సంక్షిప్త వార్తలు (7)

ఇంగ్లాండ్‌తో ఏడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌ 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బుధవారం అయిదో టీ20లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్క్‌ వుడ్‌ (3/20), డేవిడ్‌ విల్లీ (2/23) ధాటికి బ్యాటింగ్‌లో తడబడిన పాక్‌ తొలుత 19

Updated : 29 Sep 2022 04:17 IST

పాకిస్థాన్‌కు ఆధిక్యం

కరాచి: ఇంగ్లాండ్‌తో ఏడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌ 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బుధవారం అయిదో టీ20లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్క్‌ వుడ్‌ (3/20), డేవిడ్‌ విల్లీ (2/23) ధాటికి బ్యాటింగ్‌లో తడబడిన పాక్‌ తొలుత 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ (63) ఆ జట్టును ఆదుకున్నాడు. ఛేదనలో ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 139 పరుగులే చేసింది. మొయీన్‌ అలీ (51 నాటౌట్‌) ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. పాకిస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. హారిస్‌ రవూఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ (1/16) ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచాడు.


సాయి ప్రణీత్‌ ఔట్‌

హో చి మిన్‌: వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సాయి ప్రణీత్‌కు షాక్‌ తగిలింది. బుధవారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో అతను 21-17, 18-21, 13-21 తేడాతో సహచర ఆటగాడు రిత్విక్‌ సతీష్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఏడాది కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న ప్రణీత్‌ అనూహ్య ఓటమి చవిచూశాడు. మిగతా మ్యాచ్‌ల్లో లువాంగ్‌ మైస్నం 21-16, 18-21, 21-14తో జింగ్‌ (మలేసియా)పై, ముత్తుస్వామి 14-21, 22-20, 21-12తో టామీ (ఇండోనేషియా)పై, హర్షిత్‌ 21-15, 21-13తో మూడో సీడ్‌ నరోక (జపాన్‌)పై, కిరణ్‌ కుమార్‌ 16-21, 21-14, 21-19తో నెయింగ్‌ (మయన్మార్‌)పై గెలిచారు. మిథున్‌ 17-21, 7-21తో చి యూ జెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో రుత్విక శివాని ప్రిక్వార్టర్స్‌ చేరింది. ప్రత్యర్థి నుంచి ఆమెకు వాకోవర్‌ లభించింది. ప్రేరణ 21-16, 21-14తో ఎంగుయెన్‌ (వియత్నాం)పై, ఐరా శర్మ 21-13, 21-14తో ట్రాన్‌ (వియత్నాం)పై, రితుపర్ణ 21-12, 21-17తో ఫూయాంగ్‌ (వియత్నాం)పై నెగ్గారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి- రోహన్‌ జోడీ తొలి రౌండ్లో 14-21, 21-9, 21-12తో  లక్ష్మీ- హరిహరణ్‌పై గెలిచింది. నవనీత్‌- ప్రియ జంట కూడా ముందంజ వేసింది.


ఆటగాళ్లపైకి అరటి పండు

పారిస్‌: ట్యునీసియాతో స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ ఆటగాళ్లపైకి స్టాండ్స్‌లోని ప్రేక్షకులు అరటి పండు విసరడం చర్చనీయాంశంగా మారింది. పార్క్‌ దెస్‌ ప్రిన్సెస్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 5-1తో విజయం సాధించింది. అయితే రిచర్లిసన్‌ జట్టుకు రెండో గోల్‌ అందించిన వెంటనే మైదానంలోని ఓ మూలకు చేరిన బ్రెజిల్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే స్టాండ్స్‌లో నుంచి ఓ అరటి పండు వీళ్లపైకి దూసుకొచ్చింది. అంతే కాకుండా నీళ్ల సీసాలు, ఇతర వస్తువులు కూడా విసిరినట్లు కనిపించింది. ఈ ఘటనను బ్రెజిల్‌ సాకర్‌ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు తీవ్రమైన శిక్షలు విధించాలని ఆ సమాఖ్య అధ్యక్షుడు ఎడ్నాల్డో పేర్కొన్నాడు. మైదానంలోకి అరటి పండు విసిరిన వ్యక్తిని గుర్తించడంలో భద్రతా సిబ్బంది విఫలమైనట్లు సమాచారం. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతివివక్షకు వ్యతిరేకంగా బ్రెజిల్‌ ఆటగాళ్లు సంఘీభావం తెలిపారు. ‘‘మా నల్లజాతి ఆటగాళ్లు లేకపోయుంటే మా జెర్సీపైకి నక్షత్రాలు వచ్చేవే కావు’’ అని పేర్కొన్న సూచిక ముందు ఫొటోకు ఫోజిచ్చారు. బ్రెజిల్‌ గెలిచిన అయిదు ప్రపంచకప్‌లకు గుర్తుగా వాళ్ల జెర్సీపై అయిదు నక్షత్రాలుంటాయి.


తొలి కోటా స్థానం షూటింగ్‌లో  
2024 ఒలింపిక్స్‌ బెర్తు సాధించిన భవనీశ్‌

దిల్లీ: 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తొలి కోటా స్థానం అందుకుంది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పురుషుల ట్రాప్‌ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడం ద్వారా భవనీశ్‌ మేందిరత దేశానికి తొలి బెర్తు సంపాదించాడు. అతడు త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. క్వాలిఫయింగ్‌ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్‌ చేరిన భవనీశ్‌ పతక పోరులో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి 15 హిట్స్‌లో 13 పాయింట్లు సాధించిన అతడు తర్వాతి దశకు అర్హత సాధించలేకపోయాడు. ట్రాప్‌ విభాగంలో పురుషులు, మహిళల విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి ఒలింపిక్‌ బెర్తులు లభిస్తాయి.


ఒమన్‌పై భారత్‌ విజయం
అండర్‌-17 ఫుట్‌బాల్‌

దిల్లీ: భారత అండర్‌-17 బాలుర జట్టు స్నేహపూర్వక మ్యాచ్‌లో 3-1తో ఒమన్‌పై విజయం సాధించింది. భారత్‌ తరఫున గంగ్తె (10వ), తొక్‌చోమ్‌ (18వ), లాల్పెక్లువా (69వ) తలో గోల్‌ కొట్టారు. భారత్‌ రెండు పెనాల్టీలను సద్వినియోగం చేసుకుంది. ఏఎఫ్‌సీ అండర్‌-17 ఆసియాకప్‌ క్వాలిఫయర్స్‌కు సన్నాహకంగా ఈ మ్యాచ్‌ ఆడారు.


ఖరీదైన ఆటగాడిగా ఎబ్డెన్‌

ముంబయి: టెన్నిస్‌ ప్రిమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రీడాకారుల వేలం పాటలో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) అత్యధిక ధర పలికాడు. వింబుల్డన్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న ఎబ్డెన్‌ను దిల్లీ బిన్నీస్‌ బ్రిగేడ్‌ రూ.8.45 లక్షలకు కొనుక్కుంది. తెలుగమ్మాయి సౌజన్య బవిశెట్టిని రూ.3.50 లక్షలకు తీసుకుంది. బెంగళూరు స్పార్టాన్స్‌ రూ.4.55 లక్షలకు విష్ణువర్ధన్‌ను కొనుక్కుంది. దిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌, ముంబయి లియోన్‌ ఆర్మీ, చెన్నై స్టాలియన్స్‌, పుణె జాగ్వార్స్‌, గుజరాత్‌ పాంథర్స్‌, పంజాబ్‌ టైగర్స్‌ జట్లు టీపీఎల్‌లో బరిలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబరు 7 నుంచి 11 వరకు పుణెలో లీగ్‌ జరుగుతుంది.


క్రీడా పురస్కారాల దరఖాస్తు గడువు పొడిగింపు

దిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తు గడువును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పొడిగించింది. అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం ఆఖరు కాగా మరో మూడు రోజులు (అక్టోబరు 1 వరకు) గడువును పొడిగించినట్లు క్రీడా శాఖ తెలిపింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్యతో సహా పలు క్రీడా అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts