ఐపీఎల్‌.. మళ్లీ ఇంటా, బయట

ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోకి మారనుంది. గతంలో లాగా ఓ జట్టు సొంతగడ్డపై, ప్రత్యర్థి మైదానంలో మ్యాచ్‌లు ఆడనుంది. కరోనా కారణంగా గత మూడు సీజన్లను కొన్ని వేదికలకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. 2020లో యూఏఈలో లీగ్‌ నిర్వహించగా..

Published : 23 Sep 2022 02:58 IST

అక్టోబర్‌ 18న బీసీసీఐకి ఎన్నికలు

దిల్లీ: ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోకి మారనుంది. గతంలో లాగా ఓ జట్టు సొంతగడ్డపై, ప్రత్యర్థి మైదానంలో మ్యాచ్‌లు ఆడనుంది. కరోనా కారణంగా గత మూడు సీజన్లను కొన్ని వేదికలకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. 2020లో యూఏఈలో లీగ్‌ నిర్వహించగా.. గతేడాది భారత్‌లోని దిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, చెన్నైలో సగం, యూఏఈలో మిగతా సగం మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది ముంబయి, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ మాత్రమే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది తిరిగి పాత ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించాలని రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పేర్కొన్నాడు. ‘‘వచ్చే సీజన్‌ పురుషుల ఐపీఎల్‌ తిరిగి పాత పద్ధతిలో.. ఇంటా, బయట ఫార్మాట్లో జరుగుతుంది. పది జట్లూ తాము ఎంపిక చేసుకున్న వేదికలను సొంత మైదానాలుగా పరిగణించి మ్యాచ్‌లాడతాయి’’ అని ఆ లేఖలో గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వచ్చే నెల 18న ముంబయిలో జరుగుతుంది. అప్పుడే బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. అంతే కాకుండా ఈ ఏజీఎం ఎజెండాలో మహిళల ఐపీఎల్, ఐసీసీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే ప్రతినిధుల ఎంపిక విషయాలనూ చేర్చారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts