ఆటలో ఓనమాలు మర్చిపోతారు

ఓ అథ్లెట్‌ ఆట నుంచి మూణ్నాలుగేళ్ల పాటు దూరంగా ఉంటే ప్రాథమిక విషయాలు, ఓనమాలు మర్చిపోతారని షూటర్‌ విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఈ పిస్టల్‌ షూటర్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో తన ఉద్యోగంపై దృష్టి సారించేందుకు ఆటకు సుదీర్ఘ విరామం తీసుకున్నాడు.

Published : 27 Sep 2022 02:09 IST

దిల్లీ: ఓ అథ్లెట్‌ ఆట నుంచి మూణ్నాలుగేళ్ల పాటు దూరంగా ఉంటే ప్రాథమిక విషయాలు, ఓనమాలు మర్చిపోతారని షూటర్‌ విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఈ పిస్టల్‌ షూటర్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో తన ఉద్యోగంపై దృష్టి సారించేందుకు ఆటకు సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న అతను తిరిగి గతేడాది తుపాకీ పట్టాడు. గురువారం గుజరాత్‌లో అధికారికంగా ఆరంభమయ్యే జాతీయ క్రీడల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. ‘‘ఉద్యోగ భద్రత కోసం ఆటకు దూరంగా ఉండడం పెద్ద ఇబ్బందేమీ కాదు. మళ్లీ మొదటి నుంచి ఆట ఆరంభించడం కూడా అలాంటిదే. మూణ్నాలుగేళ్ల పాటు సాధన చేయకుండా, పోటీల్లో పాల్గొనకుండా విరామం తీసుకుంటే ప్రాథమిక అంశాలు మర్చిపోతారు. మళ్లీ అత్యున్నత స్థాయికి తిరిగొచ్చాక అది తెలుస్తుంది. 2015 జాతీయ క్రీడల్లో దేశంలోని అత్యుత్తమ షూటర్లను ఓడించి అయిదు స్వర్ణాలు గెలవడం ప్రత్యేకమైంది. ఈ సారి మరింత మెరుగ్గా రాణించి ఒలింపిక్స్‌ స్థాయి ప్రదర్శన చేయాలనుకుంటున్నా. ఆ ఒక్క లక్ష్యమే నాకు ప్రేరణనిస్తోంది. తిరిగి షూటింగ్‌ మొదలెట్టిన ఏడాది లోపే నాలుగో సారి జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ (అక్టోబర్‌ 12 నుంచి) ముందు ఈ క్రీడల్లో ఉత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తా. ప్రతి విభాగంలోనూ దేశంలోని అత్యుత్తమ 16 మంది షూటర్లు తలపడుతుండడంతో పోటీ తీవ్రంగానే ఉంటుంది. గత మూడు పర్యాయాలు సర్వీస్‌ తరపున ఆడా. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నా’’ అని అతను పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని