Ind Vs Aus: ఆనందమానందమాయె

అసలే ఆదివారం.. అందులోనూ టీ20 మ్యాచ్‌.. పైగా ప్రత్యర్థి ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. అది కాస్తా సిరీస్‌ ఫలితాన్ని తేల్చే పోరు. ఉప్పల్‌ స్టేడియంలో ప్రత్యక్షంగా ఈ మ్యాచ్‌ చూడడానికి హైదరాబాదీ క్రికెట్‌ ప్రేమికులు ఎంతగా తపించారో.. టికెట్ల కోసం ఎంత కష్టపడ్డారో! వారి తపనకు, కష్టానికి సరైన ఫలితమే దక్కింది. కంగారూలతో టీమ్‌ఇండియా

Updated : 26 Sep 2022 10:09 IST

ఉప్పల్‌లో టీమ్‌ఇండియాదే పైచేయి

చెలరేగిన సూర్యకుమార్‌, కోహ్లి

రాణించిన అక్షర్‌ పటేల్‌

ఆసీస్‌పై 2-1తో సిరీస్‌ సొంతం

ఈనాడు - హైదరాబాద్‌

అసలే ఆదివారం.. అందులోనూ టీ20 మ్యాచ్‌.. పైగా ప్రత్యర్థి ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. అది కాస్తా సిరీస్‌ ఫలితాన్ని తేల్చే పోరు. ఉప్పల్‌ స్టేడియంలో ప్రత్యక్షంగా ఈ మ్యాచ్‌ చూడడానికి హైదరాబాదీ క్రికెట్‌ ప్రేమికులు ఎంతగా తపించారో.. టికెట్ల కోసం ఎంత కష్టపడ్డారో! వారి తపనకు, కష్టానికి సరైన ఫలితమే దక్కింది. కంగారూలతో టీమ్‌ఇండియా పోరు అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో మన జట్టుదే పైచేయి. సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. విరాట్‌ కోహ్లి ఉప్పల్‌ స్టేడియం తనకెంత ప్రత్యేకమో చాటుతూ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో 187 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లే కోల్పోయి ఛేదించిన టీమ్‌ఇండియా.. సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది.

హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులది మామూలు సంబరం కాదు. ఆదివారం వారు పతాక స్థాయి క్రికెట్‌ వినోదంలో మునిగి తేలారు. ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. సమయోచితంగా చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లి అభిమానులకు గొప్ప బ్యాటింగ్‌ విందును అందించారు. ఇరు జట్లూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల మోత మోగిపోయింది. సూర్యకుమార్‌, కోహ్లిల అద్భుత బ్యాటింగ్‌ను ఆస్వాదించడం, మ్యాచ్‌లో మన జట్టుదే పైచేయి కావడం, ప్రపంచ ఛాంపియన్‌పై సిరీస్‌ కూడా సొంతం కావడంతో ఈ మ్యాచ్‌ హైదరాబాదీ అభిమానులకు చిరస్మరణీయం.

టీమ్‌ఇండియా అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే విజయాన్ని అందుకుంది. బలమైన ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ (52; 21 బంతుల్లో 7×4, 3×6), టిమ్‌ డేవిడ్‌ (54; 27 బంతుల్లో 2×4, 4×6) మెరుపు అర్ధశతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో అక్షర్‌ (3/33), చాహల్‌ (1/22) సత్తాచాటారు. ఛేదనలో రోహిత్‌ సేన 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (69; 36 బంతుల్లో 5×4, 5×6), కోహ్లి (63; 48 బంతుల్లో 3×4, 4×6) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ఆసీస్‌ బౌలర్లలో సామ్స్‌ (2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో 8 వికెట్లు తీసిన అక్షర్‌ ‘మ్యాచ్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెలుచుకున్నాడు.

ఆ ఇద్దరూ.. అదుర్స్‌: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు పూర్తి విరుద్ధంగా టీమ్‌ఇండియా ఛేదన మొదలైంది. నాలుగు ఓవర్లలోపే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (1), రోహిత్‌ శర్మ (17) వికెట్లు కోల్పోయిన జట్టు 34/2తో కష్టాల్లో పడింది. తొలి అయిదు ఓవర్లను అయిదుగురు బౌలర్లతో వేయించిన కెప్టెన్‌ ఫించ్‌ ఫలితం రాబట్టాడు. ఆ దశలో కోహ్లి, సూర్యకుమార్‌ కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించారు. మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయపథంలో నడిపించారు. ఉప్పల్‌ అంటే చాలు రెచ్చిపోయే కోహ్లి ఓ వైపు నిలబడగా.. సూర్యకుమార్‌ కళాత్మక విధ్వంసంతో రెచ్చిపోయాడు. హేజిల్‌వుడ్‌ (1/40) స్లో డెలివరీని డీప్‌ మిడ్‌వికెట్‌లో, స్పిన్నర్‌ జంపా (0/44) బంతిని లాంగాన్‌ మీదుగా కోహ్లి కొట్టిన సిక్సర్లు చూడాల్సిందే. కచ్చితమైన టైమింగ్‌తో చేతుల్లోని బలాన్ని ఉపయోగించి అమాంతం బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. మరోవైపు అంతకుమించి అన్నట్లు సూర్య ప్రతాపం చూపించాడు. అతను కొట్టిన సిక్సర్లన్నీ వావ్‌ అనిపించాయి. సిక్సర్‌తోనే అతను అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరి దూకుడుతో 13 ఓవర్లకు 122/2తో జట్టు లక్ష్యం దిశగా సాగింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్య నిష్క్రమించాడు. అక్కడినుంచి బాదే బాధ్యతను తీసుకున్న కోహ్లి అర్ధసెంచరీ అందుకున్నాడు. జట్టు విజయానికి 30 బంతుల్లో 44 పరుగులు అవసరమైన దశలో.. 16, 17 ఓవర్లు కలిపి 12 పరుగులే రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. 18వ ఓవర్‌ తొలి బంతికే హార్దిక్‌ (25 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టినప్పటికీ.. మిగిలిన అయిదు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఆరు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికే సిక్సర్‌ బాదిన విరాట్‌ సమీకరణాన్ని తేలిక చేశాడు. కానీ తర్వాతి బంతికే ఔటైపోయాడు. తర్వాతి రెండు బంతుల్లో ఒక్క పరుగే వచ్చింది. చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. అయిదో బంతిని ఎడ్జ్‌తో బౌండరీకి పంపించిన హార్దిక్‌ అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు.

ఈ మ్యాచ్‌ కోసం పంత్‌ స్థానంలో భువనేశ్వర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.  66/2.. ఓపెనర్‌ గ్రీన్‌ విధ్వంసంతో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా సాధించిన స్కోరిది. జెట్‌ వేగంతో మొదలైన ఆ జట్టు ఇన్నింగ్స్‌ చూస్తే 200 స్కోరు చేసేలా కనిపించింది. కానీ మధ్య ఓవర్లలో భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ముఖ్యంగా చాహల్‌, హార్దిక్‌ ప్రత్యర్థిని మెరుగ్గా కట్టడి చేశారు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే ధ్యేయంతో గ్రీన్‌ తొలి ఓవర్‌ నుంచే బాదుడు షురూ చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతని దెబ్బకు భువీ, బుమ్రా, అక్షర్‌ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. క్రీజులో ఆత్మవిశ్వాసంతో కదులుతూ.. అలవోకగా సిక్సర్లు రాబట్టాడు. బుమ్రా తొలి (ఇన్నింగ్స్‌ 3వ) ఓవర్లో చివరి రెండు బంతులకు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. ఫించ్‌ (7)ను అక్షర్‌ ఔట్‌ చేసినా.. గ్రీన్‌ మాత్రం ఆగలేదు. ఆ ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. కానీ ఆ వెంటనే భువీ అతనికి చెక్‌ పెట్టి జట్టుకు ఉపశమనాన్ని అందించాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ రనౌటయ్యాడు. స్మిత్‌ను చాహల్‌ బుట్టలో వేసుకున్నాడు. 7 నుంచి 10 మధ్యలో నాలుగు ఓవర్లలో 20 పరుగులే ఇచ్చిన భారత్‌ మరో రెండు వికెట్లు పడ  గొట్టింది. అక్షర్‌ ఒకే ఓవర్లో ఇంగ్లిస్‌ (24)తో పాటు సూపర్‌ ఫామ్‌లో ఉన్న వేడ్‌ (1)ను పెవిలియన్‌ చేర్చాడు. తన బౌలింగ్‌లోనే చురుకైన క్యాచ్‌తో వేడ్‌ను వెనక్కి పంపాడు. 117/6 ఆసీస్‌ ఇబ్బందుల్లో పడింది. అయితే చివరి ఓవర్లలో సామ్స్‌ (28 నాటౌట్‌) అండతో డేవిడ్‌ చెలరేగిపోయాడు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 68 పరుగులు జోడించి ఆసీస్‌కు భారీ స్కోరునందించింది.

మ్యాచ్‌ ఓవర్‌ టు ఓవర్‌ అప్‌డేట్స్‌


ఉప్పల్‌ కింగ్‌ కోహ్లి

ఆసియా కప్‌లో శతకంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన కోహ్లి.. చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20ల్లో అతను వరుసగా 2, 11 పరుగులు చేశాడు. దీంతో మళ్లీ కాస్త ఆందోళన. కానీ తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌ మైదానంలో కోహ్లి మళ్లీ చెలరేగాడు. ఆదివారం ముందు వరకూ ఈ మైదానంలో 8 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన అతను 75.87 సగటుతో 607 పరుగులు చేశాడు. అందులో 2019, డిసెంబర్‌6న వెస్టిండీస్‌తో టీ20లో ఛేదనలో అజేయంగా 94 పరుగులతో జట్టును గెలిపించాడు. ఇప్పుడీ మ్యాచ్‌లో సూర్యకుమార్‌తో అద్భుత భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. పూర్తి నియంత్రణ, కచ్చితత్వంతో కూడిన షాట్లతో సిక్సర్లు రాబట్టి ఈ స్టేడియంలో టీ20ల్లో రెండో అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. తన బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు.


21  ఈ ఏడాది టీమ్‌ఇండియా సాధించిన టీ20 విజయాలు. ఓ క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్‌ (2021లో 20)ను వెనక్కినెట్టింది.


సందడే సందడి

దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరగడంతో అభిమానులు మైదానాన్ని హోరెత్తించారు. తమ అభిమాన ఆటగాళ్లను చూస్తూ సందడి చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్నప్పటి నుంచి మొదలు.. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు కేరింతలు కొట్టారు. ప్రాణాలకు తెగించి మరీ టికెట్లు దక్కించుకున్న అభిమానులు మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించారు. 39 వేల సామర్థ్యం గల స్టేడియం దాదాపు పూర్తిగా నిండిపోయింది, మ్యాచ్‌ ఆరంభ సమయానికి స్టేడియంలో 33459 మంది ప్రేక్షకులున్నారు. టికెట్ల విక్రయంలో చేతులెత్తేసిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మ్యాచ్‌ను మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించింది.ఆ రనౌట్‌..

చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్‌ రనౌట్‌ విషయంలో కాస్త సందిగ్ధత నెలకొంది. మ్యాక్సీ ఆ బంతిని షార్ట్‌ఫైన్‌ లెగ్‌కు మళ్లించి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. వేగంగా బంతి అందుకున్న అక్షర్‌ మెరుపు త్రోతొ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. కానీ అంతకంటే ముందు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ చేతులు తగిలి ఓ బెయిల్‌ కింద పడింది. ఆ తర్వాత బంతి వికెట్లను తాకడంతో మరో బెయిల్‌ కిందపడింది. మొదట రిప్లేలో చూస్తే ముందే దినేశ్‌ చేతులు స్టంప్స్‌కు తగిలాయి కాబట్టి నాటౌట్‌గా ప్రకటిస్తారని అనుకున్నారు. మ్యాక్స్‌వెల్‌ కూడా అదే దీమాతో క్రీజులో ఉన్నాడు. కానీ బంతి మరో బెయిల్‌ను పడగొట్టే సమయానికి కూడా మ్యాక్సీ క్రీజులోకి రాకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ పదేపదే పరీక్షించి చూసి ఔట్‌గా నిర్ణయించాడు.


2  ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన టీ20ల్లో శతక భాగస్వామ్యంలో భాగం కావడం కోహ్లీకిది రెండోసారి. 2019లో వెస్టిండీస్‌తో టీ20లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి అతను రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ఈ స్టేడియంలో కోహ్లీకిది రెండో అర్ధశతకం. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతను అజేయంగా 94 పరుగులు చేశాడు.


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: గ్రీన్‌ (సి) రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 52; ఫించ్‌ (సి) హార్దిక్‌ (బి) అక్షర్‌ 7; స్మిత్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) చాహల్‌ 9; మ్యాక్స్‌వెల్‌ రనౌట్‌ 6; ఇంగ్లిస్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 24; టిమ్‌ డేవిడ్‌ (సి) రోహిత్‌ (బి) హర్షల్‌ 54; వేడ్‌ (సి) అండ్‌ (బి) అక్షర్‌ 1; సామ్స్‌ నాటౌట్‌ 28; కమిన్స్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186; వికెట్ల పతనం: 1-44, 2-62, 3-75, 4-84, 5-115, 6-117, 7-185; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-39-1; అక్షర్‌ 4-0-33-3; బుమ్రా 4-0-50-0; హార్దిక్‌ 3-0-23-0; చాహల్‌ 4-0-22-1; హర్షల్‌ 2-0-18-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) వేడ్‌ (బి) సామ్స్‌ 1; రోహిత్‌ (సి) సామ్స్‌ (బి) కమిన్స్‌ 17; కోహ్లి (సి) ఫించ్‌ (బి) సామ్స్‌ 63; సూర్యకుమార్‌ (సి) ఫించ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 69; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 25; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187; వికెట్ల పతనం: 1-5, 2-30, 3-134, 4-182; బౌలింగ్‌: సామ్స్‌ 3.5-0-33-2; హేజిల్‌వుడ్‌ 4-0-40-1; ఆడమ్‌ జంపా 4-0-44-0; కమిన్స్‌ 4-0-40-1; గ్రీన్‌ 3-0-14-0; మ్యాక్స్‌వెల్‌ 1-0-11-0


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts