శుభ్‌మన్‌ ఖాతాలో తొలి కౌంటీ శతకం (సంక్షిప్త వార్తలు)

భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (119; 139 బంతుల్లో 16×4, 2×6) సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌ దేశవాళీ జట్టు గ్లామర్‌గాన్‌కు ఆడుతున్న ఈ ఓపెనర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ససెక్స్‌పై సెంచరీ సాధించాడు. కౌంటీల్లో శుభ్‌మన్‌కు ఇదే తొలి శతకం.

Updated : 28 Sep 2022 04:35 IST

హోవ్‌: భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (119; 139 బంతుల్లో 16×4, 2×6) సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌ దేశవాళీ జట్టు గ్లామర్‌గాన్‌కు ఆడుతున్న ఈ ఓపెనర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ససెక్స్‌పై సెంచరీ సాధించాడు. కౌంటీల్లో శుభ్‌మన్‌కు ఇదే తొలి శతకం. మూడు గంటలకు పైగా క్రీజులో నిలిచిన గిల్‌.. గ్లామర్‌గాన్‌ జట్టు భారీ స్కోరు (533/9 డిక్లేర్డ్‌) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతడితో పాటు క్రిస్‌ కుక్‌ (141) సెంచరీ చేశాడు. ఇటీవల జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో తొలి అంతర్జాతీయ శతకాన్ని అందుకున్న శుభ్‌మన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇదే నెలలో కౌంటీ క్రికెట్లో వోర్సెస్టర్‌షైర్‌పై ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.


టాప్‌-15లోకి ప్రణయ్‌  

దిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తిరిగి టాప్‌-15లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ 15వ ర్యాంకులో నిలిచాడు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు జపాన్‌ ఓపెన్లో క్వార్టర్‌ఫైనల్‌ చేరిన ప్రణయ్‌.. ర్యాంకింగ్‌ గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు యువ కెరటం లక్ష్యసేన్‌ తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ 11వ ర్యాంకులో ఉన్నాడు. మహిళల విభాగంలో అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి.సింధు ఆరో స్థానంలో ఉండగా.. సైనా నెహ్వాల్‌ ఒక ర్యాంకు మెరుగై 31వ స్థానంలో నిలిచింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో స్వర్ణంతో   మెరిసిన స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌శెట్టి ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎంఆర్‌ అర్జున్‌-ధ్రువ్‌ కపిల మూడు స్థానాలు మెరుగై 23వ ర్యాంకులో నిలవగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి కూడా 23వ ర్యాంకులోనే ఉన్నారు.


వియత్నాం చేతిలో భారత్‌ ఓటమి

హొ చి మిన్‌ సిటీ: హంగ్‌ తిన్‌ స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ టోర్నీలో మంగళవారం జరిగిన రెండో పోరులో భారత్‌ 0-3తో వియత్నాం చేతిలో ఓడింది. ఆరంభం నుంచి ఎదురు దాడి చేసిన వియత్నాం త్వరగా ఫలితం సాధించింది. పదో నిమిషంలో వాన్‌డక్‌ గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత కూడా మన జట్టు పుంజుకోలేదు. వాన్‌ టోన్‌ (49వ ని) చేసిన గోల్‌తో వియత్నాం ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. ద్వితీయార్థంలో గుయెన్‌ (70వ ని) గోల్‌తో ఆ జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని అందుకుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts