నాటి మెరుపులు మళ్లీ..

‘‘పాట వచ్చి పదేళ్లయింది. కానీ పవర్‌ తగ్గలా’’.. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకున్న డైలాగ్‌ ఇది. ఇప్పుడు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందుల్కర్‌ ‘రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌’లో ఆడుతున్న తీరు చూసి ఇదే తరహాలో.. ‘‘

Published : 24 Sep 2022 03:19 IST

‘‘పాట వచ్చి పదేళ్లయింది. కానీ పవర్‌ తగ్గలా’’.. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకున్న డైలాగ్‌ ఇది. ఇప్పుడు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందుల్కర్‌ ‘రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌’లో ఆడుతున్న తీరు చూసి ఇదే తరహాలో.. ‘‘రిటైరై తొమ్మిదేళ్లయింది. ఇంకా ఊపు తగ్గలా’’ అనుకుంటున్నారు అభిమానులు. సచిన్‌ ఇప్పుడు 50వ పడిలో ఉన్నాడు. అతను 2013లోనే అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. వయసు పెరిగింది. ఆట నుంచి చాలా విరామం వచ్చింది. అయినా సరే.. ఆ ప్రభావం కనిపించకుండా యువ క్రికెటర్‌ లాగా రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో చక్కటి టెక్నిక్‌, టైమింగ్‌తో మెరుపు షాట్లు ఆడుతూ .. వికెట్ల మధ్య చురుగ్గా పరుగెడుతూ అబ్బురపరుస్తున్నాడు. ముఖ్యంగా గురువారం ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ తరఫున ఓపెనర్‌గా సచిన్‌ బ్యాటింగ్‌ చూసిన అభిమానులంతా 90ల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాపై సచిన్‌ మెరుపులు అంత సులువుగా మరిచిపోదగ్గవి కాదు. కాస్ప్రోవిచ్‌ బౌలింగ్‌లో ముందుకు వచ్చి లాంగాఫ్‌లో కొట్టిన సిక్సర్లు అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవే. ఆ షాట్లను గుర్తు చేస్తూ.. అచ్చం అదే తరహాలో ట్రెమ్లెట్‌ బౌలింగ్‌లో క్రీజు నుంచి ముందుకు వచ్చి లాంగాఫ్‌లో సిక్సర్‌ బాదిన తీరు అభిమానులను ఉర్రూతలూగించింది. సామాజిక మాధ్యమాల్లో అప్పుడు-ఇప్పుడు అంటూ రెండు వీడియోలను పక్క పక్కన పెట్టి చూపిస్తూ సచిన్‌ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ షాట్‌ అనే కాదు.. ఈ సిరీస్‌ సందర్భంగా సచిన్‌ ఆడిన కవర్‌ డ్రైవ్‌లు, ప్యాడిల్‌ స్వీప్‌లు ఒకప్పటి ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ను గుర్తుకు తెస్తున్నవే. రిటైర్మెంట్‌ తర్వాత ఇంత విరామం వచ్చినా, ప్రాక్టీస్‌ లేకపోయినా, వయసు పెరిగినా.. ఇంకా సచిన్‌ ఇంత చురుగ్గా బ్యాటింగ్‌ చేస్తుండడం, మెరుపు షాట్లు ఆడుతుండటం అభిమానులనే కాక వ్యాఖ్యాతలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇంగ్లాండ్‌పై సచిన్‌ 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో ఆదివారం భారత్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. ఆ మ్యాచ్‌లో సచిన్‌ నుంచి మరిన్ని మెరుపులు ఆశిస్తున్నారు అభిమానులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని