మేల్కొంటారా?

ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలవాల్సింది. కానీ ఓడారు. ఆ తర్వాత లంక పైనా నెగ్గాల్సింది. కానీ వదిలేశారు. ఇప్పుడిక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 208 పరుగుల భారీ స్కోరు సాధించి విజయానికి గట్టి పునాది వేసుకున్నారు.

Updated : 23 Sep 2022 08:22 IST

ఓడితే సిరీస్‌ గల్లంతు

ఆసీస్‌తో భారత్‌ రెండో టీ20 నేడు

రాత్రి 7 నుంచి

ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలవాల్సింది. కానీ ఓడారు. ఆ తర్వాత లంక పైనా నెగ్గాల్సింది. కానీ వదిలేశారు. ఇప్పుడిక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 208 పరుగుల భారీ స్కోరు సాధించి విజయానికి గట్టి పునాది వేసుకున్నారు. అయినా ఓటమి తప్పలేదు. గెలిచే స్థితిలో ఉండి చేజేతులా మ్యాచ్‌లను ప్రత్యర్థులకు అప్పగించడం అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా.. శుక్రవారం కంగారూలతో రెండో టీ20కి సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ ముంగిట జట్టు ఆటతీరు ఆందోళన కలిగిస్తుండగా.. ఇంకో మ్యాచ్‌ ఓడితే సిరీస్‌ పోయే స్థితిలో రోహిత్‌ సేన ఎంతమేర పట్టుదల ప్రదర్శిస్తుందో చూడాలి.

నాగ్‌పుర్‌

మొహాలిలో భారత్‌కు తగిలింది మామూలు షాక్‌ కాదు. 209 పరుగుల లక్ష్యాన్ని నిలిపి.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి.. మ్యాచ్‌ను నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటికీ.. ఆఖరి ఓవర్లలో పేలవ బౌలింగ్‌ కారణంగా చేజేతులా ఓటమి కొని తెచ్చుకుంది టీమ్‌ఇండియా. ఆసియా కప్‌ సందర్భంగా బౌలింగ్‌ విషయంలో మొదలైన ఆందోళన తాజా మ్యాచ్‌తో మరింత పెరిగింది. పేలవ ఫీల్డింగ్‌ కూడా భారత్‌కు సమస్యగా మారింది. చేతిలో పడ్డ క్యాచ్‌లను అక్షర్‌ పటేల్, రాహుల్‌ వదిలేయడం అభిమానులకు పెద్ద షాక్‌. భారీ స్కోరు చేసినప్పటికీ.. బ్యాటింగ్‌లోనూ ఇబ్బందులు లేకేం కాదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆశలు నిలవాలంటే గెలిచి తీరాల్సిన రెండో టీ20లో భారత్‌.. లోపాలన్నీ దిద్దుకుని ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే.

బుమ్రా ఆడతాడా?: భారత్‌కు డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ పెద్ద తలనొప్పిగా మారింది. ఆసియా కప్‌లో రెండు కీలక మ్యాచ్‌ల్లో, ఆసీస్‌తో తొలి టీ20లో భారత్‌ కొంపముంచింది చివరి ఓవర్లలో పేలవ బౌలింగే. ఒకప్పుడు డెత్‌ ఓవర్ల నిపుణుడిగా పేరు తెచ్చుకున్న భువనేశ్వర్‌.. ఈ మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో అతడికి రెండో టీ20లో పక్కన పెడతారేమో చూడాలి. ప్రపంచకప్‌కు కూడా అతణ్ని దూరం పెట్టి షమి లేదా దీపక్‌ చాహర్‌ను ఎంచుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బుమ్రా ఫిట్‌నెస్‌ సాధిస్తే అతడి స్థానంలో పునరాగమనం చేస్తాడా.. లేక ఈ సిరీస్‌ కోసం తాత్కాలికంగా ఎంపికైన ఉమేశ్‌ స్థానంలో ఆడతాడా అన్నది ఆసక్తికరం. ఉమేశ్‌ తొలి టీ20లో 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. బుమ్రా అందుబాటులోకి రాకుంటే భువి, ఉమేశ్‌లే కొనసాగుతారు. మరో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ కూడా తొలి టీ20లో తీవ్రంగా నిరాశ పరిచాడు. అతను రెండో టీ20లో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్‌ చాహల్‌ కూడా ఇటీవల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అక్షర్‌ చక్కటి ప్రదర్శన చేయడం సానుకూలాంశం. బంతితో హార్దిక్‌ కూడా మెరుగు పడాల్సి ఉంది. ఆరంభంలో వికెట్లు తీయడంతో మధ్య, చివరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం అత్యవసరం. బ్యాటింగ్‌లో రోహిత్‌ ఫామ్‌ అందుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కోహ్లి ఆసియా కప్‌ ఊపును కొనసాగించలేకపోయాడు. దినేశ్‌ కార్తీక్‌ ‘ఫినిషర్‌’ పాత్రకు ఎప్పుడు న్యాయం చేస్తాడా అని భారత్‌ ఎదురు చూస్తోంది. రాహుల్, సూర్యకుమార్, హార్దిక్‌ ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరముంది. తొలి టీ20లో కొంత మేర అదృష్టం కూడా కలిసి రావడంతో విజయం సాధించిన ఆసీస్‌.. బౌలింగ్‌లో మెరుగు పడాలని కోరుకుంటోంది. ఫామ్‌లో ఉన్న గ్రీన్‌కు తోడు మరో ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా జోరందుకుంటే తమకు తిరుగుండదని ఆసీస్‌ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పుంది.

* భారత్‌-ఆసీస్‌ రెండో టీ20కి వేదికైన విదర్భ స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడ ఎక్కువగా మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. ఛేదన కష్టం. శుక్రవారం కూడా టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు. ఈ వేదికలో నాలుగు టీ20లు ఆడిన భారత్‌ రెండు నెగ్గి, రెండు ఓడింది. ఆసీస్‌ ఇక్కడ టీ20 మ్యాచ్‌ ఆడలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని