నీమన్‌ చాలాసార్లు మోసం చేశాడు

అమెరికా టీనేజీ గ్రాండ్‌మాస్టర్‌ నీమన్‌ బహిరంగంగా ఒప్పుకున్న దానికంటే ఆటలో ఎక్కువ మోసాలే చేశాడని ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆరోపించాడు. అలాంటి ఆటగాడితో ఆడనని స్పష్టం చేశాడు. ఇటీవల జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో

Published : 28 Sep 2022 02:59 IST

మెరికా టీనేజీ గ్రాండ్‌మాస్టర్‌ నీమన్‌ బహిరంగంగా ఒప్పుకున్న దానికంటే ఆటలో ఎక్కువ మోసాలే చేశాడని ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆరోపించాడు. అలాంటి ఆటగాడితో ఆడనని స్పష్టం చేశాడు. ఇటీవల జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో ఒక్క ఎత్తు వేయగానే నీమన్‌తో గేమ్‌ నుంచి కార్ల్‌సన్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ తాజాగా ట్విటర్‌లో లేఖ పోస్టు చేశాడు. ‘‘2022 సింక్‌ఫీల్డ్‌ కప్‌ మూడో రౌండ్లో నీమన్‌తో గేమ్‌ తర్వాత టోర్నీ నుంచి తప్పుకోవాలని మునుపెన్నడూ లేని నిర్ణయం తీసుకున్నా. ఓ వారం తర్వాత ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా మరో టోర్నీలో ఒక్క ఎత్తు వేసిన వెంటనే అతనితో గేమ్‌ నుంచి నిష్క్రమించా. నేను ఉత్తమ టోర్నీల్లో అత్యున్నత స్థాయిలో చెస్‌ కొనసాగించాలనుకుంటున్నా. మోసమనేది ఆటకే ప్రమాదం. నిర్వాహకులు, ఆట పవిత్రత కోసం తపించేవాళ్లు బోర్డుపై ఆడే చెస్‌కు సంబంధించి భద్రతా ప్రమాణాలను, విభిన్న రకాల మోసాలను గుర్తించే విధానాలను మెరుగుపర్చాలి. నీమన్‌ బహిరంగంగా ఒప్పుకున్న దాని కంటే కూడా ఎక్కువగా మోసాలు చేశాడని నమ్ముతున్నా. బోర్డు గేమ్‌ల్లో అతని ప్రగతి అనుమానాలు కలిగిస్తోంది. సింక్‌ఫీల్డ్‌లో గేమ్‌లో అతనిలో ఆందోళన, ఆటపై ఏకాగ్రత కనిపించలేదు. ఇప్పటికే నా చర్యల ద్వారా నీమన్‌తో చెస్‌ ఆడనని స్పష్టం చేశా’’ అని కార్ల్‌సన్‌ పేర్కొన్నాడు.


ఇదీ వివాదం..

19 ఏళ్ల నీమన్‌పై కార్ల్‌సన్‌ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ప్రపంచ చెస్‌లో ఇదో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఈ గొడవ గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఈ నెల 1 నుంచి 13 వరకు జరిగిన సింక్‌ఫీల్డ్‌ కప్‌లో మొదలైంది. ప్రత్యక్షంగా బోర్డుపై జరిగిన ఈ టోర్నీలో మూడో గేమ్‌లో ఎలాంటి అంచనాలు లేని నీమన్‌ ఏకంగా కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. అదీ నల్లని పావులతో ఆడి.. క్లాసికల్‌ చెస్‌లో కార్ల్‌సన్‌ 53 వరుస విజయాలకు చెక్‌ పెట్టాడు. నీమన్‌ మోసం చేసి గెలిచాడని భావించిన కార్ల్‌సన్‌ వెంటనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ‘‘నేనేదైనా మాట్లాడితే పెద్ద ఇబ్బందుల్లో పడతా’’ అనే ప్రకటన మాత్రం చేశాడు. మరోవైపు ఈ గేమ్‌ చెస్‌ చరిత్రలోనే భారీ మోసం అని విశ్లేషకులు అంటున్నారు. 2021 జనవరి తర్వాత నీమన్‌ అసాధారణ రీతిలో 500 రేటింగ్‌ పాయింట్లు సంపాదించాడు. కార్ల్‌సన్‌ను ఓడించడంతో అతడిపై అనుమానాలు పెరిగాయి. అంతేకాకుండా గతంలో 12, 16 ఏళ్ల వయసున్నప్పుడు ఆన్‌లైన్‌ టోర్నీల్లో మోసం చేశానని అతనే స్వయంగా ప్రకటించాడు. దీంతో అతను ప్రత్యక్షంగా బోర్డుపై కార్ల్‌సన్‌తో ఆడిన గేమ్‌లోనూ మోసం చేశాడేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గేమ్‌లో అతను వేసిన ఎత్తులు కూడా అసాధారణంగా కనిపించాయి. దీంతో అతను వైబ్రేట్‌ అయ్యే సాంకేతిక పరికరాన్ని శరీరం లోపల పెట్టుకుని బయటి వ్యక్తి నుంచి సాయం తీసుకున్నాడని లేదా సన్నని లేజర్‌ కాంతి వాడాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో నీమన్‌తో గేమ్‌తో ఒక ఎత్తు వేయగానే పోటీ నుంచి కార్ల్‌సన్‌  తప్పుకున్నాడు. నీమన్‌ మాత్రం తన నిజాయతీ చాటుకోవడానికి అవసరమైతే నగ్నంగానూ, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ప్రసారాలకు చోటు లేని ప్రదేశంలో ఆడమన్నా ఆడతానని అన్నాడు. కార్ల్‌సన్‌ తన కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తున్నాడని విమర్శించాడు.


ఆన్‌లైన్‌లో ఇలా..

రోనా తర్వాత ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీల సంఖ్య బాగా పెరిగింది.  మరోవైపు ఆటలో ఆధునాతన సాంకేతిక వినియోగం కూడా రోజురోజుకూ అధికమవుతోంది. దీంతో డిజిటల్‌ చెస్‌ ఇంజిన్లు, డేటా క్లౌడ్లు, వ్యక్తిగత సర్వర్లు, అత్యాధునిక సూక్ష్మ వైర్‌లెస్‌ పరికరాలు వాడి టోర్నీ పర్యవేక్షకులను బోల్తా కొట్టించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోగలిగే చెస్‌ యాప్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. గేమ్‌ కొనసాగుతుండగానే తర్వాతి ఉత్తమ ఎత్తులు ఏమిటో అవి తెరపై సూచిస్తుంటాయి. ఓ వైపు ఇద్దరు ఆటగాళ్ల మధ్య గేమ్‌ జరుగుతుండగానే.. మరోవైపు ఈ యాప్‌ల్లో, కొన్ని చెస్‌ వెబ్‌సైట్లలో ఆ గేమ్‌కు సంబంధించి తర్వాతి ఉత్తమ ఎత్తు ఏదో అనే సూచన కనిపిస్తుంది. దీన్ని అనుసరిస్తూ  ఆటగాళ్లు మోసం చేసే ఆస్కారముంది. ఇలాంటి చాలా మంది ఆటగాళ్లు ప్రత్యేకంగా చెస్‌ ఇంజిన్‌ను వాడి గేమ్‌లో ఎత్తులు వేస్తుంటారు. అయితే దీన్ని అరికట్టేందుకు సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంది. కానీ ఒకే కంప్యూటర్‌లో గేమ్‌ ఆడుతూ, చెస్‌ ఇంజిన్‌ను అనుసరిస్తే పట్టేయొచ్చు. కానీ ఒక కంప్యూటర్‌లో గేమ్‌ ఆడుతూ, మరో కంప్యూటర్‌లో చెస్‌ ఇంజిన్‌ సాయం తీసుకుంటే మాత్రం పసిగట్టడం అసాధ్యం.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts