సఫారీలతో సై

ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం ఉత్సాహాన్నిస్తుంటే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైపోయింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల పోరుకు నేడే ఆరంభం. జోరు కొనసాగిస్తూ మరో సిరీస్‌ చేజిక్కించుకోవాలనుకుంటోంది రోహిత్‌సేన.

Updated : 28 Sep 2022 06:59 IST

దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టీ20 నేడు
రాత్రి 7 గంటల నుంచి

ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం ఉత్సాహాన్నిస్తుంటే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైపోయింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల పోరుకు నేడే ఆరంభం. జోరు కొనసాగిస్తూ మరో సిరీస్‌ చేజిక్కించుకోవాలనుకుంటోంది రోహిత్‌సేన. ఆందోళన కలిగిస్తోన్న ఆఖరి ఓవర్ల బౌలింగ్‌ను మెరుగుపర్చుకుని ప్రపంచకప్‌ సన్నాహాన్ని సంతృప్తిగా ముగించాలన్నది జట్టు లక్ష్యం.

తిరువనంతపురం

రో పొట్టి సిరీస్‌ వచ్చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే మొదటి టీ20లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. తమ కీలక బౌలర్లు హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌ లేకుండానే టీమ్‌ఇండియా సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్‌ నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చారు. కరోనా నుంచి ఇంకా కోలుకోని ఫాస్ట్‌ బౌలర్‌ షమి ఈ సిరీస్‌కూ దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు.

ఆఖరి ఓవర్లపై దృష్టి: ఇటీవల కాలంలో డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ టీమ్‌ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. ఈ సిరీస్‌తోనైనా ఆ సమస్యను అధిగమించాలని జట్టు భావిస్తోంది. భువనేశ్వరే కాదు.. బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు కూడా ఆఖర్లో ధారాళంగా పరుగులిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన హర్షల్‌.. దక్షిణాఫ్రికాపై విజయవంతమవుతాడని జట్టు భావిస్తోంది. అతడి కెరీర్‌ ఎకానమీ 9.05 కాగా.. ఆసీస్‌తో సిరీస్‌లో ఓవర్‌కు 12కు పైగా ఇచ్చాడు. ఇప్పుడెలా ఆడతాడో చూడాలి. ఇప్పటివరకు సరైన అవకాశాలు దక్కని ఆటగాళ్లకు తగినంత గేమ్‌ టైమ్‌ ఇవ్వాలని కూడా భారత జట్టు మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. ప్రపంచకప్‌నకు స్టాండ్‌బై కూడా అయిన దీపక్‌ చాహర్‌కు గత సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఈ మూడు మ్యాచ్‌ల్లో పేసర్లను రొటేట్‌ చేయాలని జట్టు భావిస్తే.. అతడికి సిరీస్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. అర్ష్‌దీప్‌ పునరాగమనం స్లాగ్‌ ఓవర్లలో జట్టు బౌలింగ్‌ను బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన బుమ్రా పూర్తి లయను అందుకోవడంపై దృష్టిపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్‌తో స్పిన్నర్‌ చాహల్‌ ఫామ్‌ను అందుకోవడం భారత్‌కు సానుకూలాంశం. అశ్విన్‌కు కూడా సిరీస్‌లో ఆడే అవకాశం దక్కొచ్చు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌ రాహుల్‌ నిలకడ సాధించాల్సిన అవసరముంది. ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అతడు.. తర్వాతి రెండ[ు మ్యాచ్‌ల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటాడనడంలో సందేహం లేదు. రోహిత్‌, కోహ్లి మెరుగ్గా కనిపిస్తున్న నేపథ్యంలో.. భారత జట్టు ప్రపంచకప్‌ కోసం బయల్దేరడానికి ముందు రాహుల్‌ కూడా పూర్తి స్థాయి ఫామ్‌ను అందుకోవడం ముఖ్యం. ఫినిషర్‌ దినేశ్‌ కార్తీక్‌ క్రీజులో మరింత సమయం గడపాల్సిన అవసరం ఉంది. కార్తీక్‌తో పాటు పంత్‌ కూడా తుది జట్టులో ఉండొచ్చు.

దక్షిణాఫ్రికా బలంగా..: బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉంది. హిట్టర్లకు కొదువ లేదు. సొంతగడ్డపై పొట్టి సిరీస్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై భారత్‌ పైచేయి సాధించలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు గ్రూప్‌ దశలో పోటీపడనున్నాయి. అక్కడికి, ఇక్కడికి పరిస్థితుల్లో తేడా ఉన్నప్పటికీ.. ప్రత్యర్థిపై అవగాహన పెంచుకునేందుకు ఈ సిరీస్‌ను రెండు జట్లు ఉపయోగించుకోనున్నాయి. ‘‘ఇక్కడి పిచ్‌లు, ఆస్ట్రేలియాలో పిచ్‌లు పూర్తి భిన్నమైనవి. అయితే ఇక్కడ భారత బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడం గొప్ప అవకాశం. ఈ సిరీస్‌లో కొన్ని విషయాలు తెలుసుకుని, వాటిని ప్రపంచకప్‌లో వారిపై ఉపయోగిస్తాం’’ అని దక్షిణాఫ్రికా బౌలర్‌ శాంసి అన్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్లో విశేషంగా రాణించి ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించిన యువ ఆటగాడు స్టబ్స్‌ అందరినీ ఆకర్షిస్తున్నాడు.


పిచ్‌..

గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియం ఇప్పటివరకు రెండు టీ20లకే ఆతిథ్యమిచ్చింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ జరిగిన ఓ టీ20లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 170కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం జల్లులు పడే అవకాశముంది.


11
దక్షిణాఫ్రికాతో ఆడిన 19 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచిన మ్యాచ్‌లు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని