Updated : 23 Sep 2022 07:12 IST

ఎందుకీ గోప్యత?

హెచ్‌సీఏ తీరుపై సర్వత్రా విమర్శలు

ఈనాడు - హైదరాబాద్‌

ఉప్పల్‌ స్టేడియం.. దేశంలోనే ఉత్తమ క్రికెట్‌ మైదానాల్లో ఒకటి. ఇక్కడ మ్యాచ్‌లు జరిగినపుడల్లా స్టేడియంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తుంటాయి. ఇక హైదరాబాదీల క్రికెట్‌ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ధోని, కోహ్లి, రోహిత్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉప్పల్‌ స్టేడియం గురించి, ఇక్కడి అభిమానుల క్రికెట్‌ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే దేశంలోని మిగతా స్టేడియాలతో పోలిస్తే ఇక్కడ జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువ. కొన్నేళ్లుగా ఈ విషయంలో అన్యాయం జరుగుతున్నా మాట్లాడే నాథుడు లేడు.హెచ్‌సీఏను నడిపించాల్సిన వాళ్లు క్రికెట్‌ అభివృద్ధిని అటకెక్కించేసి.. అవినీతి వ్యవహారాల్లో, అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ.. కోర్టు కేసులతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటపుడు మ్యాచ్‌ల ఆతిథ్యం కోసం బీసీసీఐ దగ్గర డిమాండ్‌ చేసే పరిస్థితి ఎక్కడుంటుంది? లేక లేక బోర్డు దయతలచి హైదరాబాద్‌కు ఒక మ్యాచ్‌ కేటాయిస్తే.. దాని టికెట్ల అమ్మకాలపై జరిగిన రభసతో జాతీయ స్థాయిలో హెచ్‌సీఏ పరువు పోయింది. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లోపించడంతో అభిమానులు జింఖానా మైదానంలోకి వెళ్లి బైఠాయించే పరిస్థితి తలెత్తింది. అది సరిపోదని గురువారం తొక్కిసలాట వ్యవహారంతో హెచ్‌సీఏకు తలవంపులు తప్పలేదు. అసలు టికెట్ల అమ్మకాల వ్యవహారంలో హెచ్‌సీఏ ఎందుకింత గోప్యత పాటిస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల అమ్మకం విషయంలో హెచ్‌సీఏ మొదట్నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా.. కాంప్లిమెంటరీ పాసుల రూపంలో ఎన్ని కేటాయించారన్న దానిపై స్పష్టత లేదు. సాధారణంగా క్లబ్‌లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ సంస్థల సిబ్బంది, ఇతరులకు కలిపి మొత్తం 9 వేల దాకా పాసులు ఇస్తారు. మిగతా 30 వేల టికెట్లను సాధారణ అభిమానుల కోసం అమ్మాలి. అయితే హెచ్‌సీఏ పెద్దలు పాస్‌లు ఎన్ని ఇచ్చారో, ఎన్ని టికెట్లు అమ్మారో చెప్పట్లేదు. ముందేమో పేటీఎంలో టికెట్ల అమ్మకం పూర్తయినట్లు ప్రకటించారు. కానీ అందులో టికెట్లు దక్కించుకున్నదెవరో తెలియట్లేదు. ఈ నెల 15న రాత్రి 8 గంటలకు పేటీఎంలో అమ్మకాలు మొదలవగా.. కొన్ని నిమిషాల్లోనే ‘సోల్డ్‌ ఔట్‌’ సందేశం కనిపించింది. ఆన్‌లైన్లో ప్రయత్నించిన సాధారణ అభిమానులందరూ తమకు టికెట్‌ దొరకలేదనే అన్నారు. ఈ అసంతృప్తితోనే పెద్ద ఎత్తున జింఖానాకు వెళ్లి ముట్టడించారు. అప్పటిదాకా పేటీఎంలో టికెట్లన్నీ అమ్మేసినట్లు చెబుతూ వచ్చిన హెచ్‌సీఏ.. అభిమానుల ఆందోళనతో మాట మార్చింది. జింఖానాలో టికెట్లు అమ్మకం చేపట్టనున్నట్లు ప్రకటించింది. మరి గురువారం ఇక్కడ సుమారు 3000 టికెట్లు అమ్మినట్లు సమాచారం. మధ్యాహ్నానికి జింఖానాలో టికెట్లు అయిపోయాయన్నారు. వివాదం తీవ్రం కావడంతో హెచ్‌సీఏ మరికొన్ని టికెట్లను పేటీఎంలో అమ్మకానికి ఉంచింది. రాత్రి 7 నుంచి అరగంట పేటీఎంలో విక్రయించారు. తొలుత పేటీఎంలో పెట్టినప్పుడు నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు.. గురువారం అరగంటసేపు అమ్ముడవడం విశేషం. మ్యాచ్‌కు సంబంధించి పూర్తిగా టికెట్లు అమ్ముడైపోయినట్లు ఆ తర్వాత హెచ్‌సీఏ ప్రకటించింది. మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించిందన్నది స్పష్టం. ఏ దశలోనూ టికెట్ల అమ్మకాల వివరాలను హెచ్‌సీఏ వెల్లడించట్లేదు. గురువారం నాటి గొడవ తర్వాత హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ను ఈ విషయంపై మీడియా సంప్రదించే ప్రయత్నం చేయగా.. శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

స్టేడియం స్థలం లీజు రద్దు చేస్తాం: శ్రీనివాస్‌గౌడ్‌

జింఖానా మైదానంలో తొక్కిసలాటపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడల కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్, అజహరుద్దీన్‌తో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. టికెట్ల అమ్మకంలో హెచ్‌సీఏ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ‘‘టికెట్ల కోసం లక్షల మంది యువకులు, ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా వచ్చారు. అనుకోకుండా చిన్న సంఘటన జరిగింది. తెలంగాణ, హైదరాబాద్‌ బ్రాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాల్సింది. హెచ్‌సీఏ రాజకీయాలు ప్రభుత్వంపై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. హెచ్‌సీఏ పద్ధతి మార్చుకోకపోతే స్టేడియానికి ఇచ్చిన స్థలం లీజును రద్దు చేస్తాం. ప్రభుత్వమే స్టేడియాన్ని నిర్వహిస్తుంది. అసలు ఎన్ని టికెట్లు ఎవరికి అమ్మారో చెప్పాలి’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మరోవైపు జింఖానాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హెచ్‌సీఏతో పాటు అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌పై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులు, బేగంపేట ఎస్సై ప్రమోద్‌ల ఫిర్యాదు మేరకు 420, 21, 22/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రతికూల దృష్టితో చూడొద్దు: అజహర్‌

తొక్కిసలాట ఉదంతంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ స్పందిస్తూ.. ‘‘అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. మ్యాచ్‌ నిర్వహణను ప్రతికూల దృష్టితో చూడొద్దు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌లు నిర్వహిస్తాం. లోపాల్ని సవరించుకుంటాం. మ్యాచ్‌ నిర్వహణ చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. ఈరోజు నేనున్నా.. రేపు ఇంకొకరు ఉన్నా అందరి ఆలోచన ఒక్కటే. తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయడమే లక్ష్యం’’ అని అన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts