India vs Pak: ‘సూపర్‌’ సమరం.. ఇంకోసారి

వారం కిందట చిరకాల ప్రత్యర్థుల పోరు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. హోరాహోరీగా సాగి, ఉత్కంఠభరితంగా ముగిసిన ఆ మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది టీమ్‌ఇండియా. టోర్నీలో

Updated : 04 Sep 2022 03:12 IST

నేడు పాకిస్థాన్‌తో భారత్‌ ఢీ

రాత్రి 7.30 నుంచి

దుబాయ్‌

వారం కిందట చిరకాల ప్రత్యర్థుల పోరు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. హోరాహోరీగా సాగి, ఉత్కంఠభరితంగా ముగిసిన ఆ మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది టీమ్‌ఇండియా. టోర్నీలో సూపర్‌-4కు అర్హత సాధించిన ఈ రెండు జట్లూ ఇప్పుడు మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆదివారం మళ్లీ దాయాది జట్ల సమరం చూడబోతున్నాం. తొలి మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చి త్రుటిలో ఓడాక.. హాంకాంగ్‌పై బ్యాటుతో, బంతితో చెలరేగిపోయిన పాక్‌.. టీమ్‌ఇండియాకు హెచ్చరికలు పంపింది. కసి మీద ఉన్న ఆ జట్టుతో రోహిత్‌ సేన జాగ్రత్తగా ఆడాల్సిందే.

ఆసియా కప్‌ టీ20 టోర్నీ సూపర్‌-4 దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ దశలో తమ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ పరస్పరం ఢీకొనబోతున్నాయి. గ్రూప్‌ దశలోనూ ఈ రెండు జట్లూ తలపడ్డ సంగతి తెలిసిందే. ఇరు జట్లూ ఎంతో జాగ్రత్తగా, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆడిన ఆ మ్యాచ్‌లో ఉత్కంఠను అధిగమించి టీమ్‌ఇండియానే విజయం సాధించింది. ప్రస్తుత పాక్‌ జట్టుతో అంత తేలిక కాదని ఆ మ్యాచ్‌లోనే భారత్‌కు అర్థమై ఉంటుంది. ఇక హాంకాంగ్‌పై ఆ జట్టు చెలరేగిన తీరు కూడా ఓ హెచ్చరికే. హాంకాంగ్‌ను భారత్‌ 152 పరుగులు చేయనిస్తే.. ఆ జట్టును పాక్‌ 38 పరుగులకే కుప్పకూల్చింది. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఆ జట్టు బౌలర్లు గొప్పగా బంతులేశారు. లక్ష్యం చిన్నదే అయినా దాన్ని కాపాడుకోవడానికి తుదికంటా పోరాడారు. కాబట్టి ఆదివారం పాక్‌ బౌలింగ్‌ దళం నుంచి భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు తప్పకపోవచ్చు.

గాడిన పడాలి: గ్రూప్‌ దశలో రెండు మ్యాచ్‌లూ నెగ్గినప్పటికీ.. భారత బ్యాటింగ్‌ అంత సంతృప్తికరంగా సాగలేదు. టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ ఇంకా పూర్తి స్థాయిలో లయ అందుకోలేదు. కోహ్లి రెండు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ పరుగులే చేసినా.. అతడి బ్యాటింగ్‌ సాధికారికంగా సాగలేదు. పాక్‌తో పాటు హాంకాంగ్‌పైనా పరుగులు చేయడానికి అతను చాలా శ్రమించాడు. అతను మునుపటిలా స్వేచ్ఛగా పరుగులు రాబడితే, బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తే చూడాలని అభిమానుల ఆశ. ఇక రాహుల్‌ పునరాగమనం తర్వాత బాగా ఇబ్బంది పడుతున్నాడు. పాక్‌పై డకౌటైన అతను.. హాంకాంగ్‌పై బంతికో పరుగు చొప్పున కూడా చేయలేకపోయాడు. కెప్టెన్‌ రోహిత్‌ సైతం తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. మరి ఈ త్రయం జోరుమీదున్న పాక్‌ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సూర్యకుమార్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో బ్యాటుతో, బంతితో అదరగొట్టి, హాంకాంగ్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ మ్యాచ్‌కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌కు పరీక్ష పెట్టిన మహ్మద్‌ నవాజ్, నసీమ్‌ షాలకు తోడు షా దాబ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ అప్రమత్తంగా ఉండాల్సిందే.

టాస్‌ గెలిస్తే..

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో మాదిరే ఇప్పుడు ఆసియా కప్‌లోనూ టాస్‌ గెలిచిన జట్లు ఎక్కువగా మొదట బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నాయి. అలా చేసిన జట్లకే ఎక్కువ విజయాలు దక్కుతున్నాయి. దుబాయ్‌లో మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయడం కష్టమవుతుండడమే ఇందుక్కారణం. అయితే హాంకాంగ్‌తో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ పాక్‌ బౌలర్లు విజృంభించారు. మరి భారత్‌ టాస్‌ గెలిస్తే మొదట బ్యాటింగే చేస్తుందా.. లేక బౌలింగ్‌ ఎంచుకుంటుందా అన్నది చూడాలి. దుబాయ్‌ పిచ్‌ బౌలర్లకే ఎక్కువ అనుకూలం. ఇక్కడ పరుగుల కోసం శ్రమించాల్సిందే. ముఖ్యంగా స్పిన్నర్లకు పిచ్‌ నుంచి గొప్పగా సహకారం అందుతోంది. భారత్‌-పాక్‌ తొలి మ్యాచ్‌లో మాదిరే ఆదివారం కూడా భారీ స్కోర్లయితే నమోదు కాకపోవచ్చు. ఎవరు మొదట బ్యాటింగ్‌ చేసినా 150కి అటు ఇటు స్కోరే చేయొచ్చని అంచనా.

బౌలింగ్‌లో ఎవరెవరు?

భారత్‌కు బౌలింగ్‌లోనూ కొన్ని సమస్యలున్నాయి. హాంకాంగ్‌ లాంటి చిన్న జట్టుపై మన బౌలర్లు సాధారణంగా కనిపించారు. భువనేశ్వర్, అర్ష్‌దీప్‌ రాణిస్తున్నప్పటికీ.. అవేష్‌ ఖాన్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తేలేకపోతున్నాడు. దుబాయ్‌ పిచ్‌ స్పిన్నర్లకు బాగా సహకరిస్తున్న నేపథ్యంలో అవేష్‌ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జడేజా గాయంతో టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో దీపక్‌ హుడా, అశ్విన్‌ల్లో ఒకరిని ఎంచుకునే అవకాశముంది. బ్యాటింగ్‌ ప్రధానమనుకుంటే హుడాకు, బౌలింగే ముఖ్యమనుకుంటే అశ్విన్‌కు ఛాన్స్‌ దక్కుతుంది. ప్రధాన స్పిన్నర్‌ చాహల్‌ కూడా టోర్నీలో ఇప్పటిదాకా తన ముద్రను చూపించలేకపోయాడు. ఒకప్పటితో పోలిస్తే పాక్‌ బ్యాటింగ్‌ ఎంతో మెరుగైన నేపథ్యంలో భారత బౌలర్లు సరైన ప్రణాళికతో బరిలోకి దిగాల్సిందే. జోరుమీదున్న రిజ్వాన్, జమాన్, ఖుష్‌దిల్‌లను ఎలా కట్టడి చేస్తారో చూడాలి. గ్రూప్‌ దశలో విఫలమైన బాబర్‌.. ఈ మ్యాచ్‌లో పట్టుదలతో క్రీజులో నిలిచే ప్రయత్నం చేస్తాడనడంలో సందేహం లేదు.

తుది జట్లు (అంచనా).. భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, దీపక్‌ హుడా/అశ్విన్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, అవేష్‌ ఖాన్‌/రవి బిష్ణోయ్, చాహల్‌; పాకిస్థాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్, జమాన్, ఖుష్‌దిల్, ఇఫ్తికార్, అసిఫ్‌ అలీ, షాదాబ్, నవాజ్, దహాని, నసీమ్‌ షా, రవూఫ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని