ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంది. ఇక టీమ్‌ఇండియా ఎక్కడ ఆడినా స్టేడియాలు నిండిపోతున్నాయి. టెస్టుల్లో ఆరోగ్యకరమైన పోటీ కనిపిస్తుంది. ఇంకో పది లీగ్‌లు వచ్చినా టెస్టులకు తిరుగులేదన్న విషయం స్పష్టం. అయితే పొట్టి ఫార్మాట్‌తో వన్డేలకే ఎక్కువ ప్రమాదం. వన్డే క్రికెట్‌ పూర్తి కనుమరుగు కాకపోవచ్చు. కాని అనుసరించే వాళ్ల సంఖ్య తగ్గొచ్చు. ఫలితంగా స్పాన్సర్ల దృక్పథంలో మార్పు రావొచ్చు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌, వచ్చే ఏడాది భారత్‌లో వన్డే వరల్డ్‌కప్‌ ఉన్నాయి. నేను మాత్రం టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని