జులన్‌ కోసం క్లీన్‌స్వీప్‌ చేస్తాం

1999 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచి భారత మహిళలు చరిత్ర సృష్టించారు. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ మూడు వన్డేల సిరీస్‌ను హర్మన్‌ప్రీత్‌ సేన.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది.

Published : 23 Sep 2022 02:58 IST

కాంటర్‌బరీ: 1999 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచి భారత మహిళలు చరిత్ర సృష్టించారు. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ మూడు వన్డేల సిరీస్‌ను హర్మన్‌ప్రీత్‌ సేన.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఇప్పుడిక వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నామని హర్మన్‌ చెప్పింది. ఇంగ్లాండ్‌తో శనివారం లార్డ్స్‌లో మూడో వన్డేతో రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు జులన్‌ ముగింపు పలుకుతుంది. ‘‘జులన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించనున్న లార్డ్స్‌ వన్డే మాకెంతో ప్రత్యేకమైంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ మ్యాచ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాం. ఇప్పటికే సిరీస్‌ గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇక జులన్‌కు చివరిదైన మూడో వన్డేలో విజయం మాకు ముఖ్యం. అది మాకందరికీ చాలా భావోద్వేగపూరితమైన క్షణంగా మారనుంది. మేం కచ్చితంగా ఆ మ్యాచ్‌ నెగ్గాలి. దీంతో పాటు మైదానంలో సరదాగా గడపాలి. నేను అరంగేట్రం చేసినప్పుడు జులన్‌ కెప్టెన్‌. నాతో పాటు యువ బౌలర్లు రేణుక, మేఘన సహా అందరూ ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఆమె బౌలింగ్‌ తీరు, లయను నిశితంగా పరిశీలించారు. మా అందరికీ ఆమె గొప్ప స్ఫూర్తి’’ అని హర్మన్‌ తెలిపింది. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా సిరీస్‌ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కేవలం 111 బంతుల్లోనే అజేయంగా 143 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ఆఖరి ఓవర్లలో ఆమె అసాధారణంగా చెలరేగడంతో భారత్‌ మొదట 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లిష్‌ జట్టు 44.5 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. పేసర్‌ రేణుక సింగ్‌ (4/57) ప్రత్యర్థిని దెబ్బతీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని