సంక్షిప్త వార్తలు

భారత క్లబ్‌లు శ్రీగోకులం కేరళ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌ బగాన్‌ జట్లు షెడ్యూల్‌ ప్రకారం టోర్నీల్లో ఆడేలా అనుమతివ్వాలంటూ ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ)లకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందన్న కారణంగా గత సోమవారం అఖిల భారత ఫుట్‌బాల్‌ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై ఫిఫా నిషేధం విధించింది.

Published : 20 Aug 2022 02:33 IST

ఫిఫా, ఏఎఫ్‌సీలకు క్రీడా శాఖ విజ్ఞప్తి

దిల్లీ: భారత క్లబ్‌లు శ్రీగోకులం కేరళ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌ బగాన్‌ జట్లు షెడ్యూల్‌ ప్రకారం టోర్నీల్లో ఆడేలా అనుమతివ్వాలంటూ ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ)లకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందన్న కారణంగా గత సోమవారం అఖిల భారత ఫుట్‌బాల్‌ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై ఫిఫా నిషేధం విధించింది. ఎలాంటి ఫుట్‌బాల్‌ టోర్నీల్లో పాల్గొనకుండా వేటు వేసింది. అయితే ఏఎఫ్‌సీ మహిళల క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గోకులం జట్టు ఇప్పటికే ఉజ్బెకిస్తాన్‌కు చేరుకుంది. ఈనెల 23న ఇరాన్‌తో గోకులం తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరోవైపు సెప్టెంబరు 7న బహ్రెయిన్‌లో ఏఎఫ్‌సీ కప్‌ 2022 (అంతర్‌ జోన్‌ సెమీఫైనల్స్‌)లో ఏటీకే మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఫిఫా నిర్ణయం క్రీడాకారులను ఆందోళనకు గురిచేస్తుందని.. షెడ్యూల్‌ ప్రకారం ఆయా టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని శుక్రవారం క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది.


సుమిత్‌, యోగేశ్‌ ప్రపంచ రికార్డులు

బెంగళూరు: పారా అథ్లెట్లు సుమిత్‌ అంటిల్‌, యోగేశ్‌ కతూనియా ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. స్థానిక శ్రీ కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో శుక్రవారం జావెలిన్‌త్రో ఎఫ్‌-64 విభాగంలో 68.62 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన సుమిత్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న 68.55 మీటర్ల రికార్డును అధిగమించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధించే క్రమంలో సుమిత్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. డిస్కస్‌త్రోలో యోగేశ్‌ 48.34 మీటర్లు డిస్క్‌ను విసిరి రికార్డును సృష్టించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో యోగేశ్‌ రజతం గెలిచాడు.


ఎదురులేని ప్రజ్ఞానంద

మియామి: అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ లీగ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నమెంట్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద 3-1తో లెవోన్‌ అరోనియన్‌పై విజయం సాధించాడు. నాలుగు గేమ్‌ల ఈ పోరులో తొలి రెండు గేమ్‌లను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. మూడు, నాలుగు గేమ్‌లలో పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నాడు. దీంతో మొత్తం 12 పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో పాటు ఉమ్మడిగా అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని